Homeజాతీయ వార్తలురూ.2 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజి కోరిన పరిశ్రమలు

రూ.2 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజి కోరిన పరిశ్రమలు

కరోనా వైరస్‌ సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థను, పారిశ్రామికరంగాన్ని ఆదుకొనేందుకు పన్నులను, వడ్డీరేట్లను తగ్గించడంతోపాటు రూ.2 లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపనలను ప్రకటించాలని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కరోనా వైరస్‌ వల్ల తలెత్తిన మందగమనం, సరఫరాల వ్యవస్థలో తలెత్తిన సమస్యలతో వ్యాపారాలకు భారీ విఘాతం కలిగిందని, రియల్‌ ఎస్టేట్‌, పౌరవిమానయానం, పర్యాటకం, ఆతిథ్యం లాంటి రంగాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ పేర్కొన్నారు.

ఈ విపత్కర పరిస్థితి నుంచి ప్రజలను గట్టెక్కించేందుకు జీడీపీలో 1 శాతం (రూ.2 లక్షల కోట్ల) మొత్తాన్ని ఆధార్‌ ఆధారిత ప్రత్యక్ష లబ్ధి బదిలీ పథకం ద్వారా ఆర్థిక ఉద్దీపనల రూపంలో అందజేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలించాలని ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో సీఐఐ విజ్ఞప్తి చేసింది. దేశంలోని ప్రతి పౌరునికి రూ.5 వేలు, ప్రత్యేకించి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేదలకు రూ.10 వేల చొప్పున ఈ ఉద్దీపనలను అందజేయాలని సూచించింది.

‘ప్రజల్లో ఆర్థిక భయాలను తొలిగించాలన్న లక్ష్యంతో మేము ఈ విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రత్యక్ష లబ్ధి బదిలీ పథకం ద్వారా ప్రజలకు డబ్బు అందజేయగలిగితే నిజంగా వారికి ఎంతో మేలుచేసినట్టే. ముఖ్యంగా దీనివల్ల సమాజంలోని అట్టడుగు వర్గాలవారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది’ అని బెనర్జీ తెలిపారు. దీర్ఘకాలిక మూలధన లాభాలపై వసూలు చేస్తున్న 10 శాతం పన్నును తొలిగించడంతోపాటు మొత్తం డివిడెండ్‌ పన్నును 25 శాతంగా ఖరారుచేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలించాలని ప్రధానికి రాసిన లేఖలో సీఐఐ కోరింది.

ఇలా ఉండగా, కరోనా కాటుతో కుదేలైన వివిధ రంగాలను ఆదుకొనేందుకు సాధ్యమైనంత త్వరలో ఆర్థిక ప్యాకేజీని ప్రకటించనున్నట్టు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. కరోనా వైరస్‌ వ్యాప్తితో దేశంలో నెలకొన్న పరిస్థితిని సమీక్షించేందుకు ఆమె నాలుగు శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. నాలుగు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో పౌరవిమానయాన, పశుసంవర్ధక, పర్యాటక, ఎంఎస్‌ఎంఈ (సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల) శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ భేటీలో వివిధ అంశాలపై చర్చించామని, ఆయా శాఖల నుంచి తమకు వచ్చిన సూచనలను క్రోడీకరిస్తున్నామని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. కరోనా సంక్షోభాన్ని అధిగమించేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు ఆర్థికశాఖ శనివారం అంతర్గత సమావేశాన్ని నిర్వహించనున్నదని ఆమె చెప్పారు.

ఆర్థిక ప్యాకేజీని ఎప్పుడు ప్రకటిస్తారని విలేకర్లు ప్రశ్నించగా.. దీనికి గడువును నిర్దేశించడం కష్టమని, సాధ్యమైనంత త్వరలో ప్యాకేజీని ప్రకటిస్తామని తెలిపారు. ఈ టాస్క్‌ఫోర్స్‌ను ఇంకా ఏర్పాటుచేయలేదని, దీన్ని అత్యవసరంగా ఏర్పాటుచేయాల్సిన ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకొనే తాము సమావేశాన్ని నిర్వహించామని చెప్పారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular