Dadi Family: సీనియర్ నాయకుడు దాడి వీరభద్రరావు వైసీపీ పక్కన పెట్టిందా? ఆయన అవసరం లేకుండానే అనకాపల్లిలో గెలవాలని చూస్తుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. నాలుగేళ్ల కిందట ముచ్చటపడి రెండోసారి వైసీపీ లో చేరారు దాడి వీరభద్రరావు, ఆయన కుమారుడు.కానీ ఆ ఎన్నికల్లో అనకాపల్లి అసెంబ్లీ సీటును దక్కించుకోలేకపోయారు. వైసిపి అధికారంలోకి వచ్చిన దాడి వీరభద్రరావును పట్టించుకునే వారే కరువయ్యారు.
మంత్రి గుడివాడ అమర్నాథ్ అడుగడుగునా అడ్డు తగలడం వల్లే దాడి వీరభద్రరావుకుఎటువంటి పదవి దక్కలేదన్న టాక్ నడుస్తోంది.టిడిపిలో గౌరవమైన స్థానాన్ని వదులుకొని.. దాడి వీరభద్రరావు జగన్ వెంట నడిచారు. కానీ పెద్దాయనకు ఎటువంటి గౌరవం దక్కలేదు.కుమారుడు రత్నాకర్ కు మంచి పొలిటికల్ లైఫ్ ఇవ్వాలని వీరభద్రరావు భావించారు. కానీ వైసీపీలో అడుగడుగునా వారికి అవమానాలు ఎదురవుతున్నాయి. దీంతో దాడి వీరభద్రరావు ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
సీఎం జగన్ సైతం దాడి వీరభద్రరావును పక్కన పెట్టినట్లేనని తెలుస్తోంది.ఎప్పుడో కాంగ్రెస్ హయాంలో ఒక వెలుగు వెలిగిన దంతులూరి దిలీప్ కుమార్ కు జగన్ పిలిచి మరి కీలకమైన నామినేటెడ్ పదవి కట్ట పెట్టారు. గత ఎన్నికల్లో అనకాపల్లి టిడిపి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన అడారి ఆనంద్ కుమార్ కి వైసీపీలో చేర్చుకున్నారు. ఏకంగా ఆయనకు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జిని చేశారు. అందరికీ అన్నీ ఇస్తున్నా దాడి వీరభద్రరావు విషయంలో మాత్రం జగన్ మొండి చేయి చూపుతున్నారు. ఇది దాడి వీరభద్రరావు, ఆయన కుమారుడు రత్నాకర్ కు మింగుడు పడడం లేదు. దీంతో వారు సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు సమాచారం.
వైసీపీలో ఒక పద్ధతి ప్రకారం తమపై అణచివేత జరుగుతున్నట్లు వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక గుడివాడ అమర్నాథ్ పాత్ర ఉందని ఆగ్రహంగా ఉన్నారు. దాడి కుటుంబం ప్రమేయం లేకుండా అనకాపల్లిలో గెలవాలని వైసిపి భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో దాడి వీరభద్రరావు పూర్వాశ్రమం టిడిపిలో చేరే పరిస్థితులు కనిపించడం లేదు. జనసేనలో చేరతారని ప్రచారం సాగుతోంది. పవన్ తో సన్నిహిత సంబంధాలు ఉండడమే అందుకు కారణం. కొద్ది రోజుల్లో దాడి కుటుంబం రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.