Media organizations conclave: రాజకీయ నాయకులు ప్రచారాన్ని కోరుకుంటారు. నిత్యం వార్తల్లో ఉండాలని అనుకుంటారు. తమ గురించి మాత్రమే మీడియా గొప్పగా చెప్పాలని.. తమకు నచ్చని వారిపై నిత్యం రాళ్లు వేస్తూ ఉండాలని.. బురద కుమ్మరిస్తూ ఉండాలని అనుకుంటారు. సహజంగా రాజకీయ నాయకులు కూడా మనుషులే కాబట్టి.. వారికి కూడా ఆశలు ఉంటాయి కాబట్టి తప్పులేదు. కానీ వారి మాదిరిగానే ప్రత్యర్థి నాయకులు కూడా అలానే ఆలోచిస్తారు కాబట్టి.. మీడియాకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. ఒకరి గురించి చెప్తే మరొకరు బాధపడతారని నిశ్శబ్దంగా ఉంటుంది. అయితే నేటి కాలంలో రాజకీయ నాయకులు ఆరి తేరి పోయారు కాబట్టి సొంతంగా మీడియా వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నారు. మరికొందరైతే పరోక్షంగా మీడియా వ్యవస్థలను నడిపిస్తున్నారు.
గతంలో పత్రికలను మాత్రమే నాయకులు మేనేజ్ చేసేవారు. కొంతకాలానికి న్యూస్ చానల్స్ వచ్చాయి. ఇప్పుడు సోషల్ మీడియా గ్రూపులు అదనంగా జత కూడిపోయాయి. ఆయనప్పటికీ రాజకీయ నాయకులకు ప్రచార యావ తగ్గడం లేదు. పైగా తమ మాటలను మాత్రమే ప్రజలు వినాలి అని కోరిక వారిలో అంతకంతకు పెరిగిపోతోంది. రాజకీయ నాయకుల ప్రచార పిచ్చిని కొన్ని మీడియా సంస్థలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. అయితే చేసేది ఎలాగూ వైట్ కాలర్ దోపిడీ కాబట్టి మీడియా అధినేతలు దానికి సరికొత్త పేరు పెడుతున్నారు.
విదేశాలలో ఎన్నికలు జరిగినప్పుడు పోటీలో ఉండే ఇద్దరు నాయకులను ఒకే వేదిక మీద తీసుకొస్తారు. అక్కడ ఉన్న పాత్రికేయులు రకరకాల ప్రశ్నలు అడుగుతారు. దానికి ఆ ఇద్దరు నాయకులు సమాధానాలు చెప్తారు. ఇందులో ఎటువంటి మీడియా స్వార్థం ఉండదు. పెయిడ్ భజన అంతకంటే ఉండదు. కాకపోతే ప్రజలకు వాస్తవాలు తెలిసే అవకాశం ఉంటుంది. కానీ మన దేశంలో ఎన్నికలు లేకున్నా.. ఏదో జరిగిపోతోంది అనే భ్రమను కల్పించడంలో మీడియా ఆరి తేరిపోయింది. పైగా దానికి కాన్ క్లేవ్ అని పేరు పెట్టి.. అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులను పిలుస్తోంది. పేరుకు భవిష్యత్తు కాలంలో దేశం పరిస్థితి ఏమిటి? రాష్ట్రాల పరిస్థితి ఏమిటి? అని చెబుతుంది. కానీ అంతర్గతంగా మాత్రం పెయిడ్ భజన. ఒక ముక్కలో చెప్పాలంటే అధికార పార్టీ దగ్గర కొంత.. ప్రతిపక్ష పార్టీ దగ్గర కొంత డబ్బులు తీసుకొని.. మీరు మంచివారే.. వారు కూడా మంచివారే.. వెరసి మనమంతా మంచివారమే అనే సందేశాన్ని ఓట్లు వేసిన ప్రజలకు ఇస్తుంది.
ఇప్పటివరకు ఎన్నో మీడియా సంస్థలు కాన్ క్లేవ్ లు నిర్వహించాయి. ఇంతవరకు అధికార పార్టీ చేసిన తప్పులను గాని.. ప్రతిపక్ష పార్టీ చేసిన అన్యాయాలను గాని వెలుగులోకి తీసుకురాలేకపోయాయి. న్యూట్రల్ గా ఉండాల్సిన మీడియా హౌస్ లోకి ఒక రాజకీయ నాయకుడు ప్రవేశించాడు అంటేనే దాని వెనుక ఏం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. స్థూలంగా చెప్పాలంటే ఒకప్పుడు రాజకీయ నాయకుల నుంచి యాడ్స్ తీసుకునేవారు. ఆ తర్వాత పెయిడ్ ప్రమోషన్ మొదలుపెట్టారు. ఇప్పుడేమో కాన్ క్లేవ్ లు నిర్వహిస్తున్నారు. పేర్లు మాత్రమే తేడా.. చేసే వైట్ కాలర్ దోపిడీ మాత్రం ఒకటే.