DK Shivakumar: మహాలక్ష్మి పథకంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు అటు కర్ణాటక, ఇటు తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులు మినహా మిగతా అన్నింటిలోనూ మహిళలు ఆధార్ కార్డు చూపిస్తే చాలు ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. అయితే మహాలక్ష్మి పథకానికి సంబంధించి ప్రతిపక్షాలు రకరకాల విమర్శలు చేస్తున్నాయి. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వాలు వెనకడుగు వేయడం లేదు. ప్రతి నెల మహాలక్ష్మి పథకానికి సంబంధించిన రాయితీ నగదును ఆర్టీసీ ప్రభుత్వాలు బదలాయిస్తున్నాయి.. అయితే మహాలక్ష్మి పథకంపై పురుషులు రకరకాల విమర్శలు చేస్తున్నారు. ” మహాలక్ష్మి పథకం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి.. కూర్చోవడానికి సీట్లలో ఖాళీ ఉండటం లేదు. టికెట్ కొనుగోలు చేసి నిలబడి ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రభుత్వాలు ఈ పథకంపై పునరాలోచన చేయాలని” సామాజిక మాధ్యమాల వేదికలుగా పురుషులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఆటో డ్రైవర్లు కూడా మహాలక్ష్మి పథకాన్ని నిరసిస్తున్నారు. ఆ పథకం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. ఆమధ్య తెలంగాణ రాష్ట్రంలో ధర్నాలు, నిరసనలు చేపట్టారు.
ఉప ముఖ్యమంత్రి ప్రకటనతో..
మహాలక్ష్మి పథకానికి నాంది పలికిన కర్ణాటక రాష్ట్రంలో.. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ సంచలన ప్రకటన చేశారు. ఇకపై పురుషులకు కూడా ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తామని ఇటీవల ప్రకటించారు. ఇది కర్ణాటక రాష్ట్రంలో సంచలనంగా మారింది. దీనిని కొంతమంది స్వాగతిస్తుండగా.. మరి కొంతమంది వ్యతిరేకిస్తున్నారు..” ఉచిత పథకాల వల్ల ప్రజలు సోమరులుగా మారిపోయారు. ఇలానే ఉచితాలు ప్రకటించుకుంటూ వెళ్తే భవిష్యత్తు కాలంలో ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇప్పటికే అనేక రాయితీలు ప్రజలను సోమరిపోతులుగా మార్చేశాయి. ఒకప్పుడు వెనిజులా దేశంలో అధికారంలోకి రావడానికి అక్కడి పార్టీలు ఇలానే ఉచితాలు అమలు చేశాయి. ఫలితంగా ఇప్పుడు ఆ దేశం ఆర్థికంగా తీవ్ర ఇబ్బంది పడుతోంది. కరెన్సీ రేటు డాలర్ విలువతో పోల్చితే దారుణంగా పడిపోయింది. దీంతో అక్కడి ప్రభుత్వం ప్రైవేటైజేషన్ వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఈ ప్రకారం చూసుకుంటే అక్కడ ప్రతి సౌకర్యం ప్రజలకు డబ్బు ఖర్చు చేస్తేనే అందుబాటులోకి వస్తుంది. ఒకప్పుడు ఉచితాలు అందుకున్న ప్రజలు.. ఇప్పుడు డబ్బు ఖర్చు చేస్తున్నారు. దీనిని బట్టి ఉచితాలు ఎంతటి దారుణ పరిస్థితులకు కారణమవుతాయో అర్థం చేసుకోవచ్చు.. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు ఉచిత పథకాలను ప్రకటించడం మానుకోవాలి. పారదర్శకమైన పరిపాలన అందించడానికి కృషి చేయాలి.. అప్పుడే మన దేశం బాగుపడుతుందని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.