Food Safety and Standards in AP: ఏపీలో ఆహార భద్రతా ప్రమాణాలు గాలికొదిలేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆహార కల్తీ నియంత్రణ కోసం చేపట్టాల్సిన పరీక్షలు గత మూడు నెలలుగా నిలిచిపోయాయి. దీనికి ప్రభుత్వ తీరే కారణం. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఆహార కల్తీ నియంత్రణ శాఖ పరిధిని తెలియజేస్తూ నోటీఫికేషన్ ఇవ్వాలి. అందుకు అనుగుణంగా ఫుడ్ కంట్రోలర్లను నియమించాలి. కానీ నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వలేదు. అధికారుల పరిధి తెలియజేయలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా శాంపిళ్ల సేకరణకు బ్రేక్ పడింది. ప్రభుత్వం మాత్రం అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తుందే తప్ప నోటిఫికేషన్ ఇవ్వడం లేదు. నోటిఫికేషన్ ఇస్తే తప్ప పని మొదలు పెట్టలేమని ఫుడ్ కంట్రోలర్లు చెబుతున్నారు. దీంతో గత మూడు నెలలుగా ప్రజారోగ్యానికి తీరని భంగం వాటిల్లుతోంది. టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు..ఇలా ఆహార పదార్థాల తయారీకి సంబంధించి సంస్థలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. ముఖ్యంగా కొవిడ్ అనంతరం చాలామంది యువత ఉద్యోగాల కంటే స్వయం ఉపాధి పథకాలపైనే దృష్టిసారించారు. సొంత గ్రామం, పట్టణంలో ఉపాధినిచ్చే పథకాలను ఏర్పాటుచేసుకున్నారు.

ఈ క్రమంలో ఆహార పదార్థాల తయారీ, విక్రయాలపైనే ఎక్కువ మంది ఆధారపడ్డారు. అయితే చాలావరకూ ఆహార పదార్థాల తయారీలో నిషేధిత వస్తువులు వినియోగిస్తున్నారు.శుచి, శుభ్రత పాటించడం లేదు. హోటళ్ల నిర్వహణలో కనీస నిబంధనలు పాటించడం లేదు. అయితే వీటిని నియంత్రించాల్సిన అధికారుల జాడ లేదు. ఇదేమని వారిని ప్రశ్నిస్తుంటే తమ పరిధిని తెలియజేస్తూ ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన రాలేదని వారు చెబుతున్నారు. జిల్లాలను విభజించిన ప్రభుత్వం అందుకు తగ్గట్టు శాఖ పరిధిని తెలియజేస్తూ నోటిఫికేషన్ ఇవ్వాలి. కానీ మూడు నెలలు గడుస్తున్నా ఆహార కల్తీ నియంత్రణ శాఖకు మాత్రం ఎటువంటి ఆదేశాలు కానీ.. ఉత్తర్వులు కానీ విడుదల చేయలేదు. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: GoodMorningCMSir : జగన్ కాచుకో.. నేటి నుంచే పవన్ కళ్యాణ్ ‘డిజిటల్ వార్’ షురూ..
అధికారుల కొరత…
ఇండియన్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం) ఆధ్వర్యంలో జిల్లాకు ఒక అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, రెవెన్యూ డివిజన్ కు ఒక ఫుడ్ సెఫ్టీ ఆఫీసర్ ఉండాలి. కానీ కొన్ని జిల్లాలో పూర్తిస్థాయిలో అధికారులు లేరు. ఒకరిద్దరుతో సరిపెడుతూ వస్తున్నారు. ఒక్కో జిల్లాలో మూడు డివిజన్లు ఉంటే ఒక్కరే విధులు నిర్వహిస్తున్నారు. ఆహార కల్తీ నియంత్రణ శాఖలో నూతన నియామకాలు లేకపోవడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో జిల్లాల పునర్విభజనతో శాఖ పరమైక కష్టాలు ప్రారంభమయ్యాయి. 13 జిల్లాలు కాస్తా 26 జిల్లాలు అయ్యాయి. రెవెన్యూ డివిజన్ల సంఖ్య కూడా పెరిగింది. అధికారుల విభజన ఉన్నతాధికారులకు కత్తిమీద సాముగా మారింది. దీంతో కొత్త జిల్లాలకు సంబంధించి అధికారుల పరిధిని నిర్దేశిస్తూ నోటిఫికేషన్ లో ఎడతెగని జాప్యం జరుగుతోంది. అయితే ఫుడ్ సెఫ్టీ అధికారుల పరిధికి సంబంధించి ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఒకటి రెండు రోజుల్లో ప్రకటించే అవకాశముందని ఆ శాఖకు సంబంధించి అధికారులు చెబుతున్నారు.
