
ఇన్నాళ్లు సంయమనం.. ఇక ఆ స్టేజీ దాటిపోయింది. ఏపీ సీఎం జగన్ దూకుడుకు కళ్లెం వేసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ రెడీ అయిపోయారు. నీళ్ల పంచాయితీలో తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తున్న జగన్ ను లెక్కలతో కొట్టాలని రెడీ అయిపోయారు. ఈ మేరకు పకడ్బందీ ప్రణాళికతో జగన్ ముందరికాళ్లకు బంధం వేసేందుకు భారీ స్కెచ్ గీసినట్టు అర్థమవుతోంది.
కృష్ణా, గోదావరి జలాలపై ఇప్పటికే రెండు రాష్ట్రాలు కేంద్రానికి, బోర్డులకు ఫిర్యాదులు చేసుకున్నారు. సుప్రీం కోర్టుకు ఎక్కాయి. ఇన్నాళ్లు సోదరభావంతో జగన్ తో సాన్ని హిత్యం నెరిపిన కేసీఆర్ ఇక ఉపేక్షించకూడదని డిసైడ్ అయినట్టు తెలిసింది.. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచి రాయలసీమకు నీళ్లను భారీగా తీసుకెళ్లడానికి.. తెలంగాణ నీటిని మళ్లించడానికి చూస్తున్న ఏపీ సీఎం జగన్ కు ఝలక్ ఇచ్చేందుకు కేసీఆర్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు ఇదే విషయమై కృష్ణ బోర్డు మీటింగ్ లో తమ వాదనను గట్టిగా వాదించాలని ఇరిగేషన్ అధికారులను సీఎం ఆదేశించారు.
ప్రగతి భవన్ లో ఇరిగేషన్ అధికారులతో సమావేశమైన కేసీఆర్ వారికి కీలక సూచనలు చేశారు. తెలంగాణ వాటాగా గోదావరిలో 954 టీఎంసీలు కేటాయించారని.. వాటిని కూడా తాము వాడుకోవడం లేదని మీటింగ్ లో చెప్పాలని కేసీఆర్ ఇంజినీర్లకు సూచించారు. కేటాయింపులకు మించి తాము ఒక్క చుక్క కూడా ఎక్కువ వాడుకోవడం లేదని వాదించాలని కీలక సూచనలు చేశారు.
ఏపీ ఆరోపణలను ఎండగట్టేలా కేసీఆర్ ప్లాన్ రూపొందించినట్టు తెలిసింది.. తెలంగాణ వాదన నెగ్గేలా సలహాలిచ్చారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుపై విషయమై ఉమ్మడి ఏపీలో సర్వే చేయలేదని.. సంగమేశ్వరం కూడా పూర్తిగా కొత్తదేనని ఇంజినీర్లు వాదించాలని కేసీఆర్ సూచించారు. అదే కృష్ణా నదిపై తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులన్నీ ఉమ్మడి ఏపీలోనే అనుమతి వచ్చాయని.. వైఎస్ హయాంలోనే శంకుస్థాపనలు చేసిన విషయాన్ని వాదించాలని.. జగన్ ను వాళ్ల నాన్న చేసిన శంకుస్థాపనలతోనే ఇరుకునపెట్టాలని అధికారులకు కీలక సూచన చేసినట్టు సమాచారం.
కృష్ణ బోర్డు సమావేశంలో వట్టిసీమ ద్వారా గోదావరి జలాలను మళ్లిస్తున్నారని.. కాబట్టి కృష్ణ నదిలో 45 టీఎంసీలును తెలంగాణ దక్కేలా బోర్డుపై ఒత్తిడి తేవాలని కేసీఆర్ అధికారులకు సూచించారు. ఇప్పటికే ఏపీ పరిమితికి మించి ఆంధ్రప్రదేశ్ నీటిని వాడుకుంటోందని.. మిగులు జలాలను తీసుకెళ్తామని దబాయిస్తున్నారని వాదించాలని కేసీఆర్ సూచించారు.
జగన్ చేపట్టిన కొత్త ప్రాజెక్టులను ముందుకు కదలకుండా చేయాలని కేసీఆర్ ఈ ప్లాన్ చేసినట్టు తెలిసింది. గోదావరి, కృష్ణ బోర్డు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ సుధీర్ఘంగా సమావేశం నిర్వహించి ఏపీ సీఎం జగన్ కు ఝలక్ ఇచ్చేందుకు భారీ ప్లాన్ రెడీ చేసినట్టుగా తెలుస్తోంది.
–నరేశ్ ఎన్నం