‘Wine’ group : ‘వైన్’ పేరిట కోట్ల రూపాయలు దోచేశారు

తొలుత వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేశారు. తెలిసిన వారందరికీ అందులో యాడ్ చేశారు. ఒక లింక్ పంపించారు. ఒక్క వైన్ సీసా కొనుగోలు చేస్తే దానికి 60 రోజుల్లో మూడురెట్లు ఇస్తామని నమ్మబలికారు. రూ.85 వేలుపెడితే ప్రతిరోజు రూ.12,300 చొప్పున అందిస్తామని చెప్పారు

Written By: NARESH, Updated On : June 6, 2023 8:53 pm
Follow us on

‘Wine’ group : గొలుసుకట్టు వ్యాపారాలు.. ఇటీవల తరచూ వినిపించే మాట ఇది. దీనిని ఇంగ్లీష్ లో మ‌ల్టీ లెవ‌ల్ మార్కెటింగ్ గా వర్ణిస్తారు. ఒక కంపెనీ త‌న అవ‌స‌ర‌మైన ప్రొడ‌క్ట్స్‌ని సుల‌భంగా అమ్ముకోవ‌డానికి ఉప‌యోగించే ప్లాన్ ఈ గొలుసుక‌ట్టు వ్యాపారం. ఒక‌రి చేత త‌న ప్రొడ‌క్ట్స్‌ను కొనిపించి అవి కొన్న వాళ్ల‌తో ఇంకా మ‌రో ఇద్ద‌రికి అమ్మ‌డానికి ప్రోత్స‌హించే విధానం ఇది. ఈ ఉత్ప‌త్తుల్లో బ్యూటీ ప్రొడ‌క్ట్స్‌, హాలిడే ప్యాకేజెస్‌, వాచీలు వంటివి తొలినాళ్లలో ఉండేవి. ఇప్పుడు ప‌ప్పులు, ఉప్పులు, నూనెలు, బియ్యం లాంటి నిత్య‌వ‌స‌ర స‌ర‌కులను సైతం చేర్చుతున్నారు. అయితే గొలుసుకట్టు వ్యాపారాల మాటున మోసాలు పెరుగుతున్నాయి.ఇలాంటి మోసమే తెలంగాణలోని మంచిర్యాలలో వెలుగుచూసింది. అయితే అది వైన్ తయారీ పేరిట జరిగిన మోసం. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా వందలాది మంది బాధితులుగా మిగిలారు.

మేము వైన్ కంపెనీలో పెట్టుబడులు పెడుతున్నాం.. మీరు ఒక్క వైన్ బాటిల్ పై పెట్టుబడి పెట్టిండి. 60 రోజుల్లో మూడు రెట్లు ఇస్తాం. మీరు ఎంత పెట్టుబడి పెట్టినా పర్వాలేదు. పైగా ఇందులో జాయిన్ చేసేవారికి నెలానెలా జీతాలు అని కూడా ప్రకటించారు. ఇంకేముంది వందలాది మంది లక్షల రూపాయల్లో పెట్టారు. కోట్లలో సమర్పించుకున్నారు. కొన్నాళ్ల పాటు సవ్యంగా సాగించిన గొలుసుకట్ట వ్యాపారం. తరువాత తెగిపోయింది. నిర్వాహకులు సొమ్ముతో ఉడాయించారు. బాధితులకు కుచ్చుటోపీ పెట్టారు. తెలంగాణ వ్యాప్తంగా వేలాది మంది బాధితులు ఉన్నట్టు తెలుస్తోంది. ముందుగా మంచిర్యాల పట్టణంలో ఇది వెలుగుచూసింది.

తొలుత వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేశారు. తెలిసిన వారందరికీ అందులో యాడ్ చేశారు. ఒక లింక్ పంపించారు. ఒక్క వైన్ సీసా కొనుగోలు చేస్తే దానికి 60 రోజుల్లో మూడురెట్లు ఇస్తామని నమ్మబలికారు. రూ.85 వేలుపెడితే ప్రతిరోజు రూ.12,300 చొప్పున అందిస్తామని చెప్పారు. కొద్దిరోజుల పాటు పరిమిత మందికి అందించారు. దీంతో నమ్మకం కుదరడంతో ఇందులో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య పెరిగింది. అంటితో ఆగలేదు. ఒక ప్రత్యేకమైన యాప్ రూపొందించారు. గోవాలో యాజమాన్యం ఉందంటూ రిమోట్ చేశారు. 230 మందిని సభ్యులుగా చేర్చుకున్నవారి రూ.20 వేల జీతం ఇస్తామని నమ్మబలికారు. దీంతో సభ్యుల సంఖ్య వేలకు పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో లక్షలకు దాటింది. పెట్టుబడుల సేకరణ కోట్లకు దాటిపోయింది.

మే 30 వరకూ సాగిన వ్యవహారాలు ఉన్నపలంగా నిలిచిపోయాయి. నిర్వాహకులకు ఫోన్ చేస్తే తాము గోవాలో ఉన్నామని కొందరు, ముంబాయిలో ఉన్నామని మరికొందరు బదులిచ్చారు. దీంతో మోసం జరిగిందని భావించిన బాధితులు లబోదిబోమంటున్నారు. తెలంగాణతో పాటు ఏపీ వ్యాప్తంగా బాధితులు ఉన్నట్టు తెలుస్తోంది. సైబర్, గొలుసుకట్టు నేరాలు జరుగుతున్నా ప్రజల్లో మాత్రం మార్పులు రావడం లేదు. ఇంకా మోసానికి గురవుతునే ఉన్నారు.దీనిపై ఉభయ రాష్ట్రాల ప్రభుత్వాలు దృష్టిపెట్టాలని బాధితులు కోరుతున్నారు.