IndiGo Flight Cancellation Crisis: దేశంలో ఇప్పుడు కనిపిస్తోంది విమాన సంక్షోభం. దేశీయ విమానయానంలో 60 శాతం షేరింగ్ కలిగిన ఇండిగో( Indigo) విమానయాన సంస్థ గుత్తాధిపత్యం, దాని వ్యక్తిగత ఇబ్బందులు తో దేశం మొత్తం బాధపడుతోంది. అలాగని ఇండిగో సంస్థను తక్కువ చేసి మాట్లాడలేం. ధర, సమయపాలన, సేవల్లో ఆ సంస్థ ముందంజలో ఉంది. దాని స్థాయికి ఇతర పౌర విమానయాన సంస్థలు చేరలేకపోతున్నాయి. అయితే ఓ ప్రైవేటు సంస్థ వ్యక్తిగత కార్యకలాపాలతో ప్రభుత్వానికి అంత సంబంధం ఉండదు. రోజువారి కార్యకలాపాలను తొంగి చూసే పరిస్థితి కూడా ఉండదు. కానీ ఇప్పుడు ఇండిగో విమాన సంక్షోభాన్ని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పై నెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సో కాల్డ్ మేధావులు బురద జల్లేందుకు సిద్ధపడుతున్నారు.
* ఆ నిబంధనలతోనే సంక్షోభం..
కేంద్ర ప్రభుత్వం విమాన పైలెట్ల విషయంలో ఏడాదిన్నర కిందట నిబంధనలను పెట్టింది. పౌర విమానయాన ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలోనే అతిపెద్ద పౌర విమానయాన సంస్థగా ఉన్న ఇండిగో ఈ ఏడాదిన్నర కాలంలో నిర్లక్ష్యం చేసింది. సంస్థలో నెలకొన్న సంక్షోభాన్ని దాచి పెట్టింది. ఎప్పుడైతే ఇండిగో తమ సర్వీసులను నిలిపివేసిందో తక్షణం పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న కింజరాపు రామ్మోహన్ నాయుడు( Ram Mohan Naidu) రంగంలోకి దిగారు. ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేశారు. అప్పటికప్పుడు ఇండిగో పై చర్యలు తీసుకుంటే మరింత సంక్షోభానికి దారితీస్తుంది. అందుకే కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇండిగో సంస్థ యాజమాన్యాలతో మాట్లాడారు. పైలెట్లకు సంబంధించి కొన్ని రకాల నిబంధనలకు మినహాయింపు ఇచ్చారు. కానీ ఇది తెలియకుండా కొంతమంది సో కాల్డ్ మేధావులు రంగంలోకి దిగి అదే పనిగా రామ్మోహన్ నాయుడు పై విమర్శలకు దిగుతున్నారు.
* టికెట్ ధరల నియంత్రణ..
వాస్తవానికి ఇండిగో విమానయాన సంక్షోభంతో ఇతర ఎయిర్లైన్స్( Airlines ) భారీగా టికెట్ ధరలు పెంచినట్లు వార్తలు వచ్చాయి. వెంటనే నియంత్రణ చర్యలు చేపట్టింది పౌరవిమానయాన శాఖ. టికెట్ ధరల పెంపు అనేది ఉండకూడదు అని ఆదేశాలు ఇచ్చింది. ఇతర ఎయిర్ లైన్స్ అదనపు సర్వీసులు తిప్పుకునేందుకు సైతం అనుమతులు జారీ చేసింది. అయితే ఒకటి నిజం. ఇండిగో సంస్థకు దేశీయ విమానయానంలో 60 శాతం ఆక్యుఫెన్సీ ఉంది. దానిని అధిగమించేందుకు అవసరమైన ప్రోత్సాహం ఇతర ఎయిర్లైన్స్ కు అందించాల్సిన అవసరం మాత్రం పౌర విమానయాన శాఖపై ఉంది. ఒక ప్రైవేటు సంస్థ పై ఆధారపడడం అనేది మాత్రం ఇలాంటి సంక్షోభాలకు దారి తీసే అవకాశం ఉంది. దీనిని గుణ పాఠాలుగా నేర్చుకొని పౌర విమానయాన శాఖ సంస్కరణలకు సిద్ధమైతేనే.. మరో ప్రైవేట్ సంస్థ ఇటువంటి పరిస్థితికి దిగదు.