Eenadu Vs Sakshi: ఈనాడు, సాక్షి పత్రికల్లో కోవర్టులు.. అసలు వీరి పనేంటి? ఏం చేస్తారు?

ఈరోజు కౌంటర్ ఎన్కౌంటర్ లాగా ఈనాడు, సాక్షి లో వార్తలు ప్రచురితం కావడం ఒకింత ఆశ్చర్యాన్ని కలగజేస్తున్నాయి. రెండు పత్రికల్లోనూ వారి వారి కోవర్టు లు ఉన్నారనే అనుమానాలు కలుగుతున్నాయి.

Written By: Bhaskar, Updated On : August 16, 2023 8:28 am

Eenadu Vs Sakshi

Follow us on

Eenadu Vs Sakshi: మన సంస్థలోనే పనిచేస్తూ మన గుట్టుమట్లు మొత్తం అవతలి వారికి చేరవేరిస్తే ఎలా ఉంటుంది? ప్రస్తుతం తెలుగు నాట ప్రధాన పత్రికలుగా చలామణి అవుతున్న ఈనాడు, సాక్షిలో అదే జరుగుతోంది. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు ఏపీ ఎడిషన్లో ఈనాడు ప్రచురించిన వార్తకు సాక్షి కౌంటర్ వార్త రాయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. వాస్తవానికి జగన్ ప్రభుత్వం మీద గత కొంతకాలంగా రామోజీరావు యుద్ధం ప్రకటించాడు. తన ఈనాడు పత్రికలో రోజు పేజీలకు పేజీలు జగన్ పాలన విధానంలోని లోపాల మీద వార్తలు కుమ్మేస్తున్నాడు. ఇవాల్టి ఏపీ ఎడిషన్లో తృణధాన్యాల సాగుకు జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహం ఇవ్వడంలేదని ఒక వార్త ఈనాడులో ప్రచురితమైంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా వార్త ప్రచురితమైనప్పుడు సాక్షిలో మరుసటి రోజు ఫ్యాక్ట్ చెక్ పేరుతో కౌంటర్ ప్రచురితమవుతుంది. కొంతకాలంగా ఇది సాగుతూనే ఉంది. అయితే మంగళవారం నాటి ఎడిషన్లో ఈనాడు తృణధాన్యాలు సాగు చేస్తున్న రైతులకు ప్రోత్సాహం ఇవ్వడంలేదని జగన్ ప్రభుత్వం మీద ఒక వార్త అచ్చేసింది. దానికి సాక్షి కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది.

ఈరోజు కౌంటర్ ఎన్కౌంటర్ లాగా ఈనాడు, సాక్షి లో వార్తలు ప్రచురితం కావడం ఒకింత ఆశ్చర్యాన్ని కలగజేస్తున్నాయి. రెండు పత్రికల్లోనూ వారి వారి కోవర్టు లు ఉన్నారనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఈనాడులో వచ్చిన వార్తకు సాక్షి వెంటనే కౌంటర్ ఇవ్వడం పై వాదనకు బలం చేకూర్చుతోంది. గతంలోనూ అంటే సాక్షి పత్రిక పుట్టకముందు తెలుగు పత్రిక రంగంలో కోవర్ట్ లాంటి జర్నలిస్టులు ఉండేవారు. అయితే అప్పట్లో ఈనాడు టాప్ పత్రికగా ఉండేది కాబట్టి.. అందులో పనిచేసే జర్నలిస్టులు మిగతా ఉదయం, వార్త, ఆంధ్రప్రభ వంటి పత్రికలకు లీకులు ఇచ్చేవారు. అలా ఈనాడు ఆ పత్రికలు వార్తలను ప్రజెంట్ చేసేవి. కొన్నిసార్లు సేమ్ హెడ్ లైన్ తో వార్తలు ప్రచురితమయ్యేవి. ఇది ఆ పత్రికలకు లాభం చేకూర్చగా.. మొదటి స్థానంలో ఉన్న ఈనాడుకు ఇబ్బంది కలిగించేది. ఈ వ్యవస్థను గుర్తించి తర్వాత రామోజీరావు వారిని బయటికి సాగనంపాడు.

ఆ తర్వాత తన సంస్థలో కోవర్టులు లేకుండా రామోజీరావు చూసుకున్నాడు. కానీ ఇప్పుడు అప్పటి రోజులు కావు కాబట్టి, ఈనాడులోనూ క్రమశిక్షణ లోపించింది కాబట్టి.. కోవర్టుల కాలం మళ్లీ ప్రారంభమైంది. అందుకే ఈనాడులో వచ్చిన వార్తకు సాక్షి లో కౌంటర్ వచ్చిందంటే మామూలు విషయం కాదు. పత్రికా యజమానులకు ఎటువంటి ఇంట్రెస్ట్ లు ఉన్నప్పటికీ.. అందులో పని చేస్తున్న ఉద్యోగులకు మాత్రం న్యూట్రాలిటీ ఉండాలి. అదేం దురదృష్టమో కానీ.. ఉద్యోగులు కూడా యాజమాన్యాలను మించిపోతున్నారు. వారి కంటే ఎక్కువగా స్పందిస్తున్నారు. అందువల్లే ఇలా పత్రికలు జనాల్లో చులకన అవుతున్నాయి.