Haryana Election Results : హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు అయ్యాయి. భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ మరోసారి బంగపడింది.. అయితే ఈసారి హర్యానా ఎన్నికల్లో ఎక్కువగా రెజ్లర్లు, జాట్స్, జిలేబి అనే పదాలు వినిపించాయి. ఈ మూడు తమను రక్షిస్తాయని కాంగ్రెస్ పార్టీ భావించింది. కాని చివరికి భంగపాటు మిగిలింది. అంతేకాదు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన బిజెపి జిలేబి తో కాంగ్రెస్ పార్టీకి సరైన కౌంటర్ ఇస్తోంది.. హర్యానా ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ జిలేబి విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు.. గొహానా అనే ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ మాట్లాడారు. మాథ్ రామ్ హల్వాయి నుంచి తీసుకొచ్చిన ఒక మిఠాయిల డబ్బాను పట్టుకొని చూపించారు. “వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఈ సరుకును దేశవ్యాప్తంగా విక్రయించాలి.. దిగుమతి చేయాలి. ఈ పని చేస్తే ఉపాధి పెరుగుతుంది. 25 నుంచి 50,000 మందికి చేతినిండా పని దొరుకుతుంది.. అయితే కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు వల్ల మాథ్ రామ్ వంటి వ్యాపారవేత్తలు ఇబ్బంది పడ్డారని” రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దీనిపై భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు రవిశంకర్ ప్రసాద్ గట్టి కౌంటర్ ఇచ్చారు..” నాకు మీరు చెప్పిన గొహనా ప్రాంతంలో లభించే జిలేబి అంటే చాలా ఇష్టం. వాటి తయారీ కేంద్రం అమెరికాలో పెట్టాలని రాహుల్ అంటున్నారు. అయితే వాటిని ఎలా తయారు చేస్తారు? ఎలా విక్రయిస్తారు? అనే విషయాలపై ఆయన అవగాహన పెంచుకోవాలి. ముందుగా వాటి గురించి తెలుసుకోవాలి. ముందుగా ఆయన ప్రసంగాలు రాసేవాళ్లు ఆ విషయాన్ని చెప్పాలని” వ్యాఖ్యానించారు.
ప్రధాని ఏమన్నారంటే…
ఇక ఆ ఎన్నికల ప్రచార సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జిలేబి గురించి ప్రస్తావించారు.. ముఖ్యంగా ఇండియాకుటంలోని పార్టీలను విమర్శించారు..” ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వస్తే ఈ దేశానికి ఐదు సంవత్సరాలలో.. ఐదుగురు ప్రధాన మంత్రులు వస్తారు. ప్రధాన మంత్రి పదవి జిలేబి కాదు.. వాటాలు పంచుకోవడానికని” మోడీ ప్రశ్నించారు. ఇక హర్యానా రాష్ట్రంలో ఈరోజు ప్రారంభమైన ఎన్నికల కౌంటింగ్ లో తొలి రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ లీడ్ కొనసాగించింది. దీంతో ఆ పార్టీ నాయకులు పూర్తి ఫలితాలు రాకముందే జిలేబిరి పంచుకున్నారు. కానీ ఆ తర్వాత బిజెపి గేమ్ మొదలుపెట్టింది. అన్ని రౌండ్లలో లీడ్ కొనసాగించింది. చివరికి అధికారాన్ని దక్కించుకుంది. దీంతో ఆ పార్టీ నాయకులు భారీగా జిలేబిలను ఆర్డర్ చేశారు. ఇక గొహనా ప్రాంతంలో 1958లో మాథ్ రామ్ జిలేబిలను తయారుచేసి అమ్మడం మొదలుపెట్టారు. ఆయన తర్వాత ఈ వ్యాపారాన్ని మనవాళ్లు చూసుకుంటున్నారు. అయితే ఈ జిలేబి ని హర్యానా రాష్ట్ర ప్రజలు అత్యంత ఇష్టంగా తింటారు.