Homeజాతీయ వార్తలుMinister Malla Reddy: మంత్రి మల్లారెడ్డి మనోడు బై.. భూమి కాజేసినా చర్యలుండవు అంతే!

Minister Malla Reddy: మంత్రి మల్లారెడ్డి మనోడు బై.. భూమి కాజేసినా చర్యలుండవు అంతే!

Minister Malla Reddy: ఎన్నికలకు ముందు క్రమశిక్షణతో ఉండాల్సిన అధికార పార్టీ నాయకులు కట్టుతప్పుతున్నారు. పలు రకాల వివాదాల్లో తల దూర్చుతూ నిత్యం వార్తల్లో వ్యక్తులు అవుతున్నారు. ఫలితంగా ఇది అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. ఈ వ్యవహారాన్ని చక్కదిద్దడానికి పార్టీ పెద్దలే రంగంలోకి దిగాల్సి వస్తున్నది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన ఒక మంత్రి ఒక వివాదంలో తలదూర్చడం తలనొప్పిగా మారింది. ఇది అంతిమంగా రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగడానికి కారణమైంది. ఇంతకీ దీనికి సంబంధించిన వివరాల్లోకి ఒకసారి వెళ్తే..

తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అని పరిచయం చేసే కంటే పాలమ్మి, పూలమ్మీ పైకి వచ్చిన మల్లారెడ్డి అని చెప్పడం సబబు. ఏ ముహూర్తానైతే ఆ వ్యాఖ్యలు చేశారో గాని సోషల్ మీడియాలో మొత్తం ఆయన పేరు మార్మోగిపోతుంది. అలాగని ఆ వ్యాఖ్యలు చేసిన ఆయన సుద్ధపూస అని చెప్పుకోవడం సబబు కాదు. ఆయన మీద కూడా బొచ్చెడన్నీ ఆరోపణలు ఉన్నాయి. కాకపోతే ముఖ్యమంత్రి రక్షణ కవచం ఆయనకు ఉంది కాబట్టి నడిచిపోతుంది. గతంలో కూడా ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ కు సంబంధించి ఓ రియల్టర్ ను డబ్బులు ఇవ్వమని ఆయన బెదిరించిన కాల్ సంభాషణ సోషల్ మీడియాలో మార్మోగిపోయింది. కానీ దీనిపై భారత రాష్ట్ర సమితి అధిష్టానం ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. ఆ మధ్య ఆయన విద్యాసంస్థల మీద ఐటి దాడులు జరిగినప్పటికీ భారత రాష్ట్ర సమితి అధిష్టానం నోరు మెదపలేదు. మరి దీనిని “టేక్ ఇట్ ఫర్ గ్రాంట్” అని అనుకున్నారేమో తెలియదు గాని మల్లారెడ్డి మరింత రెచ్చిపోతున్నారు. తాజాగా మరో భూ వివాదంలో ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.. దీనికి తోడు ఆ వివాదంలో బాధితులు నేరుగా విలేకరుల సమావేశం నిర్వహించి మరీ వివరాలు వెల్లడించడం కలకలం రేపుతోంది.

“దాదాపు 30 కోట్ల రూపాయల విలువచేసే భూమిని కాజేసేందుకు మల్లారెడ్డి కుట్ర చేస్తున్నారు. ఆయన బామ్మర్ది శ్రీనివాస్ రెడ్డి కూడా మాపై దౌర్జన్యానికి దిగుతున్నారు. వారి వల్ల మా ప్రాణానికి హాని ఉందని” మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లి లో మంత్రి మల్లారెడ్డి కాలేజీ ఎదురుగా ఉన్న స్థల యజమానులు మర్రి వెంకట్ రెడ్డి, దయాసాగర్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు ఆరోపించడం కలకలం రేపుతోంది. ఏకంగా వీరిద్దరూ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించడం విశేషం. గుండ్ల పోచంపల్లిలో సుంకరి అనే కుటుంబానికి గుండ్ల పోచంపల్లి లో 8 ఎకరాల భూమి ఉంది. వెంకటరెడ్డి , దయాకర్ రెడ్డి సుంకరి అనే కుటుంబం నుంచి 4.5 ఎకరాలు కొనుగోలు చేశారు. మిగతా భూమిలో రెండు ఎకరాలు మంత్రి మల్లారెడ్డి తన భార్య పేరు మీద కొనుగోలు చేశారు. అయితే మల్లారెడ్డి మా భూమిని కూడా కాజేయడానికి కుట్ర చేస్తున్నారని దయాకర్ రెడ్డి, వెంకట్ రెడ్డి ఆరోపిస్తున్నారు.. భూమి వద్దకు వెళ్లిన తమపై దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు. మంత్రి మల్లారెడ్డి బామ్మర్ది శ్రీనివాసరెడ్డి ఏకంగా తుపాకీతో కాల్చిపడేస్తానంటూ బెదిరిస్తున్నారని దయాకర్ రెడ్డి, వెంకట్ రెడ్డి చెబుతున్నారు.

కాగా ఈ వ్యవహారంపై దయాకర్ రెడ్డి వెంకట్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడం విశేషం. “భూ రికార్డుల నుంచి మా పేరు తొలగించి అక్రమంగా మంత్రి పేరు పై మార్చుకున్నారు. మా భూమి మాకు ఇప్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మంత్రి మల్లారెడ్డి చాలామంది రైతులను మోసం చేస్తున్నారు. ఆయన నుంచి మాకు ప్రాణహాని ఉంది. రక్షణ కల్పించి మాకు న్యాయం చేయాలని సీఎం కేసీఆర్ ను కోరుతున్నాం” అని దయాకర్ రెడ్డి, వెంకట్ రెడ్డి విలేకరుల ఎదుట వాపోయారు. కాగా దీనిపై ఇంతవరకు మంత్రి మల్లారెడ్డి గాని శ్రీనివాసరెడ్డి గాని స్పందించలేదు. గతంలో ఈటల రాజేందర్ మీద ఇదే స్థాయిలో ఆరోపణలు వచ్చినప్పుడు ప్రభుత్వం ఆగమేఘాల మీద చర్యలు తీసుకుందని, ఇప్పుడు మా విషయంలో ఎందుకు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదని వెంకట్ రెడ్డి, దయాకర్ రెడ్డి అంటున్నారు. ఈ విషయం మీడియాలో విస్తృతంగా ప్రసారం కావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దీనిపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఇవాలో, రేపో మంత్రి మల్లారెడ్డిని తన వద్దకు పిలిపించుకునే అవకాశం ఉందని సమాచారం.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular