
కరోనా ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. కబళిస్తోంది. ఇప్పటికే చాలా మంది ప్రాణాలు పోయాయి. ఇప్పటికీ అందరికీ యమపాశంగా మారింది. స్కూళ్లు, థియేటర్లు ఇప్పటికీ తెరుచుకోలేదు. ఎస్పీ బాలు లాంటి దిగ్గజాలను కరోనా బలితీసుకుంది. ఈ క్రమంలోనే కరోనా వ్యాక్సిన్ వస్తే తప్ప ప్రపంచం మళ్లీ మామూలు స్థితికి వచ్చే పరిస్థితి లేదు. ఈ క్రమంలోనే ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కరోనా నివారణ చర్యలపై మంగళవారం సీఎం జగన్ సమీక్షించారు. కోవిడ్ ఆస్పతత్రుల జాబితా గ్రామ సచివాలయాల్లో ఉండాలని జగన్ సూచించారు. 104 నంబర్ కు ఫోన్ కొట్టిన వెంటనే టెస్టులు, హాస్పిటల్ వివరాలు అందాలని సీఎం జగన్ అన్నారు.
లోటుపాట్లు ఉంటే వెంటనే సరిచేయాలని.. ప్రతిరోజు మానిటర్ చేయాలని సంబంధిత అధికారులకు సీఎం సూచించారు.
జనవరి కల్లా కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం కనిపిస్తోందని ఏపీ సీఎం జగన్ తెలిపారు. ఆరోగ్య శ్రీ కింద కరోనాకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. కోవిడ్ తో సహజీవనం చేస్తూనే, వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏపీ సీఎం సూచించారు.
రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టడం మంచి పరిణామమని సీఎం జగన్ తెలిపారు. పాజిటివిటీ రేట్ 12.0 నుంచి 8.3కి తగ్గిందన్నారు. టెస్టులు పెరిగాయని.. కేసులు కూడా తగ్గుతున్నాయని చెప్పారు.