Delhi assembly election results 2025 : ఢిల్లీలో వాయు కాలుష్యమే కాదు.. వ్యర్ధాల ద్వారా చోటు చేసుకునే కాలుష్యం కూడా ఎక్కువే. కాకపోతే ఢిల్లీలో పోగుపడిన వ్యర్ధాలను.. చెత్తను కొన్ని ప్రాంతాలలో డంప్ చేస్తుంటారు. అందువల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారికి నిత్యం నరకం కనిపిస్తుంది.. ఢిల్లీలోని భలస్వ ల్యాండ్ ఫీల్ (balaswa land feel) ప్రాంతంలోని కళాందర్ కాలనీ, దాదా శివ్ పాటిల్ నగర్ ఉన్నాయి.. ఈ ప్రాంతాల్లోనే ఢిల్లీ నగరంలో ఉన్న చెత్తను మొత్తం డంప్ చేస్తుంటారు.. ప్రతిరోజు వేల టన్నుల్లో వ్యర్ధాలను ఇక్కడికి తీసుకొస్తుంటారు.. అయితే ఈ ప్రాంతాలలో జీవిస్తున్న వారు ఈ చెత్త వల్ల నరకం చూస్తున్నారు. కొన్నిసార్లు ఢిల్లీ నగరపాలక అధికారులు ఈ చెత్తకు నిప్పు పెట్టడం వల్ల ఇక్కడ నివసించే ప్రజలకు ఊపిరి ఆనని పరిస్థితి నెలకొంటుంది.. ఈ ప్రాంతంలో నివసించేవారు మొత్తం పేదలే. వారి పొట్ట గడవడం కోసం శక్తివంతమైన అయస్కాంతాల సహాయంతో ఆ చెత్తలోని ఇనుప ముక్కలను బయటకు తీసి.. బయట విక్రయిస్తుంటారు. ” మా అమ్మానాన్నలు పేదలు. ఇక్కడే ఒక చిన్నపాటి గదిలో మేము ఉంటున్నాం. శక్తివంతమైన అయస్కాంతాల సహాయంతో మేము ఇనుప వస్తువులు సేకరిస్తాం. మహా అయితే మాకు రోజుకు రెండు లేదా మూడు వందల రూపాయలు వస్తాయి.. అదృష్టం బాగున్న రోజు మాత్రం వేల రూపాయల విలువైన వస్తువులు లభిస్తాయి. అయితే ఇవేవీ మా జీవితాన్ని మార్చడం లేదు. నాయకులు వస్తున్నారు. వాగ్దానాలు ఇస్తున్నారు. అంతేతప్ప మా జీవితాలను మార్చడం లేదని” దాదా శివ్ పాటిల్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఇటీవల తన మనోగతాన్ని జాతీయ మీడియాతో చెప్పడంతో ఒకసారిగా సంచలనం నమోదయింది.
మురికి కూపం
భలస్వా ప్రాంతంలో కళాందర్ కాలనీ ఉంది. ఇక్కడ మురికి నీరు ఊటలాగా వస్తోంది. వీధుల వెంబడి ప్రవహిస్తూ ఉంటుంది. ఎక్కడ చూసినా ఈగలు, దోమలు కనిపిస్తుంటాయి. ఇక్కడ ప్రజలు మనుషుల కంటే పురుగుల్లా బతుకుతున్నారని చెప్పడం సబబు. ఇటీవల రోషిణి అనే ఓ మహిళ మురికి గుంతలో పడటంతో కాలు విరిగింది. ఈ ప్రాంతాల్లో రోడ్లు సరిగా లేకపోవడంతో.. ఈ ప్రాంత ప్రజలే తలా ఇంత చందాలు వేసుకొని రోడ్లు నిర్మించుకున్నారు. ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు పూర్తిస్థాయిలో కలుషితం కావడంతో.. అవి తాగడానికి పనికి రావడం లేదు. చివరికి కుళాయిల నుంచి వచ్చే మీరు కూడా మురికిగానే ఉంటున్నది. కలుషిత నీరు తాగడం వల్ల ప్రజల ఆరోగ్యాలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. ఇక్కడ చెత్తను శుభ్రం చేయడానికి ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు సంకల్పించలేదు.. రాజకీయాలలో సచ్చిలతను తీసుకొస్తామని హామీ ఇచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ.. తన పార్టీ గుర్తు చీపురుతో ఇక్కడ చెత్తను శుభ్రం చేయలేదు. ఇప్పటికే ఎన్నోసార్లు తమ సమస్యపై ఈ ప్రాంత ప్రజలు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు విన్నవించినప్పటికీ న్యాయం జరగలేదు. ఇప్పుడు బిజెపి అధికారంలోకి వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ ఇక్కడ ప్రజలకు పెద్దగా నమ్మకాలు లేవు. ఎందుకంటే దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలు నరకం చూస్తున్నారు. తమ పరిస్థితిని మెరుగుపరుస్తారని.. గొప్పగా చేస్తారని ఏ మాత్రం నమ్మకాలు వీరిలో లేవు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు కూడా పెద్దగా తమ ఓటు హక్కును వినియోగించుకోలేదంటే.. వారిలో నిరాశ నిస్స్పృహ ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.