Hyderabad Neera Cafe: సండే ఎంజాయ్ మామూలుగా లేదు.. నీరా కేఫ్ కు క్యూ కట్టేసిన హైదరాబాదీలు

ఆదివారం సెలవు దినం కావడంతో సాగర తీరంలోని నీరా కేఫ్ దగ్గర నగరవాసులు భారీగా క్యూ కట్టారు. ఉదయం 10 గంటలకు ఈ కేఫ్ ఓపెన్ కావడంతో అప్పటికే చేరుకున్నారు.

Written By: NARESH, Updated On : May 7, 2023 7:39 pm

neeracafe

Follow us on

Hyderabad Neera Cafe:  తెలంగాణ ప్రజలకు ప్రకృతి సిద్ధమైన నీరాను అందించాలని భావించిన తెలంగాణ ప్రభుత్వం రూ.12 కోట్ల రూపాయల వ్యయంతో నీరా కేఫ్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. స్టార్ హోటల్ ను తలపించేలా ఈ కేఫ్ ను హైదరాబాదు నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేశారు. ఈ నెల 3వ తేదీన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ ఈ కేఫ్ ను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఈ నీరా కేఫ్ ప్రారంభమైనప్పటి నుంచి భారీగా ప్రజలు వస్తున్నారు.

తెలంగాణ ప్రజలకు ప్రకృతి సిద్ధమైన, స్వచ్ఛమైన నీరాను హైదరాబాద్ నగరవాసులకు అందించే ఏర్పాటును ప్రభుత్వం చేసింది. నూతన హంగులతో నీరా కేఫ్ ను ప్రారంభించింది ఆ ప్రభుత్వం. ఈ నీరా రుచిని ఇప్పుడు నగర ప్రజలు తెగ ఇష్టపడుతున్నారు. ప్రకృతి సిద్ధమైన, ఎన్నో ఔషధ గుణాలు కలిగినది కావడంతో ఈ నీరాను తాగేందుకు భారీ సంఖ్యలో నగరవాసులు వస్తున్నారు. ఈ నీరాను ఎక్కువగా ఉదయాన్నే తాగుతారు.
ఈ కేఫ్ లో ప్రత్యేకంగా లభించే డ్రింక్ పేరు నీరా..

ఈ నీరా కేఫ్ లో ప్రత్యేకంగా లభించే డ్రింక్ పేరు నీరా. ఇది ఆల్కహాల్ కాదని రాష్ట్ర ప్రభుత్వం కూడా చెబుతోంది. ఆరోగ్యానికి మేలు చేసే పలు పదార్థాలతో దీన్ని తయారు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ కేఫ్ ను కూడా అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. కేఫ్ చుట్టూ తాటిచెట్లను ఏర్పాటు చేసి చూసేందుకు కళ్ళు కాంపౌండ్ మాదిరిగా దీనిని రూపొందించారు. నీరా హెల్త్ డ్రింక్ అని ఇక్కడ సిబ్బంది చెబుతున్నారు. నీరాతోపాటు 16 బై ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఈ నేరా కేఫ్ లో తెలంగాణ రుచులు కూడా అందించేందుకు అనుగుణంగా ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశారు. నీరా బెల్లం, తేనె, చాక్లెట్, ఐస్ క్రీమ్, స్వీట్స్ వంటి ప్రత్యేక రుచులు ఇక్కడ లభించేలా ఏర్పాట్లు చేశారు. నీరా సేకరించిన దగ్గర నుంచి విక్రయించే అంతవరకు ప్రత్యేక జాగ్రత్తలను తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు.

అక్కడ నుంచి సేకరించి తీసుకువచ్చి..

నగర శివారులోని నందనవనంలోని తాటి చెట్ల నుంచి నీరాను సేకరిస్తారు. నీరా నాలుగు డిగ్రీల వద్ద సురక్షితంగా నిల్వ ఉంటుంది. తాటి, ఈత చెట్ల నుంచి నీరాను సేకరించిన తర్వాత దాన్ని సీసాలో ప్యాక్ చేసి ఐసు బాక్సుల్లో నగరానికి తీసుకువస్తారు. ఇలా తెచ్చిన నీరాను కేఫ్ ల్లో శుద్ధి చేసిన అనంతరం ప్యాకింగ్ చేసి విక్రయిస్తారు. కల్లుకు, నీరాకు చాలా తేడా ఉంది. కల్లులో ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది. నీరాలో అది ఉండదు. నీరా తాగేందుకు తీయగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిదని రాష్ట్రం ప్రభుత్వం కూడా చెబుతోంది.

సెలవు కావడంతో కేఫ్ వద్ద బారులు..

ఆదివారం సెలవు దినం కావడంతో సాగర తీరంలోని నీరా కేఫ్ దగ్గర నగరవాసులు భారీగా క్యూ కట్టారు. ఉదయం 10 గంటలకు ఈ కేఫ్ ఓపెన్ కావడంతో అప్పటికే చేరుకున్నారు. అయితే, ఉదయం నుంచే ఎంతో మంది కేఫ్ కు వచ్చినప్పటికీ ఎవరు కూడా అసహనానికి గురికాకుండా పద్ధతిగా లైన్ లో నిలబడి మరి నీరా రుచి చూశారు. అదివారం మధ్యాహ్నం వరకు సుమారు 1500 నుంచి 2000 మంది ప్రజలు కేఫ్ కి వచ్చారని, 300 లీటర్లకు పైగా అమ్మకాలు జరిగాయని ఇక్కడి సిబ్బంది తెలిపారు. అంటే, ఏ స్థాయిలో నీరా రుచి చూసేందుకు జనాలు వచ్చారో అర్థం చేసుకోవచ్చు. 300 ఎంఎల్ క్వాంటిటీ కలిగిన నీరా బాటిల్ రూ.90 రూపాయలకు విక్రయిస్తున్నారు. సాగర తీరంలోని అందాలను ఆస్వాదించుకుంటూ నీరాను నగర వాసులు తాగేస్తున్నారు. నీరా తాగడానికి వచ్చిన వారిలో ఎక్కువగా కొత్తవారు, యువకులు ఉండడం గమనార్హం. ఏది ఏమైనా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ నీరా కేఫ్ ఇప్పుడు హైదరాబాద్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని అనడంలో అతిశయోక్తి లేదని పలువురు పేర్కొంటున్నారు.