
ప్రధాని మోడీనే గండర గండరుడు అని రాజకీయాల్లో చెబుతుంటారు. తమకు అడ్డు వచ్చే వారిని ఎలా చాకచక్యంగా అడ్డు తొలగించుకోవాలో వారికి తెలుసు అంటారు. కానీ అంతకుమించి అంటున్నాడు మహారాష్ట్ర సీఎం, శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే. ఏకంగా బీజేపీ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా ఉన్న అత్యున్నత స్థాయి వ్యక్తిని అరెస్ట్ చేసి మహారాష్ట్ర సీఎం సంచలనం సృష్టించాడు. కేంద్రమంత్రి అరెస్ట్ పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. మోడీ సర్కార్ ను ఢీకొంటున్న మహారాష్ట్ర సీఎం ఠాక్రే తీరు ఆసక్తి రేపుతోంది.
కేంద్రమంత్రి నారాయణ రాణే జన ఆశీర్వాద యాత్రలో భాగంగా సోమవారం రాయ్ గఢ్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ మహారాష్ట్ర సీఎం ఠాక్రేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15న ఠాక్రే చేసిన ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ ‘సీఎంకు స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చిందో కూడా తెలియకపోవడం సిగ్గుచేటు. స్వాతంత్ర్య దినోత్సవం నాడు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఠాక్రే మధ్యలో వెనక్కి తిరిగి స్వాతంత్ర్యం వచ్చి ఎన్నేళ్లయ్యిందని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆరోజు నేను అక్కడ ఉంటేనా? ఆయన చెంప పగులగొట్టేవాడిని’ అని నారాయణ రాణే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి నారాయణ రాణేను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేయడం పెను సంచలనమైంది. సీఎంకు స్వాతంత్ర్యం వచ్చి ఎన్నేళ్లు అయ్యిందో కూడా తెలియదని.. అలాంటి వ్యక్తి చెంప పగులకొట్టాలని కేంద్ర మంత్రి నారాయణ రాణే చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలకు గాను కేంద్రమంత్రి ఎఫ్ఐఆర్ దాఖలైంది. దీంతో రత్నగిరి పర్యటనలో ఉన్న కేంద్రమంత్రిని తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం సంచలనమైంది.
కాగా తనను అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ కేంద్రమంత్రి రాణే ముంబై హైకోర్టును ఆశ్రయించారు. రాణేపై నమోదైన కేసులు కొట్టివేయాలని కోరుతూ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ ను అత్యవసరంగా విచారించాలని కోరారు. అయితే కోర్టు దీన్ని అంగీకరించలేదు. దీంతో కేంద్రమంత్రికి గట్టి షాక్ తగిలినట్టైంది.
ఏకంగా కేంద్రంలో మంత్రిగా ఉన్న స్థాయి వ్యక్తి మహారాష్ట్ర సీఎం అరెస్ట్ చేయించడం సంచలనమైంది. కేంద్రంలోని పెద్దలతో గెలుక్కుంటున్న ఉద్దవ్ ఠాక్రే సాహసానికి శివసేన శ్రేణులు మాత్రం తొడగొడుతున్నాయి.