భారత్ కు పొరుగున ఉన్న చైనా రోజుకో కొత్త కుట్రకు తెరలేపుతోంది. తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు తన సరిహద్దు గల దేశాలతో కొత్త ప్రణాళిక రచిస్తోంది. తాజాగా డ్రాగన్ దేశం భూటాన్ దేశంతో కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకొని భారత్ కు తలనొప్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. పొరుగు దేశాల్లో ప్రాబల్యం పెంచుకోవడానికి చైనా ఆడుతున్న గేమ్ ఒక్కొక్కటి బయటపడుతోంది. తాజాగా చైనా, భూటాన్ దేశాల మధ్య అపరిష్కృత వివాదాల పరిష్కారానికి చైనా కొన్ని పద్ధతులను ప్రతిపాదించగా దీనికి భూటాన్ అంగీకారం తెలిపింది. దీంతో ఈ రెండు దేశాల మధ్య ఉన్న 37 ఏళ్ల వివాదం పరిష్కారమైనట్లయింది. అయితే భారత్ కు మాత్రం ఈ ఒప్పందం ఆందోళనకరమేనంటున్నారు.

చైనా బెల్ట్ అండ్ రోడ్ (బీఆర్ఐ) అనే పథకంను భూటాన్ దేశంతో ఒప్పందానికి ప్రతిపాదన పంపింది. దీనికి భూటాన్ దేశం అంగీకారం తెలిపింది. ఒకవేళ భూటాన్ ఈ పథకంలో చేరితో చైనా ఇక భారత్ పై దాడికి దిగడానికి మరింత అవకాశం దొరికినట్లవుతుంది. భూటాన్ తో ఒప్పందం ఫైనల్ అయితే మనదేశ సరిహద్ధులోని శిలిగుడి కారిడార్ పై పాగా వేయడానికి చైనాకు పెద్ద కష్టమేమీ కాదు. చికెన్స్ నెక్ గా వ్యవహరించే ఈ కారిడార్ భారత్ ఈశాన్య ప్రాంతంలో అత్యంత కీలక భూభాగం. అంటే భారత్ కు తెలియకుండా చైనా రహస్య మంతనాలు సాగించేందుకు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండా చైనా తూర్పు ప్రాంతంలో తన అధిపత్యాన్ని చాటుకునేందుకు ఇప్పటికే పాకిస్తాన్, అప్ఘనిస్తాన్ దేశాలతో స్నేహం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా పాకిస్తాన్ కు అన్ని విధాలుగా సహకారం చేస్తోంది. ఇటీవల పాకిస్తాన్ కు క్షిపణులను సరఫరా చేసింది. ఆకాశంలో యుద్ధ విమానాలు కనిపిస్తే వాటిని అక్కడే కూల్చివేసేందుకు ఇవి తోడ్పడుతాయి. రష్యన్ ఎస్-300 క్షిపణులను పోలిన ఇవి మెచ్ క్యూ 9 పి హైమ్యాడ్ష్ క్షిపణులను చైనా పాకిస్తాన్ కు సరఫరా చేసింది.
ఈ సందర్భంగా పాకిస్తాన్ సైన్యాధిపతి జనరల్ కమర్ జావేద్ బాజ్వా మాట్లాడుతూ పాక్, చైనాల మధ్య రక్షణ బంధం దక్షిణాసియాలోనే సుస్థిరతను సాధిస్తుందన్నారు. గగనతలంలో వచ్చే శత్రు విమానాలను హెచ్ క్యు 9 క్షిపణులు ముందే పసిగట్టి వాటిని కూల్చేస్తాయన్నారు. వంద కిలోమీటర్ల దూరంలో ఉండగాన శత్రు విమానాలను ఈ క్షిపణులు కూల్చేస్తాయన్నారు.