Buddhadeb Bhattacharya: ప్రముఖ లెఫ్ట్ నాయకుడు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య(80) కన్నుమూశారు. దక్షిణ కోల్‌కతా లోని తన నివాసంలో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. కొంతకాలం శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆయన బాధపడ్డారు. గతేడాది న్యుమోనియా సోకడంతో లైఫ్ సపోర్టు పెట్టాల్సి వచ్చింది. తర్వాత ఆయన కోలుకున్నారు. తాజాగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో భట్టాచార్య కన్నుమూశారు. ఆయనకు భార్య మీరా, కుమారుడు సుచేతన్ ఉన్నారు.
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి కమ్యూనిస్టు రాజకీయ కురు వృద్ధుడు బుద్ధదేవ్ భట్టాచార్య గురువారం(ఆగస్టు 8న) కన్నుమూశారు. ఈమేరకు ఆయన తనయుడు చేతన్ ప్రకటించారు. 2000 నుంచి 2011 వరకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు. సీపీఎం అత్యున్నత నిర్ణయాధికార కమిటీ అయిన పొలిట్‌బ్యూరోలోనూ ఆయన సభ్యుడిగా సేవలు అందించారు. బుద్ధదేవ్ భట్టాచార్య 1944, మార్చి 9న జన్మించారు. కోల్‌కతా ప్రెసిడెన్సీ కాలేజీలో విద్యాభ్యాసం పూర్తిచేశారు. కొద్ది రోజుల పాటు ఉపాధ్యాయుడిగా పనిచేసిన అనంతరం 1966 కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. బెంగాల్‌లో జరిగిన ఆహార ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 1972లో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడిగా.. 1982లో ఆ పార్టీ సెక్రెటరీగా నియమితులయ్యారు. మొదటిసారి 1977 ఎన్నికల్లో కాషీపూర్–బెల్గచియా స్థానం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అదే ఎన్నికల్లో కాంగ్రెస్ పాలన ముగిసి కమ్యూనిస్ట్‌లు అధికారంలోకి వచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే మంత్రి పదవి వరించింది. వరుసగా 24 ఏళ్లు ఎమ్మెల్యేగా కొనసాగిన ఆయన తన ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి మనీష్ గుప్తా చేతిలో ఓడిపోయారు. సీనియర్ సీపీఐ(ఎం) నేత బుద్ధదేవ్ భట్టాచార్య జ్యోతిబసు క్యాబినెట్‌లో దాదాపు 18 ఏళ్ల పాటు మంత్రిగా ఉన్నారు. హెూం మంత్రిత్వ శాఖతో సహా అనేక ముఖ్యమైన మంత్రిత్వ శాఖలలో పనిచేశారు.
1977లో ఎన్నిక..
1977లో తొలిసారిగా కోసిపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బుద్ధదేవ్ భట్టాచార్య ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సాంస్కృతిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1982 ఎన్నికల్లో స్వల్ప తేడాతో భట్టాచార్య ఓడిపోగా.. తర్వాత సీపీఐ(ఎం) కేంద్ర కమిటీలో శాశ్వత సభ్యుడిగా నియమితులయ్యారు.ఓడిపోయినా పార్టీలో ఆయన స్థాయి పెరిగింది. 1987లో జాదవ్పూర్ నుంచి ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. దీని తర్వాత అతను జాదవ్పూర్ నుంచి ఎన్నికల్లో విజయపరంపర కొనసాగించారు. జ్యోతిబసు హయాంలో డిప్యూటీ సీఎంతో పాటు హెూంశాఖ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత జ్యోతిబసు వారసునిగా నిలిచారు. 2000లో అనారోగ్యం వల్ల జ్యోతిబసు సీఎం పదవికి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో పగ్గాలు చేపట్టారు. 2009లో భట్టాచార్య హయాంలో లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం అనుసరించి పారిశ్రామిక విధానం ఆ పార్టీ పతనానికి కారణమైంది. నందిగ్రామ్‌లో భూసేకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమాన్ని మమతా బెనర్జీ ముందుండి నడిపించి.. వామపక్షాలపై అద్భుత విజయానికి బాటలు వేసుకున్నారు.
ఐదు దశాబ్దాల రాజకీయ జీవితం..
బుద్ధదేవ్ భట్టాచార్య ఐదు దశాబ్దాలు రాజకీయాల్లో ఉన్నారు. 18 ఏళ్లు మంత్రిగా, 11 ఏళ్లు సీఎంగా పనిచేశారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు కూడా బంగ్లా కొనేందుకు నిరాకరించారు. అనేక పదవులు అనుభవించి కూడా సొంత బంగ్లా, కారు లేదు. ఆయన తన జీతాన్ని కూడా పార్టీ ఫండ్‌కే అందజేసేవారు. బుద్ధదేవ్ భట్టాచార్య మంత్రిగా, సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆయన కుటుంబసభ్యులు ప్రజా రవాణాలో మాత్రమే ప్రయాణించేవారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Former west bengal chief minister buddhadeb bhattacharya passed away
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com