Skill Development Case: స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆసక్తికర పరిణామాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఇందులో సిఐడి పరిమితికి మించి వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసు విచారణలో ఉండగా.. సిఐడి చీఫ్ సంజయ్, సిఐడి తరుపున కేసు వాదిస్తున్న న్యాయవాది సుధాకర్ రెడ్డి ఏకంగా ప్రెస్ మీట్ లు పెడుతున్నారు. మీడియా డిబేట్లో పాల్గొంటున్నారు. కేసును మరింత బిగించేందుకు కొందరిని ప్రలోభ పెట్టారని తాజాగా వార్తలు వస్తున్నాయి. సిమెన్స్ ఇండియా మాజీ ఎండీ సుమన్ బోస్ కు చుక్కలు చూపించారని తెలియడం ఆందోళన కలిగిస్తోంది.
సిఐడి అనేది రాష్ట్రస్థాయిలో అత్యున్నత దర్యాప్తు సంస్థ. ప్రభుత్వం అప్పగించిన కేసులను దర్యాప్తు చేయడం దాని ప్రధాన విధి. కానీ ఏపీ సీఐడీ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. జగన్ జేబు సంస్థ గా మారిపోయింది. రాజకీయ ప్రత్యర్థులపై కేసులు సృష్టించడానికి ఎంతటి ఘోరాలకైనా వెనుకాడడం లేదు. అసలు కనీసం ఆధారాలు లేకపోయినా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును అరెస్టు చేయగలిగారు. రిమాండ్ కు తరలించగలిగారు. ఆయన ఇప్పట్లో బయటపడకుండా పాత కేసులను తిరగ దోడుతున్నారు. ఈ కేసులో చంద్రబాబును మరింత ఇరికించడానికి కేసుతో సంబంధం ఉందని ఎవరితో ఒకరికి చెప్పించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు.
సుమన్ బోస్ తాజాగా మీడియా ముందుకు వచ్చారు. అసలు స్కిల్ డెవలప్మెంట్ లో అవినీతి జరిగే అవకాశం లేదని తేల్చి చెప్పారు. సుమన్ కార్పొరేట్ వర్గాల్లో గౌరవమైన వ్యక్తిగా పేరొందారు.అటువంటి వ్యక్తిని గత రెండేళ్లుగా ఈ కేసులో టార్చర్ పెడుతున్నారు. ఏకంగా 25 కోట్ల రూపాయలు, అజయ్ కల్లం, ప్రేమ్ చంద్రారెడ్డి మాదిరిగా కేసులు లేకుండా కూడా చేస్తామని హామీ ఇచ్చారు. ఒప్పుకోకపోవడంతో జైలులో ఆయన పక్కనే.. ఓ శవాన్ని కూడా పెట్టి ఇబ్బంది పెట్టారని తాజాగా వార్తలు వస్తున్నాయి. ఏకంగా మీడియా ముందే సుమన్ బోస్ నిస్సహాయత వ్యక్తం చేశారు. మీరే అర్థం చేసుకోండి అని మీడియా ప్రతినిధులకు సంకేతాలు ఇచ్చారు. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అసలు ఈ కేసులో సిఐడి కి ఉన్న ఆసక్తి ఏమిటి? సుమన్ బోస్ కి ఇస్తామన్న 25 కోట్ల రూపాయలు ఎక్కడివి? కచ్చితంగా అందరివేళ్ళు వైసిపి ప్రభుత్వం వైపే చూపుతాయి. చంద్రబాబును ప్రధాన లక్ష్యం. అందుకు తగ్గట్టుగా కేసును చూపించాలి. అసలు ఫైలే లేని రిమాండ్ నివేదికను చూపిస్తున్నారు. ఎక్కడో ఏ 37 గా ఉన్న చంద్రబాబును అరెస్టు చేసి ప్రధాన నిందితుడిగా చూపుతున్నారు. ఈరోజు కాకుండా రేపైనా ఈ కేసు నిలబడే స్థితిలో లేదని న్యాయ కోవిదులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తిరిగి ఈ కేసు వైసీపీ సర్కార్ కు చుట్టుకున్న ఆశ్చర్యపోనవసరం లేదని చెబుతున్నారు. కానీ ఇవేవీ పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం దూకుడుగా ముందుకు వెళ్తుంది. ఇందులో సుమన్ బోస్ లాంటి వ్యక్తులను బలి పశువులు చేయాలని చూస్తోంది.