అత్త తిట్టినందుకు కాదు బాధ తోడి కోడలు నవ్వినందుకు అన్నట్టుగా ఉంది ఏపీ పరిస్థితి. పులిచింతల ప్రాజెక్టు గేటు విరిగిపోవడంతో నీరంతా వృథాగా సముద్రం పాలవుతోంది. ఇన్నాళ్లు తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తే నీటిని అక్రమంగా వాడుకుంటుందని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసింది. సుప్రీంకోర్టులో పిటిషన్ సైతం వేసింది. దీంతో నీరు వృథాగా పోతే ఏం లేదు కానీ తెలంగాణ వాడుకుంటే తప్పు పడుతుందని తెలంగాణ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వరదల కారణంగా ప్రవాహం పెరగడంతో ప్రాజెక్టు గేటు కొట్టుకుపోవడంతో ఏపీ మంత్రి అనిల్, కొడాలి నాని వంటి వారు ఏదో తూతూ మంత్రంగా వచ్చి పరిశీలించి వెళ్లిపోయారు. కానీ ఏ పరిష్కార మార్గం సూచించకపోవడం గమనార్హం.
పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగింది. 2004లో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా పర్యావరణ అనుమతులు, ఇతర అంశాల పనులు ఆలస్యం కావడంతో 2013లో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేశారు. పనుల నాణ్యతపై ఎన్ని విమర్శలు వచ్చినా చివరకు పనులు కానిచ్చేశారు. దీంతో నీటిని నిల్వ చేసే అవకాశం దక్కింది. చంద్రబాబు హయాంలో పరిహారం పూర్తిస్థాయిలో చెల్లించడంతో 40 టీఎంసీల మేర నీటి నిల్వ చేస్తున్నారు.
ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరదలతో ప్రాజెక్టులోని నీరు దిగువకు విడుదల చేసే క్రమంలో గేటు కొట్టుకుపోయిందని తెలుస్తోంది. మిగిలిన గేట్లు కూడా శబ్దాలు చేస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టును ఎవరు నిర్వహిస్తున్నారో తెలియడం లేదు. బకాయిలు చెల్లించడం లేదని కాంట్రాక్టర్ పట్టించుకోవడం లేదు. దీంతో ప్రాజెక్టు వ్యవహారాలపై ఎవరు స్పందించడం లేదు. పులిచింతల ప్రాజెక్టు నిర్వహణపై అందరు గాలికి వదిలేయడంతోనే గేటు కొట్టుకుపోయినట్లు సమాచారం.
కృష్ణానదికి వరదలు వచ్చిన నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తారు. వాటిని మూసే క్రమంలో గేట్లకు పడవ అడ్డం పడింది. దీంతో దాన్ని ఎలా తీయాలో కూడా ఎవరికి అర్థం కాలేదు. చివరకు నీరంతా వెళ్లిపోయాక తీశారు. ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టుల విషయంలో శ్రద్ధ చూపాల్సిన అవసరం ఏర్పడింది. దీనిపై ఇప్పటివరకు ఎన్నో ఆరోపణలు సైతం వస్తున్నాయి.