Tomato Price: వైపరీత్యం అంటే ఇదే. నెల రోజుల కిందట బంగారం కంటే ఖరీదైన వస్తువుగా టమాటా మారింది. కూరల్లో కంటే వార్తల్లోనే ఎక్కువగా నిలిచింది. కేజిఎఫ్ బంగారు గనులు కంటే.. టమాటా తోటలు, మార్కెట్లకు రక్షణ కల్పించాల్సి వచ్చింది.అయితే అటువంటి టమాటా కిలో ఇప్పుడు 50 పైసలకు పడిపోవడం దారుణం. వ్యవసాయ ఉత్పత్తుల ధర స్థిరీకరణ లేదనడానికి ఇదో చక్కటి ఉదాహరణ. పంటలు పండించే రైతుల దయనీయ స్థితిని ఈ టమాటా ఉదంతమే తెలుపుతోంది.
టమాటా క్రయవిక్రయాలకు పెట్టింది పేరు మదనపల్లె. అటు తర్వాత కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో సైతం భారీగా క్రయవిక్రయాలు జరుగుతాయి. కానీ నిన్నటి టమాటా ధర ఎంతో తెలుసా? అక్షరాల 50 పైసలు. మంచి దిగుబడి వచ్చినప్పుడు ధర పడిపోవడంతో రైతులు విలవిల్లాడుతున్నారు. నిన్న మొన్నటి వరకు కిలో మూడు రూపాయిలు పలికింది. ఇప్పుడు ఏకంగా 50 పైసలకు ధర పడిపోయింది. దీంతో పంటను సేకరిస్తున్న రైతులు రోడ్డుపై పారబోయాల్సి వస్తోంది.
జూన్ జూలై నెలలో టమాట ధర 300 రూపాయల వరకు ఎగబాకిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా వర్షాలు పడడం, పంటలు పాడు కావడం, రవాణా వ్యవస్థ స్తంభించడం తదితర కారణాలతో టమాటా ధర అమాంతం పెరిగింది. అయితే ఇప్పుడు టమాటా ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చిన తర్వాత ధర పడిపోయింది. భారీగా పెట్టుబడులు పెట్టిన తర్వాత ధర గణనీయంగా తగ్గుముఖం పట్టడంతో రైతులకు అపార నష్టం కలుగుతోంది. కనీసం కూలీ ఖర్చులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.