Agri Gold Money: ఆంధ్రప్రదేశ్ లో అగ్రిగోల్డ్ (Agri Gold) కుంభకోణం అప్పట్టో సంచలనం సృష్టించింది. జగన్ (Jagan) పాదయాత్ర సమయంలో వారికి న్యాయం చేస్తామని ఇచ్చిన హామీ మేరకు వారి ఖాతాల్లో నగదు జమ చేశారు. రెండో విడతలో బాగంగా రూ.10 వేల నుంచి 20 వేల వరకు డిపాజిట్ చేసిన బాధితులకు జగన్ ఆన్ లైన్ ద్వారా నగదు జమ చేశారు. ఇప్పటి వరకు రూ.905 కోట్లు చెల్లించినట్లు సీఎం జగన్ తెలిపారు. రూ.10 వేల లోపు డిపాజిట్ చేసిన వారికి రూ.207.16 కోట్లు, రూ.20 వేల లోపు డిపాజిట్ చేసిన వారి ఖాతాల్లో రూ.459.23 కోట్లు కలిపి మొత్తం 7 లక్షల మందికి పైగా అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం డబ్బులు చెల్లించింది.
ఈ మేరకు రూ.666.84 కోట్లు విడుదల చేసింది. తొలివిడతలో భాగంగా 10 వేల లోపు డిపాజిట్ చేసిన వారికి ఇప్పటికే రూ.240 కోట్లు చెల్లించింది. అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో సీఎం జగన్ మాట్లాడుతూ భవిష్యత్తులో కోర్టు కేసులు క్లియర్ అయిన తరువాత అగ్రిగోల్డ్ ఆస్తులను విక్రయించి వచ్చిన సొమ్ము డిపాజిట్ దారులకు చెల్లిస్తామన్నారు. అగ్రిగోల్డ్ కుంభకోణం ద్వారా లక్షల మందిని ముంచిన పాపం గత ప్రభుత్వానిదే అన్నారు.
అగ్రిగోల్డ్ ఆస్తులను కాజేందుకు ఎవరు ప్రయత్నించారో అందరికి తెలుసన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి దాన్ని నెరవేర్చామన్నారు. ప్రైవేటు సంస్థ మోసం చేస్తే ప్రభుత్వం డబ్బులిచ్చే సంప్రదాయం ఇక్కడే ఉందని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు నగదు అందజేశామన్నారు. గతంలో సీఐడీ ద్వారా వివరాలు సేకరించినా వలంటీర్లు, సచివాలయాల ద్వారా న్యాయం చేస్తున్నామన్నారు.
ఇచ్చిన మాటకు కట్టుబడి ఎంత కష్టమైనా ప్రజల కోరిక నెరవేర్చామన్నారు. ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతున్న పరిస్థితుల్లో కూడా ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. దీనిపై ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. అగ్రిగోల్డ్ బాధితులకు ఎట్టకేలకు న్యాయం చేయగలిగామన్నారు. ఒక్క రూపాయి కూడా తేడా రాకుండా మొత్తం నగదు ముట్టజెప్పేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. దీంతో ప్రజల్లో కూడా హర్షం వ్యక్తమవుతోందన్నారు. దీనిపై ఇంకా ఎవరైనా మిగిలి ఉండే వారికి కూడా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.