Apple iPhone 17 production: కీలక విషయాలను పక్కనపెట్టి.. తీసుకోవాల్సిన చర్యలను దూరం పెట్టి.. అమెరికాను గొప్పగా చేస్తానని డాంబికాలకు పోతున్నారు ప్రెసిడెంట్ ట్రంప్. ప్రపంచం మొత్తం గ్లోబల్ విలేజ్ గా మారిపోయింది అనే విషయాన్ని మర్చిపోయి.. వ్యాపారం అనేది ఇప్పుడు విశ్వవ్యాప్తమైపోయిందనే నిజాన్ని పక్కనపెట్టి అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా అమెరికా కంపెనీల విషయంలో మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల కాలంలో భారత్ మీద ట్రంప్ సుంకాల బాంబు వేసిన విషయం తెలిసిందే. దానికి తోడు అమెరికా కంపెనీలు ఇతర దేశాలలో కార్యకలాపాలు సాగించకూడదని.. ముఖ్యంగా వస్తువులను ఉత్పత్తి చేయకూడదని.. అమెరికా కేంద్రంగా వస్తువులు తయారుచేసి ప్రపంచ దేశాలకు దిగుమతి చేయాలని నెత్తి మాసిన మాటలు మాట్లాడారు. ముఖ్యంగా ఆపిల్ ఉత్పత్తుల విషయంలో ఆయన అత్యంత కఠినంగా మాట్లాడారు.
ఆయన మాటలను ఆపిల్ యాజమాన్యం పెద్దగా పట్టించుకోలేదు. పైగా ప్రపంచ వ్యాప్తంగా తాము ఉత్పత్తులు తయారు చేస్తామని.. భారత్ కేంద్రంగా తాము కార్యకలాపాలను ఎప్పటినుంచో ప్రారంభించామని.. ఇప్పటికిప్పుడు వాటిని నిలిపివేస్తే కుదరదని స్పష్టం చేసింది. అంతే కాదు ఆపిల్ తన ఉత్పత్తులకు సంబంధించి భారత దేశంలో మరో నగరాన్ని కూడా ఎంచుకుంది. ఇప్పటివరకు చెన్నై కేంద్రంగా ఆపిల్ ఉత్పత్తులు తయారయ్యేవి. ఇప్పుడు బెంగళూరుకు కూడా ఆపిల్ ఉత్పత్తుల తయారీ విస్తరించింది. దేశ ఐటీ రాజధానిగా బెంగళూరు పేరుపొందింది. బెంగళూరులో అమెరికా నుంచి మొదలు పెడితే ఇంగ్లాండ్ వరకు ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు తమ సంస్థలను ఏర్పాటు చేసుకున్నాయి. ఇక్కడి నుంచికార్యకలాపాలు సాగిస్తున్నాయి. తాజాగా ఆపిల్ కంపెనీ బెంగళూరులోని ఫాక్స్ కాన్ ప్లాంట్లో ఐఫోన్ 17 ఫోన్లో ఉత్పత్తిని మొదలుపెట్టింది.
Also Read: ఇక పురిటి నొప్పుల బాధ ఉండదు.. పిల్లల్ని కనబోతున్న రోబోట్స్
ఇప్పటికే చెన్నై యూనిట్లో తన ఉత్పత్తులను తయారు చేయడం మొదలు పెట్టింది. ఈ ఏడాది ఏకంగా ఆరు కోట్ల ఫోన్లు ఉత్పత్తి చేయాలని ఫాక్స్ కాన్ లక్ష్యంగా పెట్టుకుంది. కోట్ల రూపాయల వ్యయంతో బెంగళూరులో ప్లాంట్ ఏర్పాటు చేసింది. తాము రూపొందించిన 17 వెర్షన్ ను సెప్టెంబర్ లో మార్కెట్లోకి విడుదల చేస్తామని తయారీ సంస్థ వెల్లడించింది. అయితే ఇటీవలి కాలంలో చెన్నై ప్లాంట్ నుంచి చైనా నిపుణులు వెళ్లిపోయినప్పటికీ.. ఆ ప్రభావం పడకుండా అమెరికన్ కంపెనీ జాగ్రత్త తీసుకుంది. అంతేకాదు మన దేశంలోనే నిపుణులతో ఫోన్లను తయారు చేస్తోంది.