JD Lakshminarayana: సిబిఐ జేడి మాజీ లక్ష్మీనారాయణ రూటు మార్చారా? వైసీపీ వైపు ఆయన అడుగులు వేస్తున్నారా? ఇటీవల ఆయన వైసీపీ సర్కార్ను అభినందించడానికి అదే కారణమా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. తాజాగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమానికి హాజరైన ఆయన జగన్ సర్కార్ చర్యలను ప్రశంసించారు. ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉన్నాయని కొనియాడారు. ఇప్పుడు జెడి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడుఇదే జగన్ కేసుల్లో సిబిఐ డైరెక్టర్ గా లక్ష్మీనారాయణ ఉండేవారు. ఆయన ఇంటి పేరు ఎవరికీ తెలియదు కానీ.. జేడీ లక్ష్మీనారాయణ గా సుపరిచితులు కావడానికి కారణం ముమ్మాటికీ జగన్ కేసులే. ఒక అధికారిగా జగన్ కేసులు విచారణ చేపట్టిన లక్ష్మీనారాయణ.. ఇప్పుడు అదే జగన్ ను ప్రశంసించడం విశేషం.
సిబిఐ డైరెక్టర్ గా ఉన్న లక్ష్మీనారాయణ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. రాజకీయాల వైపు అడుగులు వేశారు. గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా విశాఖ లోక్ సభ స్థానానికి పోటీ చేశారు. రెండున్నర లక్షలకు పైగా ఓట్లు సాధించారు. ఎన్నికల అనంతరం పవన్ సినిమాల్లో నటించడానికి తప్పుపడుతూ జనసేనను వీడారు. అప్పట్నుంచి స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను చేపడుతూ వస్తున్నారు. చాలా గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో విశాఖ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలన్న యోచనలో ఉన్నారు. గతంలో జనసేనను వేయడంతో ఆ పార్టీలో చేరేందుకు ఆలోచిస్తున్నారు. అటు పవన్ సైతం పెద్దగా ఆసక్తి చూపడం లేదని ప్రచారం జరుగుతోంది. బిజెపి వైపు అడుగులు వేయాలనుకున్నా.. ఇప్పటికే ఆ పార్టీలో విశాఖ లోక్సభ స్థానం ఆశావాహులు ఉన్నారు. అటు తెలుగుదేశం పార్టీలో సైతం అదే పొజిషన్. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీ వైపు చూస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ జగన్ కేసుల విచారణ ప్రధాన అధికారిగా ఉన్న ఆయన పార్టీలో చేరితే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని టాక్ నడిచింది. కానీ అనూహ్యంగా ఆయన జగన్ ప్రశంసలతో ముంచేత్తడంతో అనుమానాలు మరింతగా బలపడుతున్నాయి. కర్నూలు జిల్లాలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఆహ్వానం మేరకు జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అదో గొప్ప పథకంగా అభివర్ణించారు. నాడు నేడు పథకంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చిన జగన్ను అభినందించారు. ఇతర రాష్ట్రాలకు సైతం ఈ పథకాలు ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు.
గతంలో చాలా విషయాల్లో జేడీ లక్ష్మీనారాయణ జగన్ సర్కార్ కు మద్దతు ఇచ్చారు. ఆ మధ్యన ప్రభుత్వం జీవో నెంబర్ 1 జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే అది విపక్షాలను కట్టడి చేసేందుకేనని విమర్శలు వచ్చాయి. ఆ సమయంలో జెడి లక్ష్మీనారాయణ స్పందించారు. పోలీసుల అనుమతితో సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి వీలుగా జారీచేసిన జీవోను సమర్థించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రభుత్వం నిర్మిస్తున్న కిడ్నీ రీసెర్చ్ కేంద్రాన్ని పరిశీలించారు. కిడ్నీ రోగులు కోసం రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిస్తోందని అభినందించారు. అక్కడికక్కడే జిల్లా మంత్రి సీదిరి అప్పలరాజు కు ఫోన్ చేశారు. ప్రభుత్వ చర్యలను అభినందించారు. అయితే జేడీ లక్ష్మీనారాయణ వ్యవహార శైలి చూస్తుంటే అధికార వైసీపీ వైపు చూస్తున్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వ కార్యక్రమానికి ఆహ్వానించేంతటి పరిస్థితి వచ్చిందంటే ఏదో జరుగుతుందన్న అనుమానాలు వెలువడుతున్నాయి.