https://oktelugu.com/

BRS Leaders: కబ్జా చేసిన బీఆర్ఎస్ నేతలపై ఉక్కుపాదం.. రంగంలోకి సిట్‌

BRS Leaders: సింగరేణి రిటైర్డ్‌ ఉద్యోగి కొత్త రాజిరెడ్డికి చెందిన భూమి విషయంలో బీఆర్‌ఎస్‌ నాయకులు చీటి రామారావుతోపాటు కొంతమంది నాయకులు జోక్యం చేసుకుని మూడేళ్లుగా ముప్పు తిప్పలు పెడుతున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : January 19, 2024 10:52 am
    congress government action against BRS leaders
    Follow us on

    BRS Leaders: పదేళ్లు అధికారాన్ని అడ్డుపెట్టుకుని కరీంనగర్‌లో అడ్డూ అదుపు లేకుండా అక్రమాలు, భూకబ్జాలకు పాల్పడిన బీఆర్‌ఎస్‌ నేతలపై పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. ఖద్దరు నేతల చిట్టా విప్పుతున్నారు. కటకటాల వెనుకకు పంపిస్తున్నారు. అక్రమార్కుల భరతం పట్టేందుకు కరీంనగర్‌ సీపీ అభిషేక్‌ మహంతి ప్రత్యేకంగా సిట్‌ ఏర్పాటు చేశారు. సిట్‌ చేపట్టిన ఆపరేషన్‌లో ఇద్దరు నేతల భూకబ్జాల వ్యవహారం బయటకు వచ్చింది. వారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో గులాబీ నేతల్లో అలజడి మొదలైంది.

    సింగరేణి రిటైర్డ్‌ ఉద్యోగి భూమి కబ్జా..
    సింగరేణి రిటైర్డ్‌ ఉద్యోగి కొత్త రాజిరెడ్డికి చెందిన భూమి విషయంలో బీఆర్‌ఎస్‌ నాయకులు చీటి రామారావుతోపాటు కొంతమంది నాయకులు జోక్యం చేసుకుని మూడేళ్లుగా ముప్పు తిప్పలు పెడుతున్నారు. మూడేళ్లుగా తన భూమి తనకు దక్కకుండా చేస్తున్న నేతలపై రాజిరెడ్డి ఎక్కని మెట్టు లేదు.. తొక్కని గడప లేదు. అయితే నాడు బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండడంతో పోలీసులు కూడా చర్యలకు వెనుకాడారు. దీంతో బాధితుడు మీడియా ముందు కూడా పలుమార్లు తన గోడు వెల్లబోసుకున్నాడు. అయితే ప్రధాని మీడియా ప్రతినిధులు నాడు మంత్రిగా ఉన్న గంగుల కమలాకర్‌, కేటీఆర్‌కు తొత్తుగా మారి అక్రమాలను వెలుగులోకి రానివ్వలేదు. దీంతో మీడియా ముందుకు వచ్చినా ఫలితం లేకుండా పోయింది.

    కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో..
    2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూలిపోయింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. కరీంనగర్‌కు చెందిన పొన్నం ప్రభాకర్‌ మంత్రి అయ్యారు. వెంటనే బాధితుడు ప్రజాభవన్‌కు వెళ్లి ప్రజాదర్బార్‌లో ఫిర్యాదు చేశాడు. బీఆర్‌ఎస్‌ నాయకులు చీటి రామారావు అరాచకాన్ని వివరించాడు. న్యాయం చేయాలని వేడుకున్నాడు. స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ పోలీసులను కలవాలని సూచించారు. దీంతో రాజిరెడ్డిలో ఆశలు చిగురించాయి. వెంటనే కరీంనగర్‌కు వచ్చిన ఆయన సీపీ అభిషేక్‌ మహంతిని కలిశాడు. తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకున్నాడు. దీంతో కేసు పూర్వాపరాలు పరిశీలించిన పోలీసు అధికారులు బీఆర్ఎస్ కార్పొరేటర్ తోట రాములు, చీటి రామారావు, నిమ్మశెట్టి శ్యాం లపై ఐపీసీ సెక్షన్ 447, 427 r/w 34లలో కేసు నమోదు చేశారు. కార్పొరేటర్ తోట రాములు, చీటి రామారావును బుధవారం అరెస్ట్ చేసిన రిమాండ్ కు తరలించారు.

    భూ దందాలపై పోలీస్‌ బాస్‌ ఆరా..
    కరీంనగర్‌లో భూ దందాలపై పోలీస్‌ బాస్‌ అభిషేక్‌ మహంతి ఆరా తీస్తున్నారు. ప్రత్యేక సిట్‌ ఏర్పాటు చేసి బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. వాటి పూర్వాపరాలు పరిశీలించి, నిజా నిజాలు నిర్ధారించుకుంటున్నారు. తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి సామాన్యులను ఇబ్బంది పెడుతున్న నేతల వివరాలు సేకరిస్తున్నారు. వారిపై ఇప్పటికే నిఘా పెట్టారు. అక్రమాలకు పాల్పడిన, వారికి కొమ్ము కాసిన అధికార యంత్రాంగాన్ని కూడా బాధ్యులను చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. భవిష్యత్‌లో తమది కాని భూములు ముట్టుకోవాలంటేనే భయపడేలా చర్యలు తీసుకోవాలని సీపీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. దీంతో గులాబీ కార్పొరేటర్లలో వణుకు మొదలైనట్లు తెలుస్తోంది.