KCR Vs Tamilisai: గవర్నర్, ప్రభుత్వం మధ్య ఉన్న విభేదాలు బహిర్గతమయ్యాయి. ఇన్నాళ్లు లోలోపలే ఉన్న వైరుధ్యాలు ఒక్కసారిగా ఢిల్లీ వేదికగా బట్టబయలయ్యాయి. రాజ్యంగబద్ధంగా ఎన్నికైన గవర్నర్ నే లెక్కచేయకుండా సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరిపై గవర్నర్ తమిళిసై ఢిల్లీ వేదికగా ప్రధానమంత్రి, హోంమంత్రి తదితరులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు ఏం చర్యలు తీసుకుంటారో తెలియడం లేదు. బీజేపీని టార్గెట్ చేసుకుని సీఎం కేసీఆర్ ఇలా చేస్తున్నారనే అపవాదు సైతం మూటగట్టుకున్నారు. ప్రతిపక్షాలు సైతం గవర్నర్ విషయంలో కేసీఆర్ విధానాన్ని తప్పుబడుతున్నారు.
ఏవైనా సమస్యలుంటే పార్టీపరంగా తేల్చుకోవాలి కానీ గవర్నర్ ను లక్ష్యంగా చేసుకుని ఏదో సాధించాలని చూడటం విడ్డూరమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రభుత్వానికి హితవు పలికారు. కేసీఆర్ తీరు సమంజసంగా లేదని దుయ్యబట్టారు. దీంతో సీఎం కేసీఆర్ అందరిలో చులకన అవుతున్నారు. వ్యక్తులను ఉద్దేశించి కక్షసాధింపు చర్యలు సబబు కావని అందరిలోను అభిప్రాయాలు వస్తున్నాయి. అయినా కేసీఆర్ తన వైఖరి మార్చుకోవడం లేదు.
Also Read: Kodali Nani: కేబినెట్ లోకి కొందరు సమర్థులు కావాలన్న కొడాలి నాని.. ఇప్పుడున్న వాళ్లంతా అసమర్థులేనా?
ఫలితంగా ఇప్పుడు సీన్ ఢిల్లీకి చేరింది. ఇన్ని రోజులు గవర్నర్ మౌనంగానే ఉన్నా కేసీఆర్ మాత్రం తన పద్ధతి మార్చుకోలేదు. ఉగాది వేడుకలకు గవర్నర్ సీఎం కేసీఆర్, మంత్రివర్గానికి ఆహ్వానం పంపినా ఏ ఒక్కరు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తానేమైనా సాధారణ వ్యక్తిని కాదని బాధ్యత గల హోదాలో పిలిచినా లెక్కచేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఢిల్లీ పెద్దలను కలిసి తనకు జరిగిన అవమానంపైనా వివరించారు.
గవర్నర్ అంటే రాజ్యాంగ బాధ్యతలు నిర్వహించే వ్యక్తి కావడంతో కొన్ని నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. ఎమ్మెల్సీ ఎంపికలో ఆమె వ్యవహరించిన తీరు కేసీఆర్ కు కోపం తెప్పించిందని పార్టీ వర్గాలు చెబుతున్నా అది కరెక్ట్ కాదు. రాజకీయం వేరు రాజ్యాంగం వేరు. దానికి కేసీఆర్ గవర్నర్ ను టార్గెట్ చేసుకుని వ్యవహరించడం ఆయనకే మంచిది కాదనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో కేంద్రం కేసీఆర్ పై ఏం చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. బీజేపీపై ఉన్న కోపంతోనే ఇలా చేస్తున్నారనే వాదనలు సైతం వస్తున్నాయి. ఏదిఏమైనా రాజకీయంగా ఎదుర్కోవడంపైనే దృష్టి సారించాలి కానీ ఇలా వ్యక్తిగతంగా దురుద్దేశ పూర్వకంగా ప్రవర్తించడం సమంజసం కాదని తెలుస్తోంది. మొత్తానికి ఢిల్లీ నుంచి ఏం పిలుపు వస్తుందో కేసీఆర్ కు తలంటుతారో లేక న్యాయపరంగా వెళతారో వారి నిర్ణయంపై ఆధారపడి ఉంది.
Also Read:PMAY: కేంద్రం సూపర్ స్కీమ్.. సొంతింటి కలను సులువుగా నెరవేర్చుకునే ఛాన్స్!