Remal Cyclone: కూల్ న్యూస్: ఆ రోజు నుంచి చల్లబడనున్న వాతావరణం..

26న ఉదయం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలను గంటకు 110-120 కిలో మీటర్ల వేగంతో లేదంటే 135 కిలో మీటర్ల వేగంతో రెమాల్ తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

Written By: Neelambaram, Updated On : May 24, 2024 3:56 pm

Remal Cyclone

Follow us on

Remal Cyclone: ఎండలు మండిపోతున్నాయి. తీవ్రత తట్టుకోలేక వడదెబ్బతో అనారోగ్యానికి గురయ్యే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. సాధారణ వ్యక్తులనే కాదు.. నిత్యం ఏసీలోనే ఉండే షారూక్ ఖాన్ లాంటి వారికి కూడా సూర్యుడు వడదెబ్బ రుచి చూపించాడు. ఇక చాలు.. వాతావరణం ఎప్పుడు కూల్ అవుతుందోనని దేశ ప్రజలంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కూల్ న్యూస్ ను తీసుకువచ్చింది.

మే 26 నాటికి బెంగాల్ ను తుపాన్ తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి మే 26 (ఆదివారం) వరకు తీవ్ర తుపానుగా మారి పశ్చిమ బెంగాల్, పొరుగున ఉన్న బంగ్లాదేశ్ తీరాలను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గురువారం (మే 23) తెలిపింది. ఈ తుపాన్ కు ‘రెమాన్’ అని పేరు పెట్టారు.

26న ఉదయం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలను గంటకు 110-120 కిలో మీటర్ల వేగంతో లేదంటే 135 కిలో మీటర్ల వేగంతో రెమాల్ తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మే 27 ఉదయం వరకు దాదాపు 24 గంటల పాటు తీవ్రత ఉంటుందని, ఆ తర్వాత తగ్గుతుందని తెలిపింది.

ఈ తుపాన్ మే 25న (శనివారం) తీవ్ర అల్పపీడనంగా, మే 26న తీవ్ర తుపాన్ గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కోల్ కత్తా, హౌరా, నదియా, ఝార్గ్రామ్, నార్త్ 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, పుర్బా మెదినీపూర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

పశ్చిమ మధ్య, దానిని ఆనుకొని ఉన్న దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన పీడనం 12 గంటల్లో ఈశాన్య దిశగా పయనించి అల్పపీడనంగా మారి మే 24న ఉదయం 5.30 గంటలకు మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉందని, ఖేపుపారా (బంగ్లాదేశ్)కు నైరుతి దిశగా 800 కిలోమీటర్లు, కానింగ్ (పశ్చిమ బెంగాల్)కు దక్షిణంగా 810 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ఐఎండీ తన బులెటెన్ లో పేర్కొంది.

ఇది ఈశాన్య దిశగా పయనించి 25వ తేదీ ఉదయానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరింత బలపడి తుపాను (రెమాల్) గా మారే అవకాశం ఉందని, ఆ తర్వాత దాదాపు ఉత్తర దిశగా కదులుతూ మే 25 సాయంత్రానికి తీవ్ర తుఫానుగా మారుతుందని స్పష్టం చేసింది. ఇది ఉత్తర దిశగా కదులుతూ, తీవ్రమైన తుపానుగా మే 26 అర్ధరాత్రి సాగర్ ద్వీపం, ఖేపుపారా మధ్య బంగ్లాదేశ్, దాన్ని ఆనుకొని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరాలను దాటే అవకాశం ఉందని తెలిపింది. సముద్రంలో ఉన్న మత్స్యకారులు తీరానికి తిరిగి రావాలని, 27వ తేదీ వరకు బంగాళాఖాతంలో వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది.

అప్రమత్తమైన ఎన్నికల సంఘం
పశ్చిమ బెంగాల్ లోని తమ్లుక్, కంఠీ, ఘటాల్, ఝార్గ్రామ్, మేదినీపూర్, పురూలియా, బంకురా, బిష్ణుపూర్ లోక్ సభ స్థానాలకు శనివారం పోలింగ్ జరగనుంది. తుపాన్ నేపథ్యంలో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం జిల్లా యంత్రాంగాలను ఆదేశించింది.

పశ్చిమ బెంగాల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అరిజ్ అఫ్తాబ్ పోలీస్ సూపరింటెండెంట్లు, రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీలను ఆదేశించినట్లు అఫ్తాబ్ తెలిపారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని, అదనపు సిబ్బందిని కోస్తా జిల్లాలకు పంపామని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ వర్గాలు తెలిపాయి.