
Rajamouli: దర్శకుడు రాజమౌళి ఎన్నికల ప్రచారం చేయనున్నారు. అయితే రాజకీయ పార్టీ తరపున కాదు. ఎన్నికల సంఘం తరపున. కర్ణాటక రాయచూర్ జిల్లాలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఓటర్లలో అవగాహన కలిగించేందుకు రాజమౌళి ప్రచారం చేయబోతున్నారు. ఈ మేరకు రాయచూర్ జిల్లా పాలనాధికారి చంద్రశేఖర్ నాయక్ ఈ మేరకు ప్రకటన చేశారు.ఓటింగ్ శాతం పెంచేందుకు రాజమౌళితో ప్రచారం చేయిస్తున్నారు. రాజమౌళి కర్ణాటక మూలాలున్న తెలుగువాడు. ఆయన పుట్టింది కర్ణాటకలోనే. అక్కడ ఆయనకు భారీ అభిమానగణం కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఎన్నికల అవగాహన ప్రచారకర్తగా ఆయన్ని ఎంచుకున్నారు. పక్క రాష్ట్రాల అధికారులు రాజమౌళి సహాయం తీసుకోవడం గొప్ప విషయం.
రాజమౌళి రాజకీయాల గురించి ఎప్పుడూ స్పందించింది లేదు. అయితే ఆయనకు ఆసక్తి ఉంది. గతంలో లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ తో కలిసి పనిచేశారు. అలాగే రాజమౌళి తండ్రి బీజేపీ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయన ఆ పార్టీ సానుభూతి పరుడిగా ఉన్నారు. ఆర్ ఎస్ ఎస్ భావజాలాన్ని ఉద్దేశిస్తూ విజయేంద్ర ప్రసాద్ కథను రాశారట. ఈ విషయాన్ని రాజమౌళి ఇటీవల వెల్లడించారు.
ఆర్ ఎస్ ఎస్ గురించి నాకేమీ తెలియదు. కానీ మా నాన్నగారు రాసిన స్క్రిప్ట్ నాతో కన్నీరు పెట్టించింది. ఆ కథ తెరకెక్కించే ఛాన్స్ నాకు వస్తుందో రాదో తెలియదు కానీ, గొప్ప చిత్రం అవుతుందంటూ ఎమోషనల్ అయ్యారు. మన దేశంలో ఆర్ ఎస్ ఎస్ సంస్థను కొన్ని పార్టీలు, వర్గాలు శత్రువుగా చూస్తాయి. కరుడుగట్టిన హిందూవాదులుగా వాళ్లకు పేరుంది. అలాంటి సంస్థను ఇతివృత్తంగా తీసుకుని కథ రాయడం ఆయన బీజేపీ వాది అన్న విషయాన్ని నిరూపిస్తుంది.
గత ఏడాది విడుదలైన ది కాశ్మీర్ ఫైల్స్ ఒక వర్గం నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. అది బీజేపీ పార్టీ ప్రోపగాండా మూవీగా అభివర్ణించారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా హెడ్ నవద్ లాపిడ్ గోవా ఫిల్మ్ ఫెస్టివల్ లో ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని ప్రదర్శించడాన్ని అభ్యంతరం తెలిపారు. దాన్ని ఒక పొలిటికల్ ప్రోపగాండా చిత్రం అంటూ విమర్శలు చేశారు.