Bigg Boss Telugu Day 14: బిగ్ బాస్ తెలుగు 7 రెండు వారాలు పూర్తి చేసుకుంది. ఆదివారం ఎపిసోడ్లో ఫన్ తో పాటు ఎమోషనల్ సీన్స్ చోటు చేసుకున్నాయి. అనుకున్నట్లే షకీలా ఇంటిదారి పట్టారు. హోస్ట్ నాగార్జున ఇంటి సభ్యులతో బీబీ సామ్రాజ్యం అనే గేమ్ ఆడారు. ప్రతి ఇంటి సభ్యుడు బాహుబలి కిరీటం పెట్టుకుని హౌస్లో తనకు భల్లాలదేవుడు, కట్టప్ప ఎవరో చెప్పాలి. అక్కడ ఏర్పాటు చేసిన భల్లాలదేవుడు, కట్టప్ప బొమ్మల వద్ద ఆ ఇద్దరు కంటెస్టెంట్స్ ని ఉంచి కారణాలు చెప్పాలి.
ఈ గేమ్ లో శోభా శెట్టి… గౌతమ్ ని కట్టప్పగా, ప్రిన్స్ ని భల్లాలదేవుడిగా చెప్పింది. గౌతమ్.. రతికను కట్టప్పగా, ప్రిన్స్ ని భల్లాలదేవుడిగా చెప్పాడు. ఇక రతికా… తేజా, గౌతమ్ లను, శివాజీ… తేజ, ప్రశాంత్ లను, ప్రశాంత్… తే, శివాజీలను, దామిని… శుభశ్రీ, సందీప్ లను, సందీప్… శివాజీ, శుభశ్రీలను, శుభశ్రీ… తేజ, సందీప్ లను, ప్రియాంక… శివాజీ, సందీప్ లను, ప్రిన్స్… సందీప్, శివాజీలను, షకీలా… ప్రిన్స్, ప్రశాంత్ లను కట్టప్ప, భల్లాలదేవుడిగా చెప్పారు.
పవర్ అస్త్రను నిర్లక్ష్యంగా బయట వదిలేసిన శివాజీని నాగార్జున హెచ్చరించాడు. అది ఎవరైనా తీసుకుని ఉంటే వాళ్ళది అయ్యేది. జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాడు. ఒక ప్రక్క ఫన్ జరుగుతుండగా ఎలిమినేషన్ లో ఉన్న వారిని సేవ్ చేసే రౌండ్స్ జరుగాయి. ఫస్ట్ రౌండ్ లో ప్రిన్స్ సేవ్ అయ్యాడు. రెండో రౌండ్ లో రతికా,మూడో రౌండ్ లో శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్, నాలుగో రౌండ్ లో గౌతమ్ సేవ్ అయ్యారు. ఇక చివర్లో తేజా, షకీలా మిగిలారు.
ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ నడిచింది. షకీలా, తేజాలను యాక్టివిటీ రూమ్ లోకి పిలిచిన నాగార్జున ఎవరి ఫోటో బయటకు వస్తే వారు సేఫ్ అన్నారు. తేజా ఫోటో రావడంతో షకీలా ఎలిమినేట్ అయినట్లు నాగార్జున వెల్లడించారు. షకీలా ఎలిమినేషన్ కంటెస్టెంట్స్ ని భావోద్వేగానికి గురి చేసింది. సందీప్, అమర్ దీప్ కన్నీరు పెట్టుకున్నారు. దామిని పెదవే పలికే మాటల్లోని తీయని మాటే అమ్మ… సాంగ్ పాడింది. వేదిక మీద ఉన్న షకీలా కూడా కన్నీరు పెట్టుకుంది.
షకీలా ఎలిమినేషన్ తో ఇంట్లో 12 మంది సభ్యులు మిగిలారు. నేడు సోమవారం కాగా నామినేషన్స్ ప్రక్రియ మొదలుకానుంది. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అంబటి అర్జున్, పూజా మూర్తి, ఫర్జానా వంటి క్రేజీ కంటెస్టెంట్స్ హౌస్లోకి రానున్నారని ప్రచారం జరుగుతుంది. కొత్తవాళ్లు వస్తే మజా ఉంటుంది.