Indigo Crisis: ఇండిగో సంస్థ అర్థాంతరంగా విమానాలను రద్దు చేయడంతో దేశవ్యాప్తంగా కొద్దిరోజులుగా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.. స్వయంగా కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగినప్పటికీ పరిస్థితి సద్దుమణగడానికి ఇంకా సమయం పట్టే విధంగా కనిపిస్తోంది. దీనికి తోడు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై అత్యంత సీరియస్ గా ఉంది. ఇండిగో సంస్థ అసలు కథ ఏమిటో చూడాలని విచారణకు ఆదేశించింది.
ఇండిగో సంక్షోభం నేపథ్యంలో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇండిగో సంక్షోభం చోటు చేసుకోవడానికి గుత్తాధిపత్యమే ప్రధాన కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం మనదేశంలో ఏవియేషన్ రంగంలో ఇండిగో సంస్థకు 63% వాటా ఉంది. ఎయిర్ ఇండియా కు 20% వాటా ఉంది. ఇక మిగతా సంస్థలకు ఉన్న వాటా అంతంత మాత్రమే.
2014లో ఇండిగో సంస్థకు 31.8%, జెట్ ఎయిర్ వేస్ సంస్థకు 21.7%, ఎయిర్ ఇండియాకు 18.4%, స్పైస్ జెట్ కు 17.4%, గో ఎయిర్ సంస్థకు 9.2% ఉండేది. ఇటీవల కేంద్రం అహ్మదాబాద్ ఘటన తర్వాత సరికొత్త నిబంధనలను అందుబాటులోకి తీసుకురావడంతో ఇండిగో సంస్థకు ఊపిరి ఆడని పరిస్థితి ఏర్పడింది. సివిల్ ఏవియేషన్ రంగంలో గుత్తాధిపత్యం ఉండడంతో ఇండిగో సంస్థ ఉన్నట్టుండి విమానాలను రద్దు చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనకు తగ్గట్టుగా సిబ్బందిని నియమించుకోవడంలో ఇండిగో సంస్థ నిర్లక్ష్యం ప్రదర్శించింది. దీంతో విమానాలు రద్దయ్యాయి. సర్వీసులను నిలిచిపోవడంతో ప్రయాణికులకు విమానాశ్రయాలలో నరకం కనిపించింది. వాస్తవానికి ఈ రంగంలో గట్టి పోటీ ఉంటే ఇలా జరిగి ఉండేది కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
గతంలో టెలికాం రంగంలో ఎయిర్ సెల్, డొకోమో, టెలినార్, ఎంటిఎన్ఎల్, రిలయన్స్, యూనినార్ వంటి సంస్థలు ఉండేవి. ఇవన్నీ దివాలా తీయడం లేదా ఇతర కంపెనీలలో విలీనం కావడంతో ఇప్పుడు కేవలం ఎయిర్టెల్, జియో, వోడాఫోన్ వంటి సంస్థలు మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో బిఎస్ఎన్ఎల్ ఉంది.. బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ చాలా తక్కువ కాబట్టి ప్రైవేట్ ఆపరేటర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అడ్డగోలుగా టారిఫ్ లు విధించి యూజర్ల జేబులు గుల్ల చేస్తున్నారు.