Nara Lokesh: పది రోజులుగా రిమాండ్ ఖైదీగా చంద్రబాబు.. చంపేందుకు కుట్ర..లోకేష్ సంచలన ఆరోపణ

ఈ నెల 10న అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో చంద్రబాబును సిఐడి అదుపులోకి తీసుకుంది. అటు తరువాత విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలించింది. అక్కడ న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

Written By: Dharma, Updated On : September 21, 2023 3:26 pm

Nara Lokesh

Follow us on

Nara Lokesh: చంద్రబాబు భద్రతపై సర్వత్రా ఆందోళన వ్యక్తం వ్యక్తమవుతోంది. గత పది రోజులుగా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనకు కేటాయించిన బ్యారక్ చుట్టూ అపరిశుభ్ర వాతావరణం ఉందని.. దోమలు విపరీతంగా ఉన్నాయని ఆయన భార్య భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. మూలాఖత్ లో చంద్రబాబును కలిసిన తర్వాత.. ఆయన భద్రతపై భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు కుమారుడు లోకేష్ తన తండ్రికి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రకటించారు.

ఈ నెల 10న అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో చంద్రబాబును సిఐడి అదుపులోకి తీసుకుంది. అటు తరువాత విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలించింది. అక్కడ న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.అప్పటినుంచి రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు ప్రత్యేక వసతులు కల్పించాలని కోర్టు ఆదేశించింది. కానీ అరకొరగానే వసతులు అందిస్తున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో 1800 మంది ఖైదీలు ఉన్నారు. జైలులో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. కేవలం 400 మంది సిబ్బంది షిఫ్ట్ ల వారీగా విధుల్లో ఉన్నారు. ఖైదీల్లో సైతం కరుడుగట్టిన నేరస్తులు ఉన్నారు. చంద్రబాబుకు కేటాయించిన స్నేహ బ్లాక్ రెండంతస్తుల భవనము. దీనిలో దాదాపు 30 పెద్ద గదులు ఉంటాయి. గదులు ఖాళీగా ఉంటే ఈ బ్లాక్ భయానకమే.

అరకొర సౌకర్యాల నడుమే చంద్రబాబు సెంట్రల్ జైల్లో పది రోజులు పాటు రిమాండ్ ఖైదీగా గడిపారు. చంద్రబాబు ఉన్న స్నేహ బ్లాక్ ను గతంలో మానసిక రుగ్మతలతో బాధపడే ఖైదీలకు వినియోగించేవారు. ప్రస్తుతం ఆ బ్లాక్ లో ఒక గదిని చంద్రబాబుకు కేటాయించారు. చుట్టూ చెట్లు ఉండడంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో చంద్రబాబు అసౌకర్యానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఇదే జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజమండ్రి రూరల్ మండలం ధవలేశ్వరానికి చెందిన గంజేటి వీర వెంకట సత్యనారాయణ జ్వరంతో మృతి చెందారు. ఆయన డెంగ్యూతో మరణించినట్లు తెలుస్తోంది.

ఈ తరుణంలో చంద్రబాబు ఆరోగ్యం పై లోకేష్ ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబును జైల్లోనే అంతమొందించడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. జైలులో విపరీతంగా దోమలు కుడుతున్నాయని చెప్పినా.. అధికారులు వినక పోవడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికి కుట్రేనని ఆరోపించారు. సైకో కుతంత్రాలు అమలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబుకు ఏం జరిగినా సైకో జగన్ దే బాధ్యత అంటూ లోకేష్ హెచ్చరించారు.