Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీRobot Birth Human Baby: ఇక పురిటి నొప్పుల బాధ ఉండదు.. పిల్లల్ని కనబోతున్న...

Robot Birth Human Baby: ఇక పురిటి నొప్పుల బాధ ఉండదు.. పిల్లల్ని కనబోతున్న రోబోట్స్

Robot Birth Human Baby: సాంకేతిక విప్లవం మనిషిని సోమరిని చేస్తోంది. అవసరమైన ఆవిష్కరణలతోపాటు అవసరం లేని ఆవిష్కరణలూ మార్కెట్‌లోకి వస్తున్నాయి. ఇవి మనిషిని లేజీగా చేస్తున్నాయి. కనీస పనులు కూడా చేసుకోకపోవడంతో చాలా మంది శారీరక వ్యాయామం లేక రోగాల బారిన పడుతున్నారు. ఒకవైపు ఒంటికి శ్రమ ఉండాలని ఉదయం, సాయంత్రం మైదానాల్లో కసరత్తు చేస్తున్నారు. జిమ్ముల్లో కొవ్వు కరగదీసుకుంటున్నారు. మరోవైపు ఇంటి పనులకు యంత్రాలను సమకూర్చుకుంటున్నారు. అమ్మతనం అనేది స్త్రీకి గొప్ప వరం. ప్రతీ మహిళ మాతృత‍్వం కోసం ఎదురు చూస్తుంది. కానీ పెరుగుతున్న టెక్నాలజీ, గ్లామర్‌ మోజు ఇప్పుడు అమ్మతనాన్ని అంగడి వస్తువును చేసింది. ఇప్పటికే అద్దె గర్భాల్లో పిల్లలను పెంచుతున్నారు. ఇక ఇప్పుడు చైనా దీనికి సాంకేతికతను జోడించింది. మరో అద్భుతమైన ఆవిష్కరణకు సిద్ధమవుతోంది. కృత్రిమ గర్భంతో పిల్లలను జన్మనిచ్చే రోబోను అభివృద్ధి చేస్తూ, సంప్రదాయ గర్భధారణ పద్ధతులకు ప్రత్యామ్నాయాన్ని అందించే దిశగా అడుగులు వేస్తోంది. సింగపూర్‌లోని నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీకి చెందిన డా. జాంగ్ కిఫెంగ్ నేతృత్వంలో ఈ పరిశోధన కొనసాగుతోంది. 2026 నాటికి ఈ రోబో ప్రోటోటైప్ సిద్ధం కానుంది. దీని ధర సుమారు రూ.12.96 లక్షలుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Also Read: పులివెందుల్లో ఓటమి అంచుల్లో వైఎస్.. చంద్రబాబు రంగంలోకి దిగారు.. ఆ తర్వాత ఏమైందంటే?

కృత్రిమ గర్భం ఎలా పనిచేస్తుంది?
ఈ రోబో కీలక భాగం కృత్రిమ గర్భం, ఇది సహజ గర్భధారణ ప్రక్రియను అనుకరిస్తుంది. ఈ రోబోలో అమ్నియోటిక్ ఫ్లూయిడ్‌ను పోలిన కృత్రిమ ద్రవంతో నిండిన గర్భాశయం ఉంటుంది. శిశువు అభివృద్ధికి అవసరమైన పోషకాలను ఒక ట్యూబ్ ద్వారా సరఫరా చేస్తారు. ఈ సాంకేతికత సంప్రదాయ ఇన్‌క్యుబేటర్లకు భిన్నంగా, గర్భం దాల్చినప్పటి నుంచి శిశు జననం వరకు పూర్తి ప్రక్రియను నిర్వహిస్తుంది. ఈ సాంకేతికత జంతు పరీక్షలలో విజయవంతమైన ఫలితాలను చూపించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు దీనిని హ్యూమనాయిడ్ రోబోలో అనుసంధానించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇనుములో హృదయము మొలిచెనే అని ఓ సినీకవి రాసినట్లుగా.. ఇనుములో ఇప్పుడు శిశువు ప్రాణం పోసుకోబోతోంది. ఈ రోబో ఆవిష్కరణ వైద్య, సామాజిక రంగాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకురాగలదు. సంతానలేమి సమస్యలతో బాధపడే జంటలకు ఇది కొత్త ఆశాకిరణంగా మారవచ్చు. సంప్రదాయ గర్భధారణ భారాన్ని తప్పించుకోవాలనుకునే యువతకు ఈ సాంకేతికత ఒక ప్రత్యామ్నాయంగా ఉపయోగపడవచ్చు. అయితే, ఈ సాంకేతికత సామాజిక నిర్మాణాలపై, ముఖ్యంగా కుటుంబ వ్యవస్థ, తల్లి-శిశు బంధంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి.

పరిమితి ఎక్కడ?
కృత్రిమ గర్భంలో శిశువు పెరగడం మానవ సంబంధాలపై ఎలాంటి మానసిక ప్రభావం చూపుతుంది? ఈ పద్ధతిలో జన్మించిన శిశువుల హక్కులు, వారి గుర్తింపు ఎలా ఉంటుంది? ఈ సాంకేతికత దుర్వినియోగం కాకుండా చూసేందుకు ఎలాంటి చట్టపరమైన చర్యలు అవసరం? ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుగొనేందుకు చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్ అధికారులతో కైవా టెక్నాలజీ సంప్రదింపులు జరుపుతోంది. సమాజం ఈ సాంకేతికతను ఎలా స్వీకరిస్తుందనేది ఇంకా చర్చనీయాంశంగా మిగిలిపోయింది. ఇక ఈ రోబో రూ.12.96 లక్షల ధరతో అందుబాటులో ఉంటుందా అనే సందేహం కలుగుతోంది. అయినప్పటికీ, సంతానలేమి చికిత్సలకు ప్రస్తుతం ఖర్చవుతున్న మొత్తాలతో పోలిస్తే, ఈ ధర సమంజసంగా కనిపిస్తోంది. ఈ సాంకేతికత వాణిజ్యపరంగా విజయవంతమైతే, భవిష్యత్తులో ధరలు తగ్గే అవకాశం ఉంది.

కృత్రిమ గర్భంతో రోబో శిశు జననం అనేది సైన్స్ ఫిక్షన్ నుంచి వాస్తవంగా మారుతున్న ఒక అద్భుతమైన ఆలోచన. ఈ సాంకేతికత సంతానలేమి సమస్యలను పరిష్కరించడంలో, గర్భధారణ సవాళ్లను తగ్గించడంలో గణనీయమైన పాత్ర పోషించగలదు. అయితే, దీని నీతి, సామాజిక, చట్టపరమైన పరిణామాలను జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular