YCP Fifth List: వైసిపి ఐదో జాబితా విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా జగన్ పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటివరకు నాలుగు జాబితాలను విడుదల చేశారు. దాదాపు 60 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చారు. తాజాగా ఐదో జాబితాను విడుదల చేశారు. నాలుగు లోక్ సభ స్థానాలు, మూడు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. ఈ ఐదో జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కలిసి వెల్లడించారు. ఈ తాజా మార్పులతో 67 స్థానాలు మార్చినట్టు అయ్యింది.
కాకినాడ, మచిలీపట్నం, నరసరావుపేట, తిరుపతి పార్లమెంట్ స్థానాల పరిధిలో అభ్యర్థులను మార్పు చేస్తూ ఈ కొత్త జాబితాను విడుదల చేశారు. కాకినాడ ఎంపీ స్థానానికి చలమ శెట్టి సునీల్ ను ఖరారు చేశారు. నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్, తిరుపతి ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తికి అవకాశం కల్పించారు.ఈ నాలుగు ఎంపీ స్థానాలే కాకుండా.. మరో మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చుతూ వైసిపి కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో సత్య వేడు, అరకు, అవనిగడ్డ స్థానాలు ఉన్నాయి. అరకు అసెంబ్లీ స్థానానికి రేగం మత్స్యలింగం, సత్యవేడుకు నూక తోటి రాజేష్, అవనిగడ్డకు డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర రావుకు అవకాశం ఇచ్చినట్లు వైసిపి వర్గాలు వెల్లడించాయి. ఆయా నియోజకవర్గాల్లో నిర్వహించిన సర్వేల ఆధారంగానే అభ్యర్థుల మార్పులు, చేర్పులు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఐదో జాబితాలో కీలక నియోజకవర్గాల్లో మార్పులు ఉంటాయని అంతా భావించారు. కానీ ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరంలో ఇంతవరకు ఎటువంటి మార్పులు తీసుకోలేదు. దీంతో ఆయా జిల్లాల పరిధిలో వైసీపీ ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. మరోవైపు సిట్టింగ్లలో సైతం గుబులు రేగుతోంది. ఈ రెండు జిల్లాల పరిధిలో 19 నియోజకవర్గాలు ఉన్నాయి. కనీసం సగం వరకు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చుతారని ప్రచారంలో ఉంది. కానీ ఇంతవరకు ఆ రెండు జిల్లాలను సీఎం జగన్ టచ్ చేయకపోవడం విశేషం. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జిగా పేరాడ తిలక్, టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా దువ్వాడ శ్రీనివాసును ఖరారు చేశారు. అయితే సిట్టింగ్లలో చాలామందికి మార్పులు చేస్తారని ప్రచారంలో ఉంది. కానీ ఐదో జాబితాలో వెల్లడించలేదు. ఇక ఉన్నది తుది జాబితాయేనని.. అందులో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు సంబంధించి అభ్యర్థులను మార్చే అవకాశం ఉందని వైసిపి వర్గాలు చెబుతున్నాయి.