NTV Vs TV9: ఎన్టీవీ తగ్గింది.. అయినప్పటికీ టీవీ9 పై పై చేయే

హైదరాబాద్ మార్కెట్లో ఎన్ టివితో పోల్చితే టీవీ9 మెరుగైన పెర్ఫామెన్స్ చేస్తోంది. అయినప్పటికీ అది రెండవ స్థానంలోనే కొనసాగుతోంది. టీవీ5 యధావిధిగా మూడవ స్థానంలో ఉంది.

Written By: K.R, Updated On : July 7, 2023 3:25 pm

NTV Vs TV9

Follow us on

NTV Vs TV9: కుట్రలతో నెంబర్ వన్ స్థానం ఎప్పటికీ లాక్కోలేరు అని టీవీ9 ఏ ముహూర్తాన ప్రచారం చేసిందో తెలియదు కానీ.. అప్పటినుంచి ఎన్టీవీకి ఎదురన్నదే లేకుండా పోతోంది. (అంటే ఇక్కడ మా ఉద్దేశం ఎన్టీవీ కుట్రలతో నెంబర్ వన్ స్థానాన్ని సాధించింది అనేది కాదు.) రూరల్, అర్బన్ ఏరియాల్లో దుమ్ము రేపుతోంది. టీవీ9 పై ఎప్పటికప్పుడు పై చేయి సాధిస్తున్నది. అంతేకాదు టీవీ9 కు మొన్నటి దాకా కీలక స్తంభాలుగా ఉన్న ఉద్యోగులను లాగేసుకుంది. కనివిని ఎరుగని స్థాయిలో వారికి జీతాలు ప్రకటించింది. ఇక తాజాగా బార్క్(ఇది అత్యంత లోప భూయిష్టం) రేటింగ్స్ లో ఎన్టీవీ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. 76.5 జిఆర్పి రేటింగ్స్ తో నెంబర్ వన్ పొజిషన్ ను నిలబెట్టుకుంది. గతంతో పోలిస్తే రెండు పాయింట్లు తగ్గినప్పటికీ అది టీవీ9 కంటే మెరుగైన స్థానంలోనే ఉంది. టీవీ9 గతంతో పోలిస్తే రెండు పాయింట్లు మెరుగుపరుచుకున్నప్పటికి అది ఎన్టివితో పోల్చితే కిందనే ఉండడం విశేషం. ఇక అర్బన్, రూరల్ ఏరియాల్లోనూ ఎన్టీవీ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ఎన్టీవీ, టీవీ 9 తర్వాత టీవీ 5 మూడవ స్థానంలో, వీ6 వెలుగు నాలుగు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఐదవ స్థానాల్లో కొనసాగుతున్నాయి. టీ న్యూస్ ఆరు, సాక్షి ఏడు, 10 టీవీ, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ ఆంధ్ర ప్రదేశ్ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.

హైదరాబాద్ మార్కెట్ లో..

హైదరాబాద్ మార్కెట్లో ఎన్ టివితో పోల్చితే టీవీ9 మెరుగైన పెర్ఫామెన్స్ చేస్తోంది. అయినప్పటికీ అది రెండవ స్థానంలోనే కొనసాగుతోంది. టీవీ5 యధావిధిగా మూడవ స్థానంలో ఉంది. వీ6 నాలుగు, ఇక్కడ యాదృచ్ఛికంగా టీ న్యూస్ ఐదవ స్థానం, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆరవ స్థానంలో కొనసాగుతున్నాయి.. హైదరాబాద్ మార్కెట్లో ఒకప్పుడు టీవీ9 కు తిరుగులేని ఆధిపత్యం ఉండేది. కాలక్రమేణా దానిని ఎన్టీవీ స్వాధీనం చేసుకుంది. అప్పటినుంచి ఇప్పటిదాకా అది మొదటి స్థానంలోనే కొనసాగుతోంది. ఇక టీవీ9 గత కొద్దిరోజుల నుంచి బెటర్ పెర్ఫార్మన్స్ ఇస్తున్నప్పటికీ అది ఎన్ టివిని బీట్ చేయలేకపోతోంది. ఇవి ప్రస్తుతానికి పెరుగునాట ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ పరిస్థితి. ఇక హెచ్ఎంటీవీ, మహా టీవీ, రాజ్ న్యూస్, ప్రైమ్ నైన్, స్వతంత్ర అంటారా.. అవి ఈ జాబితాలో లేవు. వాటి గురించి చెప్పుకోవడం దాదాపుగా దండగ.

ఏపీ లో ఇలా..

ఏపీలోనూ ఎన్టీవీ తిరుగులేని స్థానంలో ఉంది. అది మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటిదాకా ఆంధ్రలో టీవీ9 కు బలమైన నేపథ్యం ఉండేది. కానీ ఎప్పుడైతే ఎన్టీవీ తెలంగాణ మార్కెట్లో బలపడిందో ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్ మార్కెట్ పై కూడా పడింది. దీంతో టీవీ9 రెండవ స్థానంలోకి వెళ్లిపోవాల్సి వచ్చింది. ప్లైన్ అండ్ నీట్ కవరేజ్ తో ఎన్ టీవీ మొదటి ర్యాంకును పదిలంగా కాపాడుకుంటుంది. ఇక మూడవ స్థానంలో టీవీ5 కొనసాగుతోంది. వి6 వెలుగు నాలుగవ స్థానం, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఐదవ స్థానం, టీ న్యూస్ ఆరవ స్థానంలో కొనసాగుతున్నాయి. 9, 10 స్థానాల్లో ఈటీవీ ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి. ఉదయం లేస్తే జగన్ డప్పు కొట్టే సాక్షి ఏడవ స్థానంలో ఉంది. ఎనిమిదవ స్థానంలో 10టీవీ కొనసాగుతోంది. అయితే ఏపీలోని అర్బన్ మార్కెట్లో ఎన్టీవీ, టీవీ9 కు మధ్య కేవలం రెండు పాయింట్లు మాత్రమే తేడా ఉండడం ఇక్కడ విశేషం. అయినప్పటికీ అది ఎన్ టీవీ ని బీట్ చేయలేకపోతోంది. ఇక మిగతా చానల్స్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. స్థూలంగా చెప్పేది ఏంటంటే ఎలక్ట్రానిక్ మీడియాను జనం పట్టించుకోవడం లేదు. వారంతా కూడా సోషల్ మీడియాని నమ్ముతున్నారు. అందుకు ఈ జిఆర్పి రేటింగ్సే కొలమానం.