సాధారణంగా ఇంట గెలిచి రచ్చగెలవాలన్న సామెతను ఎక్కువగా వాడుతుంటాము. కానీ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యంత్రి చంద్రబాబు నాయుడు విషయంలో ఇందుకు పూర్తిగా భిన్నంగా జరుగుతోంది. ఆయన అప్పుడెప్పుడో 1978లో తప్పా సొంత నియోజకవర్గం చంద్రగిరిలో తప్పా వేరే ప్రాంతంలో ఎన్నడూ గెలవలేదు. ఇక టీడీపీ కూడా 1994లో మాత్రమే ఇక్కడ విజయం సాధించింది. 27 ఏళ్లుగా చంద్రబాబు నియోజకవర్గంలో టీడీపీకి దిక్కూమొక్కు లేదు. అసలు పార్టీకి ఇక్కడ బలమైన నాయకుడే లేడు. ఏ నాయకుడు అయినా.. రాజ్యాన్ని లేదా రాష్ట్రాన్ని ఏలాలని తపన పడేందుకు ముందు తన సొంత ప్రాంతంలో లేదా సొంత నియోజకవర్గంలో, జిల్లాలో తిరుగులేదని హీరో అవ్వాల్సి ఉంటుంది.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గం పులివెందుల విషయాన్ని వస్తే.. రెండున్నర దశాబ్దాలుగా అక్కడ టీడీపీకి ఏ మాత్రం స్కోప్ లేకుండా చేశారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనూ జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే సీటు మించి గెలిచిన పరిస్థితి లేదు. జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలోనూ ఎప్పుడూ.. 50..90 మధ్యలో వైఎస్ ఫ్యామిలీ మెజారిటీలు ఉంటున్నాయి. చంద్రబాబు సొంత నియోజకవర్గమే కాదు.. ఆయన సొంత జిల్లాలోనూ టీడీపీ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటోంది. అసలే చిత్తూరులో పార్టీ పరిస్థితి అంతంత మాత్రమే..
గత ఎన్నికల తరువాత చిత్తూరు జిల్లాలో పార్టీ ఓ పంచాయతీలో గెలిస్తే గొప్ప అన్నంత దీనస్థితికి పడిపోయింది టీడీపీ. జిల్లాలో కీలక నేతలు అందరూ ఇతర పార్టీలలోకి వెళ్లిపోతుండడంతో అందరూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు మాత్రమే కుప్పంలో గెలిచారు. ఇక పంచాయతీ ఎన్నికలలోనూ.. తాజా మున్సిపల్ ఎన్నికలలోనూ.. పార్టీ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో చెప్పలేని పరిస్థితి. జిల్లాలో రెండు కార్పొరేషన్లు ఉంటే.. చిత్తూరులో 50కి 37చోట్ల వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. తిరుపతిలో 50 డివిజన్లకు 27 ఇప్పటికే వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. ఈ రెండు కార్పొరేషన్లు వైసీపీ సొంతం అయ్యాయి.
పుంగనూరు మున్సిపాలిటీని మంత్రి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా వైసీపీ స్వీప్ చేసుకుంది. ఇక పంచాయతీ ఎన్నికల్లో 80శాతం వైసీపీ ఖాతాలోకి వెళ్లిపోగా.. చంద్రబాబు నాయుడు సొంత ఊరిలో గెలిచేందుకు అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తరువాత చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడుతో పాటు టీడీపీ పరిస్థితి ఇంకెంత దిగజారి పోతుందో అన్న ఆవేదనలో పార్టీ నేతలు ఉన్నారు.