Chandrababu: చంద్రబాబు రాజకీయాలు ఊహించడం చాలా కష్టం. ఓటమి ఎదురైన ప్రతిసారీ ఆయన గెలుపు కోసం చేసే ప్రయత్నం భిన్నంగా ఉంటుంది. ప్రజల మనసును గుర్తించి రాజకీయం చేస్తారు. తమలో ఉన్న లోటుపాట్లతో పాటు ప్రత్యర్థుల బలం, బలహీనతలను అంచనా వేసుకునే అడుగులు వేస్తారు. ప్రస్తుతం ఆయన చేస్తున్నది అదే. ప్రజల్లోకి వెళ్లి వారితో మమేకం అయ్యేందుకే ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు.
ఆ మధ్యన ప్రాజెక్టుల బాట చేపట్టారు. పెన్నా టూ వంశధార ప్రాజెక్టులను సందర్శించారు. వైసీపీ సర్కార్ సాగునీటి ప్రాజెక్టులపై చేస్తున్న నిర్లక్ష్య వైఖరిని క్షేత్రస్థాయిలో ఎండగట్టారు. ఏకంగా ప్రజల మధ్య పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గణాంకాలతో సహా జగన్ సర్కార్ వైఫల్యాలను వివరించారు. దీంతో ఇది ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. టిడిపికి సైతం మైలేజ్ ఇచ్చింది.
పంద్రాగస్టు నాడు చంద్రబాబు విజన్ 2047ను ఆవిష్కరించారు. ఇందుకు విశాఖను వేదికగా ఎంచుకున్నారు. రెండున్నర కిలోమీటర్ల మేర నగరంలో పాదయాత్ర చేశారు. వివిధ రంగాల నిపుణులు, ప్రజల మధ్య విజన్ 2047 ఆవిష్కరించారు. వారి అనుమానాలను నివృత్తి చేశారు. వారి ప్రశ్నలకు నిలకడగా సమాధానాలు చెప్పారు.2014 ఎన్నికలకు ముందు కూడా చంద్రబాబు ఇదే మాదిరిగా వ్యవహరించారు. ప్రజలను ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో తన నాయకత్వ లక్షణాలను ప్రదర్శించారు. ప్రజలకు తాను ఒక ఆప్షన్ గా చూపించడంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు కూడా అదే సీన్ ను చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రస్తుతం చంద్రబాబు గోదావరి జిల్లాల టూర్ లో ఉన్నారు. సడన్ గా ఆయన ప్రజల మధ్యకు వెళ్లారు. కోనసీమ ఆలమూరు నుంచి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. నేరుగా కండక్టర్ నుంచి టిక్కెట్ తీసుకుని రావులపాలెం వరకు ప్రయాణించారు. ప్రయాణికులతో మాట్లాడి ప్రభుత్వ వైఫల్యాలను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు నేరుగా వచ్చి తమను కలవడంతో ప్రయాణికులు ఆనందపడ్డారు. సమకాలీన అంశాలను ఆయనతో పంచుకున్నారు. ఇదంతా ప్రజలతో నేరుగా కనెక్ట్ అయ్యేందుకు బాబు ఈ సరికొత్త టెక్నిక్స్ ని వాడుతున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే వాటి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.