MUDA Scam : ఆ కుంభకోణం.. వదలా బొమ్మాళి అంటూ వెంటపడుతోంది.. పాపం.. ముఖ్యమంత్రి రాజీనామా చేయక తప్పదేమో?

ప్రజలకు అనేక హామీలు ఇచ్చి.. అధికార బీజేపీపై లేనిపోని విమర్శలు చేసి కర్ణాటకలో పీఠాన్ని దక్కించుకుంది కాంగ్రెస్ పార్టీ. కానీ ఏడాది గడిచిందో లేదో.. అంతలోనే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పై విమర్శలు మొదలయ్యాయి. అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.

Written By: Anabothula Bhaskar, Updated On : October 1, 2024 12:27 pm

MUDA Scam

Follow us on

MUDA Scam :  మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ( ముడా) కుంభకోణంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కు ఊపిరి సలపడం లేదు. ఇటీవల ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున కర్గే చేసిన “కొత్త ముఖ్యమంత్రి వస్తున్నారనే” వ్యాఖ్యలు సంచలనం సృష్టించగా.. దాన్ని మర్చిపోకముందే సిద్ధరామయ్యకు మరో షాక్ తగిలింది. ముడా వ్యవహారంలో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు మనీలాండరింగ్ కేసు నమోదు చేశారు. ముడా కుంభకోణంలో ఇప్పటికే లోకాయుక్త పోలీసులు విచారణ జరిపారు. సిద్ధరామయ్య, ఆయన సతీమణి పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామి, దేవరాజు నుంచి భూమి కొనుగోలు చేసి సీఎం సతీ మనకి గిఫ్ట్ గా ఇచ్చారని ఎఫ్ ఐ ఆర్ లో వివరించారు. దాని ఆధారంగా కేంద్ర దర్యాప్తు బృందాలు సిద్ధరామయ్య తో పాటు మరికొందరిపై ఎన్ ఫోర్స్ మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు ద్వారా కేసు నమోదు చేసింది. దీనివల్ల నిందితులను విచారణకు పిలవడానికి.. విచారణ సమయంలో వారి ఆస్తులను అనుసంధానం చేయడానికి ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులకు అవకాశం లభించింది. ముడా స్థలాల కేటాయింపుకు సంబంధించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుటుంబం భారీగా ప్రయోజనాలు పొందిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికోసం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని సామాజిక కార్యకర్త టీజే అబ్రహం ఇటీవల కర్ణాటక గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. స్నేహమయి కృష్ణ, ప్రదీప్ కుమార్ కూడా ముఖ్యమంత్రి పై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ముఖ్యమంత్రిని విచారించాలని ఆదేశాలు జారీ చేశారు. గవర్నర్ చేసిన ఆదేశాలను రద్దు చేయాలని కర్ణాటక మంత్రివర్గం అప్పట్లో తీర్మాన చేసింది. దానిని గవర్నర్ తప్పు పట్టారు. దీంతో ఈ రెండు వ్యవస్థల మధ్య చినికి చినికి గాలి వాన లాగా మారిన ఈ విషయం కోర్టు దాకా వెళ్ళింది.

న్యాయస్థానంలో చుక్కెదురు

న్యాయస్థానంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు చుక్కెదురయింది. సిద్ధ రామాయణం విచారించడానికి గవర్నర్ ఆదేశించడం సరైన చర్య అని హైకోర్టు వ్యాఖ్యానించింది. దర్యాప్తు విధానం పూర్తిగా లోకాయుక్త అధికారి ఆధ్వర్యంలో జరగాలని న్యాయస్థానం దానికి అనుమతి ఇచ్చింది. దీంతో సిద్ధరామయ్య పై లోగాయుక్త పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి తోడు ఈ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు మనీలాండరింగ్ అనే విషయాన్ని తెరపైకి తీసుకువచ్చారు. దానిపై కేసు నమోదు చేశారు. ఈ ప్రకారం చూసుకుంటే సిద్ధరామయ్యకు పదవి గండం తప్పేలా కనిపించడం లేదు. ఇప్పటికే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కొత్త ముఖ్యమంత్రి వస్తారని వ్యాఖ్యలు చేశారు. దాన్ని మర్చిపోకముందే కర్ణాటకలోని డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన ప్రయత్నాలు మొదలుపెట్టారు. స్థూలంగా చూస్తే సిద్దుకు పదవి గండం ఉన్నట్టు తెలుస్తోంది. మరి దీని నుంచి ఆయన ఎలా బయటపడతారో వేచి చూడాల్సి ఉంది.