Ganta Srinivasa Rao: గత కొంతకాలంగా ఆయన రాజకీయంగా సైలెంట్ అయ్యారు. చేతిలో ఎమ్మెల్యే పదవి ఉన్నా..ఎక్కడా వాయిస్ వినిపించడం లేదు. తాను ఎన్నికైన పార్టీకి సైతం దూరంగా ఉన్నారు. అటువంటి వ్యక్తి ఉన్నట్టుండి ఎందుకు తెరపైకి వచ్చారు? ప్రభుత్వంపై ఎందుకు విరుచుకుపడుతున్నారు? దీని వెనుక వున్న వ్యూహమేమిటి? అన్నదే ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆయన ఎవరంటే.. సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. గత రెండున్నర దశాబ్దాలుగా రాజకీయంగా ఆయనది విభిన్న శైలి. సుదీర్ఘ కాలం టీడీపీ ఆయన ప్రస్థానం సాగినా.. నిత్యం పదవిలో ఉండడం ఆయన ప్రత్యేకత. అనూహ్యంగా అనకాపల్లి ఎంపీగా ఎన్నికైన గంటా.. తరువాత చోడవరం ఎమ్మెల్యేగా, మంత్రిగా సుదీర్ఘ కాలం పనిచేశారు.
టీడీపీతో రాజకీయ అరంగేట్రం చేసి పదవులు నిర్వర్తించిన గంటా 2009లో ప్రజారాజ్యం ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. చిరంజీవి వెంట అడుగులు వేశారు. విశాఖ జిల్లాలో పీఆర్పీకి అత్యధిక స్థానాలు దక్కించుకోవడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. కానీ తరువాత పీఆర్పీని చిరంజీవి కాంగ్రెస్ లో విలీనం చేశారు. దీంతో గంటాకు అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో అమాత్య పదవి దక్కింది. అటు తరువాత 2014లో విభజన పుణ్యమా అని కాంగ్రెస్ దారుణంగా దెబ్బతింది. దీంతో గంటా మళ్లీ టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చారు. 2014లో టీడీపీ అధికారంలోకి రావడంతో మరోసారి మంత్రి పదవిని దక్కించుకున్నారు. అటు తరువాత 2019 ఎన్నికల్లో విశాఖ ఉత్తరం నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. కానీ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అక్కడ నుంచి ఆయన టీడీపీలో ఉన్నారన్న మాటే కాని పూర్తి నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. అటు వైసీపీలోకి వెళతారని ప్రచారం జరిగినా.. అది కూడా కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు ఉద్యమం తెరపైకి వచ్చింది. ఉద్యమానికి మద్దతుగా ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా స్పీకర్ అమోదించలేదు. నేరుగా ఆయన స్పీకర్ ను కలిసి రాజీనామాకు గల కారణాలు వివరించినా ఇంతవరకూ దీనిపై స్పష్టత లేదు. ప్రస్తుతం ఆయన భౌతికంగా టీడీపీలో ఉన్నా పార్టీ కార్యక్రమాల్లో సైతం పాల్గొన్న దాఖలాలు లేవు.
Also Read: Power Cuts In Telangana: కేసీఆర్ సార్.. ఇలా ‘కరెంట్’ షాకిస్తాడని అనుకోలేదు..!
దాదాపు ఆయన మూడేళ్ల పాటు బయట కనిపించ లేదు. అయితే తొలి సారి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డిపై విమర్శల వర్షం కురిపించారు. ఆయన తనను తాను ఇప్పటి వరకూ బలంగా చూపించుకున్నారని కానీ ఆయన అత్యంత బలహీన నాయకుడని ఇప్పుడు తేలిపోయిదని ఎద్దేవా చేశారు. టీడీపీ కండువాలతో టీడీపీ నేతలతో కలిసి ప్రెస్ మీట్ పెట్టిన గంటా శ్రీనివాస్ జగన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేబినెట్‌లో చోటు దక్కలేదని సీఎం దిష్టిబొమ్మను, బైక్‌లను టైర్లను కాల్చుతూ సొంత పార్టీ నేతలుఆందోళనలు చేయటం మొదటి సారి చూశానన్నారు. సామాజిక, ప్రాంత సమతుల్యత లేని కేబినెట్ అని గంటా తేల్చేశారు. రాజధాని అని ప్రచారం చేస్తున్నారు కానీ విశాఖకు మంత్రి పదవి లేకుండా చేశారన్నారు. విజయవాడకు, తిరుపతికి అలాగే 8 జిల్లాలకు మంత్రులు లేకుండా చేశారని ఇదేం సమీకరణమని గంటా ప్రశ్నించారు.
అధికార పక్షం..విపక్షంలో కొత్త చర్చ
అయితే గంటా వ్యాఖ్యలు, వ్యవహార శైలిపై అటు అధికార పక్షం, ఇటు సొంత పార్టీలో సైతం చర్చ సాగుతోంది. ఇన్నాళ్లూ వ్యాపార రీత్య సవాళ్లు ఎదురవుతాయని భయపడ్డారు. కానీ రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులతో ఆయన బయటకు వచ్చారన్న ప్రచారం సాగుతోంది. తొలుత వైసీపీలోకి వెళతారని అంతా భావించారు. కానీ అక్కడ ఆయనకు అనుకూల పరిస్థితులు లేవు. దీంతో తాత్కాలికంగా ఆయన ప్రయత్నాలకు ఫుల్ స్టాప్ పడింది. ఆది నుంచి గంటా చేరికను విజయసాయి రెడ్డి అడ్డుకున్నట్టు ప్రచారం సాగింది. అటు తరువాత గంటా బీజేపీలో చేరుతారన్న టాక్ వినిపించింది. అటువైపుగా కూడా వెళ్లలేదు. జనసేనకు దగ్గరయ్యారన్న ప్రచారం ఉంది. అయితే వీటన్నింటినీ తెరదించుతూ ఆయన టీడీపీ కండువాతో ప్రెస్ మీట్ పెట్టారు. టీడీపీలో చేరికలు ఉంటాయని చెప్పుకొచ్చారు. అయితే జనసేనతో టీడీపీ పొత్తు ఖాయమని తెలిశాకే ఆయన తెలుగుదేశంలో కొనసాగేందుకు మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలన్నింటిని తెలుగు తమ్ముళ్లు గమనిస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు అనకాపల్లి జిల్లాలోకి వెళ్లిపోయారు. జిల్లాల రీత్యా ప్రస్తుతం గంటా విశాఖ జిల్లాలో ఉన్నారు. ఎప్పటి నుంచో గంటా అంటే అయ్యన్నపాత్రుడికి పడదు. అయ్యన్న కొత్త జిల్లాలోకి వెళ్లిపోవడంతో గంటా రూట్ మార్చారన్న టాక్ నడుస్తోంది. జనసేనతో పొత్తు లాభిస్తుందని.. తద్వారా రాజకీయంగా యాక్టివ్ అవ్వొచ్చన్న భావనతోనే గంటా పసుపు గూటిలో ఉండేందుకు మొగ్గుచూపారని తెలుస్తోంది.
Also Read:RRR Actor Ajay Devgn: తప్పు చేసి జైలు పాలైన RRR నటుడు అజయ్ దేవగన్