నిబంధనలు కానరావు..
వాస్తవానికి నిబంధనల ప్రకారం ప్రతీ 50 వేల మంది జనాభాకు ఒక ఫుడ్ సెఫ్టీ ఆఫీసర్ ఉండాలన్న నిబంధన ఉంది. కానీ అదెక్కడా అమలవుతున్న దాఖలాలు లేవు. దీంతో ఆహార పదార్థాల తయారీలో కనీస నిబంధనలు పాటించడం లేదు. కాలం చెల్లిన వస్తువులతో ఆహారాన్ని తయారుచేస్తున్నారు. రుచి కోసం రకరకాల రసాయనాలను , నిషేధిత వస్తువులను వినియోగిస్తున్నారు. దీంతో ప్రజారోగ్యానికి తీరని భంగం వాటిల్లుతోంది. వాటనిి తీని ప్రజలు ఏరికోరి రోగాలను కొని తెచ్చుకుంటున్నారు. అసలు ఆహార కల్తీ నియంత్రణ శాఖ ఒకటుందని ప్రజలకు తెలియదంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.

నిజంగా ‘పరీక్షే’
ఆహార కల్తీని తేల్చేందుకు పూర్తిస్థాయి ల్యాబ్ ఏపీలో లేదు. విశాఖలోని ప్రాంతీయ ఫుడ్ అనాలసిస్ ల్యాబ్ నే ప్రస్తుతానికి వాడుకుంటున్నారు. అయితే అత్యాధునిక సదుపాయాలు లేకపోవడంతో నిర్థారణ పరీక్షలు సక్రమంగా జరగడం లేదు. రాష్ట్ర విభజన తరువాత ల్యాబ్ ను విస్తరించే పనులు చేపడుతున్నట్టు ప్రభుత్వం చెబుతున్నా ఇంతవరకూ కొలిక్కి రాలేదు. రాష్ట్రస్థాయి ఫుడ్ అనాలసిస్ ల్యాబ్ గా తీర్చదిద్దడంలో జాప్యం జరుగుతోంది. అటు హైదరాబాద్ ల్యాబ్ కు తరలిస్తున్న కొన్ని నమూనాలు తిరస్కరణకు గురవుతున్నాయి. బయట ల్యాబుల్లో చేయించాలంటే నెలకు సగటున కోటి రూపాయలు ఖర్చవుతోంది. విశాఖ ప్రాంతీయ ల్యాబ్ ను రాష్ట్రస్థాయి ల్యాబ్ గా అధునీకరిస్తేనే సాయం చేస్తామని కేంద్రం చెబుతోంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి చూసి మౌనం దాల్చింది. మరోవైపు ఆహర కల్తీ నియంత్రణ శాఖపై అవినీతి మచ్చ పడింది. ఏళ్ల తరబడి ఒకేచోట పనిచేస్తున్న అధికారులు నమూనాల సేకరణ, హోటళ్లు, ఆహార తయారీ సంస్థల లైసెన్సుల జారీ ప్రక్రియలో భారీగా అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
Also Read:Damaged Roads in AP: గుంతల్లో రహదారులను వెతుక్కుంటున్న ప్రజలు.. గడువు దాటుతున్న సీఎం జగన్ ప్రకటనలు
[…] […]