సీపీఎం ఎంపీ వి.శివదాసన్ ఎన్ఎన్ వో గ్రూప్ టెక్నాలజీస్ తో రక్షణ శాఖకు ఏమైనా వ్యాపార లావాదేవీలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఒకవేళ ఉంటే వివరాలు చెప్పాలని కోరారు. దీనికి రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ లిఖితపూర్వకంగా సమాధానం చెప్పారు. ఎన్ఎన్ వో గ్రూప్ తో రక్షణ శాఖకు ఎలాంటి లావాదేవీలు లేవని తేల్చారు.
పెగాసస్ స్పైవేర్ తో సహా భారత్ తోపాటు అనేక దేశాలు ప్రముఖుల ఫోన్లపై నిఘా పెట్టేందుకు ఈ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారంలో దాదాపు 300 మంది ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖులు, సీబీఐ అధికారులు, జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలు సైతం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభానికి ఒక రోజు ముందే జులై 18న పెగాసస్ వ్యవహారంపై పలు కథనాలు వెలువడ్డాయి. దీంతో ఈ అంశంపై ప్రతిపక్షాలు సైతం చర్చకు పట్టుబట్టాయి దీంతో ఉభయ సభల్లో ఆందోళన నెలకొంది. దీంతో పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చలకు ఆస్కారం లేకుండా వాయిదాల పర్వం కొనసాగింది.
పెగాసన్ వ్యవహారంపై కథనాలను కేంద్రం కొట్టిపారేసింది. భారత ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చేందుకే ప్రభుత్వం ఇలా ప్రవర్తిస్తోందని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. భారత్ లో అధికారిక నిఘా సాధ్యం కాకపోవడంతో ఈ విధంగా ట్యాపింగ్ కు పాల్పడున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రతిపక్షాలు దీనిపై పార్లమెంటరీ స్థాయి దర్యాప్తునకు అంగీకరించాలని కోరుతున్నాయి.