ముక్కుసూటిగా ఉండే మన తెలుగు కోడలు , దేశానికి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పై ఆమె వైఖరి నచ్చక స్వచ్ఛంద పదవి విరమణ పొందిన కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ ఏడాది తర్వాత సంచలన ఆరోపణలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థపై కనీస అవగాహన నిర్మలకు లేదంటూ వ్యాఖ్యానించి దుమారం రేపారు.
దివంగత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో కలిసి పనిచేయడం వ్యక్తిగతంగా వృత్తిపరంగా తనకు చాలా ఉత్తమమని సుభాష్ చంద్ర వ్యాఖ్యానించడం విశేషం. ప్రజా విధాన సమస్యలను అవగతం చేసుకున్న మాస్టర్ మైండ్ అరుణ్ జైట్లీ అని కొనియాడారు. ఆయన కార్యదర్శకులకు స్వేచ్ఛనిచ్చేవారని.. నిర్మల తనపై నమ్మకం అనిపించలేదని చాలా అసౌకర్యంగా ఉండేదని గార్గ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ నుంచి కేంద్రం పక్కకు పోవడం.. ఆర్థిక మంత్రితో తన సంబంధాలు బాగా లేకపోవడమే తాను వైదొలగడానికి కారణమని సుభాష్ చంద్ర ఆరోపించారు. భిన్నమైన వ్యక్తిత్వం, నాలెడ్జ్ ఎండోమెంట్, నైపుణ్యం, ఎకనామిక్ పాలసీలకు సంబంధించి సరియైన విధానాన్ని కలిగి ఉన్నారంటూనే ఆమెతో పనిచేయడం కష్టమని గార్గ్ వ్యాఖ్యానించారు.
అలాగే 10 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం సాధ్యంకాదనే విషయం తనకు ప్రారంభంలోనే స్పష్టమైందని ఆయన పేర్కొన్నారు.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో కలిసి పనిచేయడం కష్టంగా తాను భావించానని సుభాష్ చంద్ర గార్గ్ కుండబద్దలు కొట్టారు. ఆమెతో తనకు కలిసి రాలేదన్నారు. ఆర్థిక మంత్రి తన బదిలీ కోరేకంటే ముందే తమ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయనీ చెప్పుకొచ్చారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వైఖరి నచ్చక స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ వ్యవహారం అప్పట్లో సంచలనమైంది. గత ఏడాది అక్టోబర్ 31న ఆయన స్వచ్ఛందంగా రిటైర్ అయ్యారు.ఆ రాజీనామాకు గల కారణంపై ఏడాది తర్వాత శనివారం తన బ్లాగ్ లో కీలక అంశాలతో పోస్ట్ పెట్టి సంచలనం సృష్టించారు. తాను రాజీనామా చేయడానికి నిర్మలనే కారణమని.. ఆమెకు ఆర్థిక వ్యవస్థపై నిలబెట్టడంపై అవగాహన లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.