Pawan Kalyan
Pawan Kalyan: తెలంగాణలో గట్టి ఫైట్ నడుస్తోంది. మూడు పార్టీల మధ్య పోరు ఉధృతంగా మారింది. అధికార బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, బిజెపిలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాట్ టాపిక్ గా మారారు. బిజెపితో జనసేన పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. ఎనిమిది చోట్ల జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. బిజెపితో జనసేన అభ్యర్థులు కలిసి సమన్వయం చేసుకుని ప్రచార పర్వంలో ముందుకు సాగుతున్నారు.ఇటువంటి తరుణంలో పవన్ప్రచారానికి వస్తారా? లేదా? అన్నదానిపై స్పష్టత లేదు.
బిజెపితో పొత్తు కుదిరిన తర్వాత.. జనసేనకు ఎనిమిది స్థానాలను ఖరారయ్యాయి. అటు తరువాత ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న బీసీ ఆత్మగౌరవ సభలో పవన్ పాల్గొన్నారు. అటు తరువాత పవన్ ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు తెలంగాణలో పోలింగ్ సమీపిస్తున్నా పవన్ జాడ లేకపోవడంతో.. అసలు ప్రచారంలో పాల్గొంటారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇటువంటి తరుణంలో పవన్ ప్రచారానికి వస్తున్నారంటూ కొన్ని రకాల లీకులు బయటకు వస్తున్నాయి. జనసేన అభ్యర్థులగెలుపు బాధ్యతలను పవన్ తీసుకుంటారని ప్రచారం ప్రారంభమైంది.
గ్రేటర్ లో రెండు రోడ్ షోలు, ఖమ్మంలో ఒక రోడ్ షోలో పవన్ పాల్గొంటారని తాజాగా ఒక్క అప్డేట్ అనధికారికంగా వెల్లడయ్యింది. దీంతోపాటు ర్యాలీలకు సైతం హాజరవుతారని సమాచారం. గాని జనసేన అధికారికంగా ఇప్పటివరకు అటువంటి ప్రకటన చేయలేదు. అయితే పవన్ కేవలం జనసేన అభ్యర్థులకే కాదు… బిజెపి అభ్యర్థుల తరఫున కూడా ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ అగ్ర నేతలు తెలంగాణకు క్యూ కడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పవన్ వారికి తోడైతే ప్రచారంలో కూటమి ముందడుగు వేస్తుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.
తెలంగాణలో బిజెపి అగ్ర నేతల పర్యటనలు ఖరారు అయ్యాయి. శనివారం సకలజనుల సంకల్ప సభల్లో అమిత్ షా పాల్గొంటారు. గద్వాల్, నల్గొండ, వరంగల్ తూర్పు నియోజకవర్గాల్లో నిర్వహించే సభల్లో అమిత్ షా హాజరు కానున్నారు. రేపటి నుంచి బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం తెలంగాణలో పర్యటించనున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పవన్ పర్యటన సైతం ఖరారు కానున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఈరోజు జనసేన స్పష్టమైన ప్రకటన జారీ చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరి అది ఎంతవరకు వాస్తవమో చూడాలి.