AP Employees: సాధారణంగా పండుగ పూట ఉద్యోగులు డిఏలు, అలవెన్స్లు పొందుతారు. కానీ ఏపీలో మాత్రం జీతాలు వస్తే చాలు అన్నట్టు ఉద్యోగులు సంతృప్తి పడుతుండడం విశేషం. ప్రతి ఉద్యోగి కళ్ళల్లో ఆనందం చూడడమే తన లక్ష్యమని జగన్ ఎన్నికల ముందు ప్రకటించారు. సెంటిమెంట్ పండించేవారు. దీనిని నమ్మిన ఉద్యోగులు గుంపగుత్తిగా ఓట్లు వేశారు. తాము వేయడమే కాక పదిమందికి చెప్పి వేయించారు. అంతులేని మెజారిటీతో జగన్ కు అందలమెక్కించారు.అయితే ఏనాడూ జగన్ కళ్ళలో ఆనందం కనిపించలేదు. ఉద్యోగులను సంతృప్తి పరచలేదు. నెలలో మొదటి వారంలో జీతాలు అందించలేదు. ఆనందం మాట అటు పక్కన పెట్టి వారి కళ్ళల్లో దుఃఖానికి కారణమవుతున్నారు.
కేంద్ర ఉద్యోగుల తో పాటు పొరుగు రాష్ట్రాల ఉద్యోగులు దసరా పండగలకు డిఏ పొందారు. ఏపీలో ఉద్యోగులు మాత్రం ఈ నెల జీతాలు వచ్చినందుకు సంతోషపడుతున్నారు. ఈనెల 16 వరకు జీతాలు పడుతూనే ఉన్నాయి. దీంతో ఉద్యోగులు డిఎలు అన్న మాటే మరిచిపోయారు. జీతాలు వచ్చాయి కదా అదే పదివేలని అని సరిపెట్టుకుంటున్నారు. గతంలో ఇదే జగన్ డి ఏ ల గురించి కలర్ ఫుల్ కబుర్లు చెప్పారు. టైం ఫ్రేమ్ పెట్టి డిఏలు ఇస్తున్నట్లు ప్రకటించారు. కానీ చెప్పిన సమయానికి ఒక్కసారి కూడా డిఏ ప్రకటన చేయలేదు. గతంలో పిఆర్సి పేరుతో డీఏలు అన్నింటినీ కవర్ చేశారు. దీంతో ఒక్క రూపాయి కూడా జీతం పెరగలేదు. పెరిగిన ఖర్చులతో పోలిస్తే జీతం తగ్గుముఖం పట్టింది.
పోనీ గౌరవమైన ఉందంటే అదీ లేదు. ఎంతలా గౌరవం తగ్గించాలో.. అంతలా తగ్గించారు. ప్రభుత్వ ఉద్యోగి అంటే ఏం తక్కువ.. జీతం కంటే గీతం ఎక్కువ వస్తుందని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఆ పార్టీకి సంబంధించి సోషల్ మీడియా కార్యకర్తలు సెటైర్లు వేస్తున్నారు. ఉద్యోగులకు న్యాయంగా ఇవ్వాల్సిన చెల్లింపులు చేస్తే రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తారన్న జగన్.. ఇప్పుడు వారికి అదనపు ఆదాయం ఉంటుందన్న అంచనాకు రావడం ఆందోళన కలిగిస్తోంది.
వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని నాడు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం అమలు చేసి చూపిస్తానని శపధం చేశారు. నాలుగున్నర ఏళ్ళు అవుతున్నా సిపిఎస్ రద్దు చేయలేకపోయారు. ఉద్యోగులకు ప్రత్యామ్నాయాన్ని కూడా కల్పించలేకపోయారు. పోనీ న్యాయబద్ధంగా నిరసన తెలుపుతామంటే కేసులతో ఉక్కు పాదం మోపుతున్నారు. అందుకే జీతం ఇస్తే సరి.. అన్నట్టు సగటు ఉద్యోగి నోరు తెరవలేక పోతున్నారు.