
తెలుగు దేశం పార్టీ కష్టకాలాన్ని ఎదుర్కొంటుంది. అధికారం కోల్పోయిన నాటి నుంచి పార్టీ ప్రభావం తగ్గిపోయింది. అనంతరం ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు పార్టీని వీడటం, అవినీతి, అక్రమాల కేసుల్లో టీడీపీ నాయకులు అరెస్టులు వంటి వరుస దెబ్బలతో ఇబ్బంది పడుతున్న ఆ పార్టీకి కరోనా వల్ల ఇబ్బంది తప్పడం లేదు. ప్రభుత్వం వివిధ అంశాలపై నిరసన తెలిపే అవకాశం కరోనా వల్ల లేకుండా పోయింది. చివరికి సొంత పార్టీ నాయకులను అరెస్టు చేస్తున్నా ఆందోళన చేసే అవకాశం లేకుండా పోవడం టీడీపీకి పెద్ద ఎదురుదెబ్బగా ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు.
మాజీ మంత్రి, టీడీపీ శాసన సభపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అరెస్ట్ వంటి సంఘటనలపై పెద్ద ఎత్తున నిరసన తెలిపే అవకాశం లేకుండా పోయింది. కరోనా లేకుంటే మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా నిరసనలకు చంద్రబాబు పిలుపు నిచ్చి భారీ స్థాయిలో నిరసనలు తెలిపే వ్యూహం పన్నేవారు. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ అమలు వల్ల ఆ అవకాశం లేకపోయింది. చంద్రబాబు నిరసనలకు పిలుపునిచ్చినా ఎవరి ఇళ్లలో వారు నిరసన తెలపడం వల్ల పెద్దగా ఫలితం ఉండటం లేదు. టీడీపీ నాయకులు అరెస్టులకు నిరసనగా స్వయంగా చంద్రబాబు ఉండవల్లి లోని తన నివాసంలో కాగడాల ప్రదర్శన తన నివాసంలో చేపట్టారు. అయినా పెద్దగా మైలేజ్ దక్కలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఒకవేళ లాక్ డౌన్ ను లెక్కచేయకుండా నిరసనలు భారీ సంఖ్యలో కార్యకర్తలతో నిర్వహిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎందుకు సంబంధించి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఒక ఉదాహరణ. అచ్చెన్నాయుణ్ని ఏసీబీ అధికారులు విజయవాడ తీసుకువెళుతున్న క్రమంలో అడ్డుకునేందుకు ఏలూరు సమీపంలోని టోల్ ప్లాజా వద్దకు అధిక సంఖ్యలో కార్యకర్తలతో వెళ్లారు. పోలీసులు అరెస్టు చేసి లాక్ డౌన్ ఉల్లంఘన కేసులు పెట్టడంతో మేజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించారు. దీంతో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లగించి నిరసనలు తెలిపేందుకు ఓవైపు కేసులు, మరోవైపు వైరస్ భయంతో నాయకులు ముందుకు రావడం లేదు.
మరోవైపు టీడీపీ నాయకులు అరెస్టుల అంశంపై ఇంత రాద్దాంతం చేస్తున్న చంద్రబాబు వైఖరిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కొద్దీ రోజుల కిందట విశాఖ నగరంలో స్టైరీన్ గ్యాస్ విషాదంలో 12 మంది మరణించినప్పుడు విశాఖ వెళ్లి బాధితులను పరామర్శించని బాబు, లోకేష్ లు ఇప్పుడు టీడీపీ నాయకులు అరెస్టుల విషయంలో మాత్రం అతిగా స్పందిస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. అచ్చెన్నాయుణ్ని పరామర్శించేందుకు అనుమతి ఇవ్వకపోయినా బాబు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని సూపరిండెంట్ సుధాకర్ తో అచ్చెన్న ఆరోగ్యంపై వాకబు చేశారు. విశాఖ విషయంలో మాత్రం ప్రభుత్వం అనుమతి ఎవ్వలేదంటున్నారు. అదేవిధంగా జేసీ కుటుంబాన్ని పరామసరించేందుకు ఈ రోజు లోకేష్ అనంతపురం వెళ్లారు.