https://oktelugu.com/

Harish Rao – Vishnu : హరీశ్ మంత్రాంగం ఫలించింది.. విష్ణును బీఆర్ఎస్ లోకి తెచ్చింది

విష్ణువర్ధన్‌రెడ్డి జూబ్లీహిల్‌ నియోజకవర్గంలో 2018 ఎన్నికల్లోనూ పోటీచేసి ఓడిపోయారు. మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఏడాది క్రితం నుంచే గ్రౌండ్‌ వర్క్‌ ప్రారంభించారు.

Written By:
  • NARESH
  • , Updated On : October 30, 2023 6:14 pm
    vishnuvardan reddy

    vishnuvardan reddy

    Follow us on

    Harish Rao – Vishnu : తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయం రంజుగా మారుతోంది. టికెట్లు దక్కని ఆశావహులు తమదారి తాము చూసుకుంటున్నారు. మూడు ప్రధాన పార్టీల్లో ఈ పరిస్థితి ఉంది. ఏ పార్టీ నుంచి ఏ నేత బయటకు వస్తాడో తెలియడం లేదు. మరోవైపు మూడు పార్టీల అగ్రనేతలు అసంతృప్తుల సమాచారం తెలుసుకుని తమ పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమైపోతున్నారు. జాడ పట్టుకుని మరీ వెళ్లి కలుస్తున్నారు. తమ పార్టీలో చేరాలని కోరుతున్నారు. ఒకవైపు ఉన్న పార్టీలో టికెట్ దక్కలేదన‍్న బాధ, మరోవైపు ఆయా పార్టీల నుంచి వచ్చిన అవకాశాలను వదులుకోకూడదనే ఆలోచనతో కోరి వచ్చిన పార్టీలో చేరేందుకు సిద్ధపడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ టికెట్ దక్కకపోవటంతో ఆ పార్టీకి రాజీనామా చేసిన సీఎల్పీ మాజీ నేత పీజేఆర్‌ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి కూడా పార్టీ మారేందుకు రెడీ అయ్యారు. విష్ణువర్ధన్‌రెడ్డికి అసంతృప్తిగా ఉన్నారనే సమాచారంతో మంత్రి హరీశ్‌రావు విష్ణువర్ధన్‌రెడ్డి ఇంటికి వెళ్లి మరీ భేటీ అయ్యారు. ఆయన్ని తమ పార్టీలో చేరాలని కోరారు. దీనికి విష్ణు కూడా సానుకూలంగా స్పందించారు.

    నిన్న కేసీఆర్‌తో భేటీ..
    ఇదిలా ఉండగా రెండు రోజుల క్రితమే విష్ణు కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. కాంగ్రెస్‌ రెండో జాబితాలో తన పేరు లేకపోవడంతో అసంతృప్తికి లోనైన విష్ణు బాహాటంగానే టీపీసీసీపై విమర్శలు చేశారు. మరుసటి రోజు తన అనుచరులతో సమావేశమై కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కేటీఆర్‌ పిలుపుతో ఆదివారం సాయంత్రం ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ క్రమంలో సోమవారం హరీశ్‌రావు విష్ణు ఇంటికి వచ్చి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరితో ‍ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. పీజేఆర్‌ గౌరవం కాపాడేలా చూసుకుంటామన్నారు.

    ఏడాదిగా గ్రౌండ్‌ వర్క్‌..
    కాగా, విష్ణువర్ధన్‌రెడ్డి జూబ్లీహిల్‌ నియోజకవర్గంలో 2018 ఎన్నికల్లోనూ పోటీచేసి ఓడిపోయారు. మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఏడాది క్రితం నుంచే గ్రౌండ్‌ వర్క్‌ ప్రారంభించారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. నెరవేరని హామీలపై ఆందోళనలు చేశారు. ప్రజల కష్టసుఖాల్లో అండగా ఉన్నారు. నియోజకవర్గంలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు సుమారు మూడు నెలలపాటు పాదయాత్ర కూడా చేశారు. ఇందుకు టీపీసీసీ కూడా అభ్యంతరం చెప్పలేదు. తీరా టికెట్ల కేటాయింపు సమయానికి హ్యాండ్‌ ఇచ్చింది. దీంతో విష్ణు తీవ్ర మనస్తాపం చెందారు. కాంగ్రెస్‌లో కొంతమంది పెత్తనం నడుస్తోందని, అర్హులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. టిక్కెట్లు అమ్ముకున్నట్లు భవిష్యత్‌లో గాంధీ భవన్‌ను అమ్మేస్తారని తీవ్ర ఆరోపణలు చేశారు