Bc Leader R Krishnayya : రాజకీయాల్లో అవసరాలు తప్ప మరొకటి కనిపించవు. ఇది చాలా సందర్భాల్లో నిరూపితం అయింది. ఎక్కడో తెలంగాణలో ఉన్న బీసీ నేత కృష్ణయ్యను పిలిచి మరి రాజ్యసభ సీటు ఇచ్చారు జగన్. బీసీల పార్టీగా ముద్ర వేయాలన్న తలంపుతో జగన్ అలా చేశారు. కృష్ణయ్య సైతం పిలిచిన వెంటనే వచ్చి వైసీపీకి సేవలు అందించారు. నేరుగా పార్టీ సభ్యత్వం లేకపోయినా పదవి మాత్రం పొందగలిగారు. ఎందుకంటే ఆయన బీసీ నేత. బీసీల్లో పట్టున్న నేత. ఆయనకు పదవి ఇవ్వడం ద్వారా బీసీలను ఆకట్టుకోవాలని జగన్ ప్లాన్. వైసీపీ ఆవిర్భావం నుంచి ఎంతోమంది బీసీ నేతలు సేవలు అందించారు. కానీ వారందరినీ కాకుండా.. కృష్ణయ్య ను పిలిచి మరి పదవి ఇచ్చారు జగన్. అప్పుడు జగన్ అవసరం అలాంటిది. అయితే ఇప్పుడు అదే అవసరం కృష్ణయ్యకు వచ్చిందంటున్నారు. జాతీయస్థాయిలో బీసీ ఉద్యమం కోసం వైసీపీ ఇచ్చిన రాజ్యసభ పదవిని వదులుకున్నారు కృష్ణయ్య. దీనిపై గరం గరం లాడుతున్నారు వైసీపీ శ్రేణులు. పిలిచి మరి పదవి ఇస్తే ఇదా పని అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే అప్పుడు జగన్ కు అవసరం. ఇప్పుడు కృష్ణయ్యకు ఆ అవసరం వచ్చింది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
* అప్పట్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా
కృష్ణయ్య జాతీయస్థాయి బీసీ నేతగా గుర్తింపు పొందారు. ఆయనకు పదవులు యాదృచ్ఛికంగా వచ్చాయి. ప్రతి పార్టీ సైతం ఆయనను ఆహ్వానించడం సర్వసాధారణం. గతంలో ఏకంగా తెలంగాణలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెరపైకి వచ్చారు కృష్ణయ్య. తెలంగాణలో అధికారంలోకి వస్తే కృష్ణయ్య ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించారు చంద్రబాబు. టిడిపి టికెట్ ఇచ్చి గెలిపించారు. కానీ టిడిపిలో మాత్రం ఉండలేకపోయారు కృష్ణయ్య.
* బీసీ నినాదంతో
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అప్పటివరకు బీసీల పార్టీగా తెలుగుదేశం పార్టీ ప్రభావం చూపింది. అందుకే ఆ బలం పై దెబ్బ కొట్టాలని జగన్ చూశారు. బీసీ నినాదాన్ని తెరపైకి తెచ్చారు. పెద్ద ఎత్తున పదవులు సృష్టించి మరి బీసీలకు ఇచ్చారు. అయితే బీసీల విషయంలో ఒక పకడ్బందీ ప్లాన్ తో అడుగులు వేశారు జగన్. అందుకే కృష్ణయ్యను తీసుకొచ్చి రాజ్యసభ సీటులో కూర్చోబెట్టారు. కానీ ప్రభుత్వం పై వ్యతిరేకతతో జగన్ బీసీ ప్లాన్ వర్క్ అవుట్ కాలేదు. దీంతో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఇప్పుడు చేతిలో ఉన్న రాజ్యసభ సీట్లు సైతం నేతల రాజీనామా తో పోతున్నాయి. మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు రాజ్యసభ పదవులకు, వైసీపీకి గుడ్ బై చెప్పారు. అదే బాట పట్టారు కృష్ణయ్య. వైసీపీ ఇచ్చిన రాజ్యసభ సీటుకు రాజీనామా చేశారు.
* సరిగ్గా ఇదే సమయంలో
వైసిపి క్లిష్ట సమయంలో ఉంది. రాజకీయంగా దెబ్బతీయాలని కూటమి చూస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో కృష్ణయ్య కూడా రాజీనామా చేశారు. కూటమి ప్రభుత్వం ప్రలోభాలకు లొంగి కృష్ణయ్య రాజీనామా చేశారని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో కృష్ణయ్య చేస్తున్న ప్రకటనలు కూడా నమ్మశక్యంగా లేవు. బీసీల కోసమే తాను రాజీనామా చేశానని.. జాతీయస్థాయిలో బీసీ గణనపై ఉద్యమం చేయడానికి నిర్ణయించానని చెబుతున్నారు. మరోవైపు తెలంగాణలో బీసీ పార్టీని ప్రారంభిస్తానని కూడా చెప్పుకొస్తున్నారు. వైసీపీ శ్రేణులు అనుమానించినట్టు చేయనని.. తనకు జగన్ అంటే ఇప్పటికీ గౌరవం, అభిమానం ఉన్నాయని చెబుతున్నారు. కానీ వైసీపీ నుంచి మాత్రం ఆయనపై అదే తరహా దాడి కొనసాగుతోంది.