CM KCR : కేసీఆర్ హర్ట్ అయ్యారు. తన పార్టీ ఎంపీపై జరిగిన దాడిని తనపైనే జరిగిందన్నట్టుగా సీరియస్ అయ్యారు. మునుపెన్నడూ లేనంత ఆగ్రహంగా మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధినేత కే చంద్రశేఖర రావు సోమవారం ఎన్నికల ప్రచారంలో తమ పార్టీ నేత కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తితో దాడి చేయడంపై స్పందించారు. ఇది తనపై జరిగిన దాడిగా పేర్కొన్న కేసీఆర్.. ఇలాంటి చర్యను అందరూ నిర్ద్వంద్వంగా ఖండించాలని అన్నారు.
మా దుబ్బాక అభ్యర్థిపై జరిగిన దాడిని నాపై జరిగిన దాడిగా నేను చెబుతున్నాను అని కేసీఆర్ స్పష్టం చేశారు. గన్ మెన్ లేకపోతే ఇంకా పెద్ద ప్రమాదం జరిగేదని.. ఈ ప్రమాదంలో కొత్త ప్రభాకర్ రెడ్డి గన్ మెన్ కు గాయాలయ్యాయని కేసీఆర్ తెలిపారు.
దాడులు ఆపకపోతే, స్వీయ నియంత్రణ లేకపోతే, మాకు కూడా ధైర్యం ఉంటుంది, మేము కూడా అదే చర్యలకు పాల్పడితే, మీరు ఉండరు, మీ దుమ్ము కూడా ఉండదని కేసీఆర్ తీవ్ర స్వరంతో హెచ్చరించారు.
బీఆర్‌ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సోమవారం ఎన్నికల ప్రచారంలో ఉండగా సిద్దిపేట జిల్లాలో రాజు అనే వ్యక్తి కత్తితో పొడిచారు.
ప్రభాకర్ రెడ్డి కడుపుపై గాయాలు కావడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవంబర్ 30వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు దుబ్బాక నుంచి భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రభాకర్ రెడ్డి ప్రచారం చేస్తుండగా దౌల్తాబాద్ మండలంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత మాట్లాడుతూ, “దుండగుడిని అదుపులోకి తీసుకున్నాము, మేము అతని వివరాలు, దాడికి గల కారణాలను వివరిస్తాం” అని తెలిపారు.