Sanju Samson: అవకాశాలు వచ్చినా తుది జట్టులో చోటు దక్కేది కాదు. ఒకవేళ చోటు దక్కినా అతడిని దురదృష్టం వెంటాడేది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు.. అనేక సందర్భాల్లో ఇలానే జరిగింది. దీంతో అతని పరిస్థితి టీమిండియాలో విజిటింగ్ ప్లేయర్ లాగా మారిపోయింది. జట్టులో చోటుదక్కడం.. ఆ తర్వాత సరిగ్గా ఆడ లేకపోవడం.. కీలకమైన టోర్నీలలో ఆడే అవకాశం రాకపోవడం.. ఇలా అతడి క్రికెట్ జీవితంలో ప్రతి సందర్భం ఒక దుఃఖమయంగానే ఉండేది.
Also Read: జస్ ప్రీత్ బుమ్రా టీమిండియా వజ్రాయుధం.. బంతి పడితే వికెటే!
ఇలాంటి క్రమంలో ఉదయించిన సూర్యుడి మాదిరిగా.. జూలు విధిలించిన సింహం మాదిరిగా అతడు రెచ్చిపోయాడు. అంతంత మాత్రం ఆట తీరును కొనసాగిస్తున్న జట్టుకు ఆపద్బాంధవుడిగా నిలిచాడు. జింబాబ్వే మీద తన టీజర్ విడుదల చేశాడు. ఇక ఆ తర్వాత వరుసగా మూడు హాఫ్ సెంచరీలు చేశాడు.
ఎప్పుడు వచ్చాం కాదన్నయ్య.. రన్స్ చేశామా లేదా అన్నట్టుగా బ్యాటింగ్ చేశాడు. జింబాబ్వే మీద మెరుపు ఇన్నింగ్స్.. వెస్టిండీస్ మీద హాఫ్ సెంచరీ.. ఇంగ్లాండ్ మీద హాఫ్ సెంచరీ.. ఫైనల్ న్యూజిలాండ్ మీద హాఫ్ సెంచరీ చేసి అదరగొట్టాడు. వాస్తవానికి సెంచరీ ముందు సంజు అవుట్ కావడం అభిమానులకు కొంతమేర ఇబ్బంది కలిగించినప్పటికీ.. తను ఆడేది రికార్డుల కోసం కాదని.. జట్టు కోసమే తను ఆడతానని సంజు చెప్పాడు. దానిని నిరూపించాడు.
వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్ చూసుకుంటే అభిషేక్ శర్మ విఫలమయ్యాడు. ఇషాన్ కిషన్ చేతులెత్తేశాడు. ఈ సమయంలో సంజు ఆడిన ఇన్నింగ్స్ న భూతో న భవిష్యతి. ఇక సెమి ఫైనల్ మ్యాచ్లో అయితే 89 పరుగులు చేశాడు. టీమిండియా భారీ స్కోర్ చేయడంలో కీలకపాత్ర పోషించాడు. ఫైనల్ మ్యాచ్లో అయితే దుమ్మురేపాడు. ఈ టోర్నీలో ఐదు ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ చేశాడు సంజు. అందులో 24 సిక్సర్లు ఉన్నాయంటే అతని బ్యాటింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
వాస్తవానికి ఈ టోర్నీలో ఏ ఒక్క ఆటగాడు కూడా స్థిరమైన ప్రదర్శన చేయలేదు. సూర్య, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ ఏదో ఒక సందర్భంలో మాత్రమే తమ స్థాయి ఇన్నింగ్స్ ఆడారు. కానీ జట్టు భారాన్ని మాత్రం సంజు ఒక్కడే మోసాడు. టి20 వరల్డ్ కప్ కంటే ముందు అతడు న్యూజిలాండ్ సిరీస్ లో దారుణంగా విఫలమయ్యాడు. 10, 6, 0, 24, 6 పరుగులు మాత్రమే చేశాడు. అతడి ఫామ్ సరిగా లేకపోవడంతో ఇషాన్ కిషన్ కు ఎక్కువగా అవకాశాలు ఇచ్చారు.. అభిషేక్ శర్మ అనారోగ్యానికి గురైన నేపథ్యంలో నమిబియా జట్టుతో జరిగే మ్యాచ్లో సంజు కు అవకాశం వచ్చింది. అతడు కేవలం 22 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత జట్టులో మళ్ళి అతడికి అవకాశం రాలేదు. రింకు సింగ్ విఫలమైన నేపథ్యంలో ఓపెనింగ్ భాగస్వామ్యంలో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కావాలని మేనేజ్మెంట్ భావించిన నేపథ్యంలో సంజు కు పిలుపు వచ్చింది. జింబాబ్వే జట్టుతో జరిగిన మ్యాచ్లో సంజు అదరగొట్టినప్పటికీ.. అతడి స్థాయి ఇన్నింగ్స్ ఆడ లేకపోయాడు. కానీ ఆ తర్వాత అతడు ఒక్కసారిగా ఫామ్ లోకి వచ్చేసాడు. టీమిండియా రాత మొత్తం మార్చేశాడు. అంతేకాదు తన కెరియర్ రాతని కూడా చాలా గొప్పగా మార్చుకున్నాడు.