Vijayasai Reddy: వైసీపీలో విజయసాయిరెడ్డి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారా? ఆయన పదవులకు, అధికారాలకు కత్తెర వేస్తున్నారా? ఆయన చేస్తున్న లాబియింగ్ తో పార్టీకి చెడ్డపేరు తెస్తుందని భావిస్తున్నారా? లిక్కర్ స్కాంలో వైఎస్ భారతి పేరు బయటకు రావడానికి విజయసాయిరెడ్డే కారణమని అనుమానిస్తున్నారా? అందుకే ఒక్కో పదవి నుంచి ఆయనకు దూరం చేస్తున్నారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. జరుగుతున్న పరిణామాలు వాటికి బలం చేకూరుస్తున్నాయి. ఇప్పుడు పార్టీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. దానికి తగ్గట్టుగానే విజయసాయిరెడ్డి వైసీపీ కేంద్ర కార్యాలయం వైపు రావడం మానేశారు. ఎప్పుడు ట్విట్టర్ ఖాతాలో యాక్టివ్ గా కనిపించే ఆయన ఇప్పుడు బొత్తిగా అయినా తెలుగు రాజకీయాలపై ట్విట్ చేయడం మానేశారు. జగన్ పొగడ్తలతో ముందుండే ఆయన ఇప్పుడు కేంద్ర పెద్దల పొగడ్తలకే పరిమితమవుతున్నారు. అటు వైసీపీ సోషల్ మీడియా పోస్టులను సైతం ఒకటి ఆరా షేర్ చేస్తున్నారు. అయితే వీటిన్నంటికి కారణం లిక్కర్ స్కామ్ గా తెలుస్తోంది. ఈ స్కాంలో విజయసాయిరెడ్డితో పాటు సీఎం జగన్ భార్య భారతి పేరు బయటకు వచ్చింది. అప్పటి నుంచి పార్టీలో విజయసాయిరెడ్డిని దూరం పెడుతున్నారన్న ప్రచారం అయితే ఉంది.

సోషల్ మీడియా బాధ్యతల నుంచి అవుట్..
వైసీపీ ఆవిర్భావం నుంచి విజయసాయిరెడ్డి వద్ద ఉన్న కీలక విభాగాలను ఆయన్నుంచి దూరం చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా విభాగం పర్యవేక్షణ బాధ్యతలను తప్పించారు. వైసీపీ అధికారంలోకి తీసుకురావాడానికి సోషల్ మీడియా విభాగమే కారణమని ఇప్పటికీ చెబుతుంటారు. అటువంటి విభాగాన్ని విజయసాయిరెడ్డిని కాదని ఓ ముఖ్య నాయకుడి కుమారుడికి అప్పగించాలన్న యోచనలో జగన్ ఉన్నారు. కొద్దిరోజులుగా విజయసాయి పార్టీకి దూరంగా ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. కొద్దిరోజుల కిందట పార్టీ సోషల్ మీడియా విభాగాల భర్తీ ప్రక్రియ కూడా హాజరుకాలేదు. సజ్జల అన్నీతానై ఈ వ్యవహారాలను చూసుకున్నారు. సోషల్ మీడియా వింగ్ నియామకాలను చేపట్టారు. అయితే దీనికి విజయసాయిరెడ్డికి ఆహ్వానించలేదని తెలుస్తోంది. మొత్తం కీలక సోషల్ మీడియా విభాగాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి టేకోవర్ చేసుకున్నారన్న ప్రచారమైతే ఉంది.
గతంలో ఓ సారి…
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానులకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. పాలనా రాజధానిగా విశాఖను ప్రకటించింది. అంతకంటే ముందుగా విశాఖతో పాటు ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతలను సీఎం జగన్ విజయసాయిరెడ్డికి అప్పగించారు. కానీ విజయసాయి అక్కడ పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రాబల్యం పెంచుకోవడానికి ప్రయత్నించారని సీఎంకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఆయన్ను ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించారు. కేవలం పార్టీ కేంద్ర కార్యాలయానికి పరిమితం చేశారు. దీనిపై మనస్తాపానికి గురైన విజయసాయి సీఎం భార్య భారతి ద్వారా లాబియింగ్ నడిపారు. దీంతో జిల్లా పార్టీ అధ్యక్షులు, రీజనల్ సమన్వయకర్తల బాధ్యతను విజయసాయికి అప్పగించారు. అటు సోషల్ మీడియా విభాగాన్ని కూడా చూసేవారు. కానీ ప్రస్తుతం ఒక్కొక్క పదవిని ఆయన్నుంచి దూరం చేస్తుండడం పార్టీ వర్గాల్లో కూడా చర్చనీయాంశమవుతోంది.

ఆ స్కామ్ తో…
ఇటీవల వెలుగుచూసిన లిక్కర్ స్కామే విజయసాయిరెడ్డి పరిస్థితికి కారణమన్న టాక్ అయితే వినిపిస్తోంది. ఈ స్కామ్ లో విజయసాయిరెడ్డి అల్లుడు కు చెందిన అరబిందో గ్రూపుతో పాటు ఏపీ సీఎం జగన్ భార్య భారతి పేర్లు బయటకు వచ్చినట్టు టాక్ అయితే నడిచింది. దీనికి విజయసాయిరెడ్డి వ్యవహార శైలే కారణమని సీఎం జగన్ అనుమానిస్తున్నారు. అనవసరంగా వైసీపీ ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చిపెట్టారని విజయసాయిరెడ్డిపై ఆగ్రహ: వ్యక్తం చేసినట్టు సమాచారం. అప్పటి నుంచి విజయసాయిరెడ్డి కేంద్ర పార్టీ కార్యాలయానికి రావడం తగ్గించేశారు. సోషల్ మీడియా పోస్టులను కూడా బాగా తగ్గించేశారు. కానీ కేంద్ర పెద్దలను మాత్రం పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ట్విట్టర్ వ్యాఖ్యానాల బాధ్యతలను ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. మొత్తానికైతే లిక్కర్ స్కాంతో విజయసాయిరెడ్డికి తాడేపల్లి డోర్స్ క్లోజ్ అయ్యాయన్న మాట.