Delhi Pollution: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో వాతావరణం రోజు రోజుకూ అధ్వానంగా మారుతోంది. గాలి నాణ్యత పడిపోతోంది. చలికాలం నేపథ్యంలో వాయు కాలుష్యం పెరిగింది. మరోవైపు పొరుగ రాష్ట్రాల నుంచి వస్తున్న పొగ రాజధానిని కమ్మేస్తోంది. తాజాగా బుధవారం అత్యంత అధ్వాన స్థాయికి గాలి నాణ్యత పడిపోయింది. ఏక్యూఐ 400 కన్నా ఎక్కువగా నమోదైందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. గుర్‌గ్రామ్, నోయిడాలోనూ వాతావరణం అధ్వానంగా మారింది. దట్టమైన పొగ కారణంగా గాలి నాణ్యత పడిపోయింది.
విమానాలకు ఆటకం..
వాయి కాలుష్యం, దట్టమైన పొగ కారణంగా ఉదయం 10 గంటలకు కూడా ఢిల్లీలో రోడ్లు కనిపించడం లేదు. వాహనదారులు లైట్లు వేసుకునే వెళ్తున్నారు. ఇక పొగ కారణంగా విమానాలు కూడా టేకాఫ్ అయ్యే పరిస్థితి లేదు. దీంతో విమానాల రాకపోకలకు అంతరాకం కలుగుతోంది. ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దేశ రాజధానికి వెళ్లే కొన్ని విమానాలను దారి మళ్లించింది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకారం, ఉదయం 5.30 గంటలకు చాలా దట్టమైన పొగమంచు ఏర్పడటం ప్రారంభించింది, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) మంగళవారం సాయంత్రం 316 నుంచి బుధవారం ఉదయం 370కి దిగజారింది. రాజధాని ప్రాంతంలోని అనేక ప్రాంతాలలో 300 కంటే ఎక్కువ నమోదైంది.
ఈ ప్రాంతాల్లో దారుణంగా..
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డేటా ప్రకారం, అయా నగర్, ఆనంద్ విహార్, ఢిల్లీ యూనివర్శిటీ నార్త్ క్యాంపస్‌లు బుధవారం నాడు 400 కంటే ఎక్కువ గాలి నాణ్యతతో నగరంలో అధ్వాన్నమైన గాలి నాణ్యతను నమోదు చేశాయి. ఇది తీవ్రమైన కేటగిరీ కిందకు వస్తుంది. ఏక్యూఐ 300 కంటే ఎక్కువ ఉన్న ఇతర ప్రాంతాలలో ఆనంద్ విహార్, ఏక్యూఐ 396, జహంగీర్‌పురి, 389, ఐఎఐ ఎయిర్‌పోర్ట్ 368లో నమోదు చేసింది.
నోయిడా, గుర్‌గ్రామ్‌లోనూ..
ఇక నోయిడా, గురగ్రామ్‌లోనూ బుధవారం గాలి నాణ్యత పడిపోయింది. పొరుగున ఉన్న పంజాబ్, హరియాణా రాష్ట్రాల నుంచి వస్తున్న దట్టమైన పొగ కారణంగా వాతావరణంలో మార్పులు జరుగుతున్నాయి. ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతున్నా గాలి నాణ్యత దెబ్బతింటోంది. పొగ మంచు కారణంగా బుధవారం నోయిడా, గుర్‌గ్రామ్ ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. రెండు నగరాల్లో ఏక్యూఐ 260కిపైనే నమోదైంది. ఇది వృద్ధులు, పిల్లలకు ఇబ్బందిగా మారింది. శ్వాస కోస సమస్యలు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఢిల్లీలో అయితే ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారింది. చిన్న పిల్లలు, వృద్ధులు బయటకు రావొద్దని వాతావరణ శాఖ సూచిస్తోంది.