టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా అవినీతి ఆరోపణలతో బుక్కైపోతున్నారు. ఆ మధ్య అచ్చెన్నాయుడు, ఆ తర్వాత దేవినేని, కొల్లు రవీంద్ర.. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ధూలిపాళ నరేంద్ర. సంగం డెయిరీని అడ్డుపెట్టుకొని ఎన్నో అక్రమాలకు నరేంద్ర పాల్పడ్డారనేది అభియోగం. ఈ కేసులో తాజాగా ఏసీబీ అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు.
గతేడాది సంగం డెయిరీ ఆఫీసులో ఏకంగా రూ.44 లక్షలు మాయమయ్యాయి. లాకర్ లో 70 లక్షల నగదు ఉండగా.. పెద్ద నోట్ల రూపంలో ఉన్న 44 లక్షలను కాజేశారు. అయితే.. కొన్ని గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నప్పటికీ.. ఇప్పటికీ విచారణ పూర్తికాలేదట. దీంతోపాటు.. ఎన్నో అక్రమాలు సంగం డెయిరీలో చోటు చేసుకున్నాయనే విమర్శలు ఉన్నాయి.
మొత్తం ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ధూలిపాళ. గతేడాది ఓడిపోయారు. అయితే.. రాజకీయాలతో సంబంధం లేకుండా 2010 నుంచి ఆయన సంగం డెయిరీ చైర్మన్ గా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఎన్నో అవినీతి చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు హయాంలో ఆయనకు మంత్రి పదవి రాకపోవడానికి కారణం ఇదేనని అంటారు. ఆయన అవినీతిని వెలికి తీసిన ఏసీబీ.. ఇప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్ తో అరెస్టు చేసింది.
ధూలిపాళ అరెస్టుతో టీడీపీలో మరోసారి అలజడి చెలరేగింది. వరుసగా నేతలు అరెస్టు అవుతుండడంపై కేడర్ లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పార్టీ పీకల్లోతు కష్టాల్లో ఉండగా.. నేతలు ఒక్కొక్కరుగా అవినీతి మరకలు అంటించుకుండడం వారిని కుంగదీస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిలిన దెబ్బలతోనే సతమతం అవుతుంటే.. నేతల అరెస్టు వ్యవహారం గోటి చుట్టుపై రోకటి పోటు అన్న చందంగా తయారైందని ఆవేదన చెందుతున్నారు.
మరికొందరు మాత్రం.. ఇదంతా జగన్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే చేస్తోందని ఆరోపిస్తున్నారు. తాను అరెస్టు అయ్యాడు కాబట్టి.. ప్రత్యర్థులను కూడా జైలుకు పంపించాలనే ఉద్దేశంతోనే వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు చేస్తున్నారు. టీడీపీ నేతలు వరుసగా అరెస్టు అవుతుండడం ఇందులో భాగమేనని అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి చర్యలు మానుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే.. ప్రజలు తగిన బుద్ధిచెబుతారని అంటున్నారు.