Kusuma Jagadish- Sai Chand: గుండెపోటుతో అకాల మరణం చెందిన ములుగు జిల్లా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చంద్ కుటుంబాలకు భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. జగదీష్, సాయి చంద్ లను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో మునిగిన వారి కుటుంబాలను ఆదుకుంటామని కేటీఆర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. శుక్రవారం హైదరాబాదులో భారత రాష్ట్ర సమితి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాయి చంద్, జగదీష్ మరణం భారత రాష్ట్ర సమితికి తీరని లోటని ఆయన అభివర్ణించారు. భౌతికంగా వారు మన మధ్య లేనప్పటికీ, అంతర్గతంగా వారు మనతోనే ఉన్నారని కేటీఆర్ ప్రకటించారు.
కార్యకర్తలనే కాదు నాయకుల కుటుంబాలను ఆదుకోవడం కూడా భారత రాష్ట్ర సమితి ప్రధాన కర్తవ్యమని కేటీఆర్ ప్రకటించారు. ఈ సందర్భంగా సాయి చంద్, జగదీష్ కుటుంబాలకు కోటి 50 లక్షల చొప్పున పార్టీ చెల్లిస్తుందని వివరించారు. పార్టీకి వారు చేసిన సేవలను స్మరించుకుంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. సాయి చంద్ సతీ మణికి అతని పదవి కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. జగదీష్ సతీమణికి రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి ఉంటే సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. కష్టకాలంలో వారికి అండగా ఉంటామని ప్రకటించారు. ఇదే సమయంలో పార్టీ కార్యకర్తలకు వైద్య శిబిరాలు నిర్వహిస్తామని, దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వారికి పార్టీ తరపున ఆధునిక వైద్యం అందజేస్తామని కేటీఆర్ ప్రకటించారు. ప్రజాసేవలో ఉండేవారు తమ ఆరోగ్యాల పట్ల కూడా శ్రద్ధ వహించాలని కేటీఆర్ ఈ సందర్భంగా సూచించారు.
ఇక సాయి చంద్ మరణించి ఆదివారం నాటికి పది రోజులు అవుతుండడంతో అతని దశదినకర్మ ఘనంగా నిర్వహించేందుకు భారత రాష్ట్ర సమితి ఏర్పాటు చేస్తోంది. చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. హస్తినాపురంలోని ఓ ఫంక్షన్ హాల్ లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ఇతర భారత రాష్ట్ర సమితికి చెందిన నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని సాయి చిత్రపటానికి నివాళులు అర్పించనున్నారు. ఇదే వేదిక మీద సాయిచంద్ భార్యకు ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాష్ట్ర సమితి తరఫున కోటి 50 లక్షల చెక్కును అందజేయనున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి కార్యకర్తలంతా హాజరుకావాలని ఆహ్వానాలు అందాయి. సాయి చంద్ ఉద్యమకారుడు కావడంతో అతడికి ఘనమైన నివాళులు అర్పించేందుకు భారత రాష్ట్ర సమితి భారీ ఏర్పాట్లు చేస్తోంది.